Suryaa.co.in

Andhra Pradesh

త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ రంగానిదే భవిష్యత్తు

పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం రాష్ట్ర స్థాయి వెబినర్

త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ రంగంలో వెల్లువెత్తుతున్న ఉపాధి అవకాశాలను పాలిటెక్నిక్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. సాంకేతిక విద్యా శాఖ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ (సిఇఎంఎస్- విశాఖపట్నం) సహకారంతో బుధవారం రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల అధ్యాపకులు, విద్యార్థుల కోసం త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీస్‌పై వెబినార్‌ను నిర్వహించారు.

పరిశ్రమ నిపుణులచే సమన్వయంతో నిర్వహించే వెబినార్లు పరిశ్రమలు అనుసరిస్తున్న నూతన సాంకేతిక పద్ధతులపై ఖచ్చితమైన అవగాహన కలిగిస్తాయని నాగరాణి అన్నారు. సదస్సులో కీలక ఉపన్యాసం చేసిన ప్రింటెలిటిక్స్ – బెంగుళూర్ సహా వ్యవస్థాపకుడు డాక్టర్ అభిషేక్ శాస్త్రి మాట్లాడుతూ త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ విభిన్న రంగాలలో కీలక పాత్రను పోషిస్తుందన్నారు.

సిఇఎంఎస్ సిఇఓ సేతు మాధవన్, సిఓఓ గోపికృష్ణ మాట్లాడుతూ తయారీ, మౌలిక సదుపాయాలు, మేరీటైమ్ రంగాలలో నైపుణ్యాభివృద్ధి పరంగా సిఇఎంఎస్ పాత్రను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 55 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల నుండి 1,432 మంది విద్యార్థులు, 264 మంది మెకానికల్ , ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు ఈ వెబ్‌నార్ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో శాఖ సంయుక్త సంచాలకులు వెలగా పద్మారావు, ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE