– నిధుల వినియోగం పై పోలవరం ప్రాజెక్ట్ అధికారులకు శిక్షణ
– శిక్షణ నిచ్చిన పీ ఎఫ్ ఎం ఎస్ అధికారుల బృందం
పోలవరం: పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అందచేసే నిధుల వినియోగానికి ఈ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ను సింగల్ నోడెల్ ఏజెన్సీ(ఎస్ ఎన్ ఏ )గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఖాతాను తెరవటంతో పాటు ఇప్పటికే రూ. 392 కోట్లను ఆ ఖాతాకు బదిలీ చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగం ఎలా చేయాలనే అంశం పై పబ్లిక్ ఫైనాన్సియల్ మేనెజ్మెంట్ సిస్టం (పీ ఎఫ్ ఎం ఎస్ ) ఆంధ్ర ప్రదేశ్ విభాగం అసిస్టెంట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ప్రియాంక నషినే , సీనియర్ ఏ ఓ శ్రవణ్ కుమార్, తదితర అధికారులు సోమవారం ప్రాజెక్ట్ అధికారులకు శిక్షణ నిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలోని సి ఈ కార్యాలయంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. పీఎఫ్ఎంఎస్-ఎస్‌ఎన్‌ఏ మాడ్యూల్‌లో పోలవరం ప్రాజెక్టును ఆన్‌బోర్డ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఎస్‌ఎన్‌ఏ ఖాతాను పీఎఫ్ఎంఎస్‌లో ఆన్‌బోర్డ్ చేయడంలో పీఎఫ్ఎంఎస్ బృందం కీలక పాత్ర పోషించి ఎస్‌ఎన్‌ఏ ఖాతా నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలను ఈ శిక్షణలో అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఎస్‌ఎన్‌ఏ ఖాతాకు బదిలీ చేసిన రూ. 392 కోట్లను త్వరలోనే పీఎఫ్ఎంఎస్‌లో వ్యయంగా నమోదు చేస్తారు. శిక్షణ కార్యక్రమంలో పోలవరం సి ఈ నరసింహమూర్తి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.