– వారికి భూములిస్తే మీకెందుకు కడుపు మంట?
– శ్రీవాణి ట్రస్ట్‌పైనా ప్రభుత్వం నిరాధార నిందలు
– టీడీపీ నాయకులు పేకాట క్లబ్బులు నడవడం లేదా?
– వాటిని చూసీ చూడనట్టు వదిలేస్తున్నది నిజం కాదా?
– వాటిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి, వేధించాలని చూస్తారా?
– యర్రగొండపాలెం వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
తాడేపల్లి: ‘పేదలకు మాటలు. కూటమి నాయకులకు మూటలు. వైయస్సార్‌సీపీ నాయకులకు కేసులు’.. అన్నట్లుగా ఉంది కూటమి నాయకుల వ్యవహారం. దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్నా, వాటిపై ఏ హక్కులు లేక, ఇబ్బందులు పడుతున్న లక్షలాది రైతులకు మేలు చేస్తూ, జగన్ ప్రభుత్వం నిషేధిత జాబితా 22–ఏలో ఉన్న భూములను, ఆ ఆంక్షల నుంచి తొలగించింది.చుక్కల భూములు, అసైన్డ్, ఇనాం భూములు, సర్వే ఇనాం, షరతులతో కూడిన పట్టా భూముల విషయంలో నిపుణుల సలహాలతో వారి సూచనల మేరకు, రైతులకు ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించారు.
పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములపై 20 ఏళ్లు పూరై్తన తర్వాత, వాటిపై యాజమాన్య హక్కులు కల్పించాం. అదే విధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు కల్పించాం.
జగన్ ప్రభుత్వ నిర్ణయం వల్ల 27,41,698 ఎకరాలపై 15,21,160 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు హక్కులు కలిగాయి. ఆ భూములు నిషేధిత జాబితా 22–ఏ నుంచి తొలగించడం ద్వారా, వాటిపై వారికి పూర్తి హక్కులు కలిగి, వారు తమ అవసరాల కోసం ఆ భూములు వినియోగించే అవకాశం ఏర్పడింది.
పేదలకు భూములపై హక్కు కల్పిస్తే ప్రభుత్వానికి ఎందుకు కడుపు మంట?. తమకు మాత్రమే మూటలు అన్నట్లుగా, మంత్రి అనగాని సత్యప్రసాద్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 27 వేల ఎకరాలు అసైన్డ్ భూములు రిజిస్టర్ అయ్యాయంటే ఆయనకు ఎందుకు కడుపుమంట?. పేదలు ఎప్పటికీ అలాగే ఉండాలా?. విచిత్రంగా ఇలాంటి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మాట్లాడుతున్నారు. ఈ భూమి పేదవారి వద్దనే ఉంటే వాటిని అడ్డుకోవడానికి ఇలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
దశాబ్దాలుగా చుక్కల భూముల సమస్య పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కారణంగా పేదలు ఇబ్బందులు పడుతుంటే, వాటిపై అధ్యయనం చేసి, ఆ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగింది.
గత ఎన్నికల ముందు రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లకు చేరిందని ఏ విధంగా దుష్ప్రచారం చేశారో.. ఇప్పుడు భూముల విషయంలోనూ అలాగే కొత్త డ్రామాకు తెర తీశారు.ఆ భూముల పట్టాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరాధార ఆరోపణలు చేశారు. ఇది అత్యంత హేయం.
నిజంగా ల్యాండ్ గ్రాబింగ్ నియంత్రణ చేస్తామంటే మేం కూడా స్వాగతిస్తాం. అయితే రాజధాని ప్రాంతంలో అక్రమంగా అసైన్డ్ భూములు కాజేసిన కూటమి నాయకుల మీదనే మొదట చర్యలు తీసుకోవాలి. ఆనాడు అక్రమంగా కట్టబెట్టిన భూమిని వెనక్కి తీసుకోవాలి. మరి ఎంత అసైన్డ్ భూమిని కొల్లగొట్టారో, ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయో వాటి మీద విచారణ జరిపించి పేద ప్రజలకు ఇచ్చే ధైర్యం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా?
రాష్ట్రంలో ఎక్కువ కాలం పాలించిన తెలుగుదేశం పార్టీ.. ఒక్క సెంటు భూమి అయినా దళితుల స్మశానాలకు కేటాయించిందా? వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, స్మశాన వాటికలు లేని 1563 దళిత వాడలు గుర్తించి, వాటికి 951 ఎకరాలు కేటాయించింది. దాని మీదా కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది.
దళిత వాడలకు దూరమైన హిందుత్వాన్ని, శిథిలావస్థకు చేరిన ఆలయాలకు భక్తులను ప్రొత్సహించేలా, శ్రీవాణి ట్రస్టు ద్వారా చేసిన గొప్ప కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం తప్పు బడుతోంది. ట్రస్టుపై నిరాధార ఆరోపణలు చేస్తోంది. శ్రీవాణి ట్రస్టు పేరుతో ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, రూ.10 వేల శ్రీవాణి దర్శనం టికెట్ల నిధులతో దళిత, గిరిజన వాడల్లో హిందుత్వాన్ని పెంచడంతో పాటు, పాత ఆలయాల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలు చేపట్టారు.
ఇప్పుడు శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి, ఆ నిధులను మెయిన్ అకౌంట్లోకి మారుస్తామని చెప్పడం అవినీతికి మార్గం చూసుకోవడమే.మరోవైపు దళితులు, బీసీలను ఆలయాలకు దూరం చేసే కుట్ర చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తోంది.హామీల అమలు లేకపోవడాన్ని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్న వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు, సోషల్ మీడియా వర్కర్లపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది.విచక్షణా రహితంగా అందరిపై ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు.
‘పేకాట ఆడించడం ధర్మమా? అని నేను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే.. ఎస్సై నాకు వాట్సాప్‌లో 41–ఏ నోటీసులు పంపారు. నాపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. ఆ అంశంపై టీడీపీ అనుకూల ఎల్లో మీడియాలోనే కథనాలు వచ్చాయి. వాటినే ఉటంకిస్తూ నేను పోస్టు పెట్టడం తప్పా?. పేకాట క్లబ్బులు నిర్వహించడం వాస్తవం కాదా? పేకాట క్లబ్బులు అనేవి కాసుల కక్కుర్తికి కాకపోతే వాటిలో ప్రజాశ్రేయస్సు ఏముంది? అసెంబ్లీలో మాట్లాడకుండా, సోషల్ మీడియాలో మాట్లాడకుండా, ఇప్పుడు మీడియాలో కూడా మాట్లాడకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు.
ఎంత తొక్కాలని చూస్తే అంత ఎక్కువగా ప్రశ్నిస్తాం. మీరు చేసే అన్యాయాలను ఎండగడతాం. నియంతలైన హిట్లర్, గడాఫీలా వ్యవహరిస్తే భయపడి పారిపోయే రకం తాము కాదని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు.