Suryaa.co.in

Andhra Pradesh

భారీ వర్షాలతో 45 మంది మృతి

– 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం
– ఒక్క ఎన్టీఆర్ జిల్లా లోనే 35 మంది మృతి
-473 పశువులు, 71,639 కోళ్లు మృతి

అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 45 మంది మృతి చెందినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలియచేసింది. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 35 మంది మృతి చెందారని వెల్లడించింది. రాష్ట్రంలో సగటు కంటే 30 శాతం మేర అదనపు వర్షం కురిసిందని స్పష్టం చేసింది. వర్షాలు, వరదలకు సంబంధించి 7.49 కోట్ల హెచ్చరిక సందేశాలను పంపినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణా సంస్థ తెలియచేసింది.

261 ప్రాంతాలు జలమయం: రాష్ట్ర వ్యాప్తంగా 1.81 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అలాగే 20 జిల్లాల్లో 20 లక్షల 5 వేల మంది రైతులు ప్రభావితం అయ్యారని స్పష్టం చేసింది. ఇక వరదల కారణంగా 19,686 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు తెలియచేసింది.

వర్షాలు వరదల కారణంగా పట్టణాలు, నగరాల్లో 261 ప్రాంతాలు జలమయం అయ్యాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం 162 ప్రాంతాల్లో నుంచి నీటిని తొలగించి యథాపూర్వ స్థితికి తెచ్చినట్టు ప్రకటించింది.

LEAVE A RESPONSE