Suryaa.co.in

Andhra Pradesh

కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో వరద బాధితులను ఆదుకోవాలి

– నీటిపారుదల రంగ నిపుణులు టి. లక్ష్మీ నారాయణ

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో వరద బాధితులను ఆదుకోవాలని నీటిపారుదల రంగ నిపుణులు టి. లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో బుడమేరు నేర్పిన గుణపాఠాల పై జరిగిన చర్చా గోష్టికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

టి. లక్ష్మి నారాయణ ప్రసంగిస్తూ బుడమేరు వరదలు ప్రజలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అపార నష్టం కలిగించిందని ఇలాంటి ఉపద్రవం భవిష్యత్తులో జరగకుండా బుడమేరు సహజ ప్రవాహ మార్గాన్ని కొల్లేరు సరస్సు వరకు సుగమం చెయ్యాలని, ఆక్రమణలను, కబ్జాలను తొలగించాలని, బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదికి 37,500 క్యూసెక్ ల ప్రతిపాదిత సామర్ధ్యాన్ని యుద్ధ ప్రతిపాదికన అమలులోకి తీసుకుని రావాలని కోరారు.

గత 8 రోజులు గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషిని అభినందనీయమన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 45% ఉండగా, బుడమేరు 48 7 శాతంగా ఉందన్నారు. ఇలాంటి బుడమేరును విస్మరించారన్నారు. వెరగలేరు రెగ్యులేటర్ వద్ద 11 లాకులు ఉంటే వాటిని ఎత్తడానికి ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లు పనిచేయడం లేదని, దాని నిర్వహణకు సిబ్బంది కూడా లేరని తెలిపారు.

పులిచింతల దిగువ భాగంలో వైకుంఠపురం వద్ద 20 టీఎంసీ ల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మిస్తే మున్నేరు వరద నీటిని నిల్వ చేసుకోగలమన్నారు. వైకుంఠపురం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్ కుడి కాలువకు నీరు తరలించి వినియోగించుకోవచ్చని, గోదావరి – కృష్ణ – పెన్నా నదుల అనుసంధానానికి తోడ్పడుతుందన్నారు. శ్రీశైలం పై భాగాన కృష్ణా నదిపై సిద్దేశ్వరం ఆనకట్టను, అలాగే కృష్ణా నదిలో కలిసే తుంగభద్ర పై సుంకేసుల ఆనకట్టకు పై భాగాన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయరును నిర్మిస్తే కరువు పీడత ప్రాంతాలైన రాయలసీమకు నీరు అందించగలమన్నారు.

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ.. సహజ సిద్ధమైన నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణ లను తొలగించాలన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవను అభినందించారు. వైకాపా పాలనలో నీటి పారుదల ప్రాజెక్టులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని బడ్జెట్ లో అతి స్వల్ప కేటాయింపులు జరిగాయన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలు క్రీస్తుపూర్వం నుండి కొనసాగుతున్నాయని ఎలాంటి ముప్పుకు ఆస్కారం లేదని తెలిపారు. నదులకు కూడా జీవం ఉంటుందని వాటి జీవహక్కులను కాపాడాలన్నారు.

జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణలో అమలవుతున్న హైడ్రా లాంటి సంస్థను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేసి నాలాలు, వాగులు, సరస్సులు, నదుల ఆక్రమణ లను , కబ్జాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు. వైకాపా ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 8న 198 సాగునీటి పనులు ఒక్క కలం పోటు తో రద్దు చేసిందని బుడమేరు ఆధునీకరణను కొనసాగించ లేదన్నారు.

ప్రపంచంలో ప్యారిస్, లండన్, న్యూయార్క్ లాంటి నగరాల మద్య నుండి నదులు ప్రవహిస్తున్న వాటిని ఆయా నగరాలు సక్రమంగా వినియోగించుకుంటున్నాయని తెలిపారు. లంక గ్రామాల్లో దాదాపు రెండు లక్షల హెక్టార్లలో పంటలు ధ్వంసం అయ్యాయని ఆయా రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. చిన్న తరహా, మద్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులకు, చెక్క డ్యామ్ లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

రాజకీయ విశ్లేషకులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ ప్రసంగిస్తూ రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతూ విష వలయంగా మారి నాణ్యతకు, ప్రమాణాలకు తిరోగతి కలిగిస్తున్నాయాన్నారు.

చర్చా గోష్టిలో నేస్తం సహా వ్యవస్థాపకులు టి. ధనుంజయ్ రెడ్డి, అవధానుల హరి, పీ .పోతురాజు, మానవత కోశాధికారి టి. వి. సాయిరాం, రైతు సంఘ నేత కొల్లి రంగారెడ్డి, ప్రోగ్రెసివ్ ఫోరం అధ్యక్షులు పి. మల్లికార్జునరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి పీ. శేషు బాబు ,ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ సుందర రామయ్య విద్యావేత్త కన్నారెడ్డి తదితరులు ప్రసంగించారు.

LEAVE A RESPONSE