* ఐవీఆర్ఎస్ సర్వేలో టాప్ ప్లేస్
* సంక్షేమ హాస్టళ్లలో 78.20 శాతంతో అగ్ర స్థానంలో బీసీ హాస్టళ్లు
* విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణలో వెల్లడి
* కూటమి ప్రభుత్వం రాకతో బీసీ బిడ్డల చదువుకు ప్రాధాన్యం
* అధికారంలోకి రాగానే గత ప్రభుత్వపు రూ.110 కోట్ల డైట్ బకాయిల చెల్లింపు
* నాటి నుంచి ఎప్పటికప్పుడు డైట్, కాస్మోటిక్ బిల్లుల మంజూరు
* విద్యార్థుల ఆరోగ్య, ఆహార భద్రతకు పెద్దపీట
* ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్ల ఏర్పాటు
* బీసీ హాస్టళ్లలో మొట్టమొదటిసారిగా ఎఫ్ఆర్ఎస్ శ్రీకారం
* ఎఫ్ఆర్ఎస్ తో ఏడాదిలో రూ.6 కోట్ల ఆదా
* హెచ్.పి.టి.ఎస్. యాప్ తో నిరంతర పర్యవేక్షణ
* ఇటీవల టెన్త్, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన బీసీ విద్యార్థులు
* సత్ఫలితాలచ్చిన మంత్రి సవిత ఆకస్మిక తనిఖీలు, సమీక్షలు
అమరావతి : కూటమి ప్రభుత్వం రాకతో బీసీ బిడ్డల విద్యకు ఆసరాగా నిలిచే హాస్టళ్లు మెరుగైన పనితీరుతో ముందంజలో నిలుస్తున్నాయి. మౌలిక సదుపాయల కల్పన, ఆరోగ్యకరమైన మెనూ, బోధనలతో రాష్ట్ర స్థాయిలో బీసీ హాస్టళ్లు అగ్రగామిగా నిలిచాయి. పరిశుభ్రమైన వాతావరణం, పరిశుద్ధమైన తాగునీటి కల్పన, ఆరోగ్యభద్రతతో కూడిన విద్యను అందించడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల మనస్సును బీసీ హాస్టళ్లు గెలుచుకున్నాయి.
హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వ ఐవీఆర్ సర్వేలో మిగిలిన సంక్షేమ హాస్టళ్లకంటే బీసీ సంక్షేమ హాస్టళ్లు 78.02 శాతం సంతృప్త స్థాయిలతో ప్రథమ స్థానంలో నిలిచి ఔరా అనిపించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1110 బీసీ బాలురు, బాలికల హాస్టళ్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ హాస్టళ్లు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయి. నిధులు విడుదల చేయకపోవడంతో మరమ్మతులు సైతం నోచుకోలేకపోయాయి. కనీసం డైట్ బిల్లు కూడా చెల్లించకపోవడంతో బీసీ బిడ్డలు అర్థాకలితో నరకం చూశారు.
కాస్మోటిక్ ఛార్జీలు సైతం చెల్లించిన పాపానపోలేదు. దినదిన గండంగా ఆ అయిదేళ్లు బీసీ హాస్టళ్లలో చదివే విద్యార్థులు కాలం నెట్టుకొచ్చారు. కూటమి ప్రభుత్వం రాకతో ఇతర సంక్షేమ హాస్టళ్లతో పాటు బీసీ సంక్షేమ హాస్టళ్లకు మంచిరోజులు ప్రారంభమయ్యాయి. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు బీసీ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ముందుగా బీసీ బిడ్డల ఆకలి తీర్చేలా రూ.110 కోట్ల మేర డైట్ బకాయిలను చెల్లించారు.
నాటి నుంచి ఎప్పటికప్పుడు డైట్ బిల్లులు చెల్లిస్తూ వస్తున్నారు. కాస్మోటిక్ ఛార్జీలను సైతం విద్యార్థులకు సకాలంలో చెల్లిస్తున్నారు. 23 నెలల కాలంలో బీసీ హాస్టళ్ల మరమ్మతులు, ఇతర నిర్మాణాల కోసం రూ.100 కోట్లు వెచ్చించారు. రూ.2 కోట్లతో 104 హాస్టళ్లలో విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ అందజేయడానికి ఎస్.ఆర్. శంకరన్ రిసోర్స్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో బీసీ బిడ్డలు 85.99 శాతం ఉత్తీర్ణత సాధించారు.
విద్యార్థుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట
విద్యతోనే బీసీలను అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించగలరన్నది సీఎం చంద్రబాబు ఉద్దేశం. అందుకే బీసీ బిడ్డల విద్యకు, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ బీసీ హాస్టళ్లలో మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 971కి పైగా మరుగుదొడ్ల నిర్మాణం విస్తృతంగా చేపట్టారు. ఇప్పటికే కొన్ని హాస్టళ్లలో నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్నింటిలో మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేయనున్నారు.
అన్ని హాస్టళ్లలో పరిశుభ్రమైన తాగునీరు అందించడానికి రూ.21 కోట్లతో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. దోమల నివారణే లక్ష్యంగా రూ.6 కోట్లు వెచ్చించి, అన్ని హాస్టళ్లలోనూ తలుపులకు, కిటికీలకు దోమ తెరలు ఏర్పాటు చేశారు. హాస్టళ్లలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా రూ.20 కోట్లతో ఇన్వర్టర్లను ఏర్పాటు చేసింది. వంట పాత్రలు, ఇతర సామాగ్రి కోసం రూ.18 కోట్లు అందజేసింది. పౌష్టికాహారం అమలులో భాగంగా హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నారు.
మెనూ సక్రమంగా అమలు కోసం కుక్ లు, కమాటీలను ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. హాస్టళ్లలో పరిశుభ్రత కోసం 1,291 పారిశుధ్య సిబ్బందిని త్వరలో నియమించడానికి చర్యలు చేపట్టింది. బీసీ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు ఆరోగ్య, ఆహార భద్రతతో కూడిన విద్య అందించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం.
ఎఫ్ఆర్ఎస్ తో రూ.6 కోట్ల ఆదా
బీసీ హాస్టళ్లలో నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేయసాగారు. విద్యార్థుల హాజరులో ఆరోపణలకు తావులేకుండా ముఖ ఆధారిత హాజరు(ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా హాస్టల్ సిబ్బందికి సైతం ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేశారు. ఈ వ్యవస్థను అమలు చేయడంతో విద్యార్థుల హాజరు మెరుగవ్వడమే కాకుండా విధి నిర్వహణలో సిబ్బంది సమయపాలన పాటించ సాగారు. అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల మెనూకు అవసరమయ్యే నిత్యావసర సరుకుల దుర్వినియోగానికి అడ్డుకట్టపడింది.
దీనివల్ల నెలకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకూ, ఏడాదికి రూ.6 కోట్లకు పైబడి ఆదా అయ్యింది. ఎఫ్ఆర్ఎస్ విధానం మొట్టమొదటిసారిగా బీసీ హాస్టళ్లలో అమలు చేయడం విశేషం. హాస్టల్ సిబ్బందికి కేవలం ఆదేశాలతోనే సరిపెట్టకుండా, విధి నిర్వహణలో పారదర్శకత, పర్యవేక్షణ కోసం హెచ్.పి.టి.ఎస్. యాప్ ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా వార్దెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు, డీబీసీడబ్ల్యూవోల పనితీరును ఈ యాప్ ద్వారా మరింత మెరుగుపరచడానికి వీలుకలిగింది. హాస్టళ్లలో మెనూ అమలు, పరిశుభ్రత, మరుగుదొడ్లు, తాగునీటి కల్పనపై ఏ రోజుకారోజు ఫొటోలను ఈ యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల హాస్టళ్లలో పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం రాష్ట్ర స్థాయి అధికారులకు కలిగింది.
ఐవీఆర్ఎస్ సర్వేలో బీసీ హాస్టళ్లు టాప్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీ హాస్టళ్ల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించించి. రూ.వందల కోట్లు వెచ్చిస్తూ, విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వసతి అందిస్తోంది. నిధులు విడుదలతోనే చేతులు దులుపుకోకుండా, అంతిమంగా విద్యార్థులకు ఫలాలు అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టంది. ఈ సర్వేలో భాగంగా నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి, బీసీ హాస్టళ్ల పనితీరుపై ఆరా తీయసాగింది. ఈ సర్వేలో మిగిలిన సంక్షేమ హాస్టళ్ల కంటే బీసీ హాస్టళ్ల నిర్వహణ భేషుగ్గా ఉన్నట్లు వెల్లడైంది.
2025-26 విద్యా సంవత్సరంలో రెండు పర్యాయాలు ఐవీఆర్ సర్వే ద్వారా ప్రభుత్వం తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించింది. గతేడాది డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 26 వరకూ మొదట విడతగా, ఈ ఏడాది మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వరకూ రెండో విడతగా ఐవీఆర్ఎస్ సర్వేగా తల్లిదండ్రులు అభిప్రాయాలు తీసుకుంది.
హాస్టల్ నిర్వహణా తీరు ఎలాగుంది… వార్డెన్ల పనితీరు… మెనూ సక్రమంగా అమలు చేస్తున్నారా..? అని మూడు ప్రశ్నలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సమాధానం రాబట్టారు. మొదటి విడత సర్వేలో 71.30 శాతం. రెండో విడతలో 78.20 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేశారు. మిగిలిన సంక్షేమ హాస్టళ్లకంటే బీసీ హాస్టళ్ల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులిచ్చిన సంతృప్త స్థాయి అధికంగా ఉండడం విశేషం.
మంత్రి సవిత నిరంతర పర్యవేక్షణతో సత్ఫలితాలు
గత ప్రభుత్వంలో బీసీ హాస్టళ్లకు నిధులు మంజూరు చేయకపోవడమే కాకుండా పర్యవేక్షణకు సైతం నోచుకోలేకపోయాయి. జగన్ ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు హాస్టళ్లను సందర్శించిన పాపానపోలేదు. మొక్కుబడిగా అయిదేళ్ల కేవలంలో ఒకట్రెండు హాస్టళ్లను సందర్శించి మమ అనిపించేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడం, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్.సవితకు సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించడంతో బీసీ హాస్టళ్ల దశ తిరిగింది.
బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లను మంత్రి సవిత సందర్శిస్తూ వస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ, నేరుగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని, అక్కడికక్కడే వాటికి పరిష్కారం చూపుతూ వస్తున్నారు. డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలతో తరుచూ సమీక్షా సమావేశాలు నిర్వహించి, మెనూ అమలు, హాస్టళ్ల అభివృద్ధి, విద్యార్థులను పరీక్షలకు సన్నదద్ధతపై దిశానిర్దేశం చేయసాగారు. అటు కూటమి ప్రభుత్వం, ఇటు మంత్రి సవిత నిరంత పర్యవేక్షణతో టెన్త్, ఇంటర్ లో బీసీ హాస్టళ్ల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు.