– సస్పెన్షన్ కాలాన్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు
– ఏడాది తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత
– క్లీన్‌చిట్ ఇచ్చిన ఐఏఎస్‌ల కమిటీ
– పెండ్యాలను వేధించిన జగన్ సర్కార్
– మనీ లాండరింగ్ తప్పుడు ఆరోపణతో సస్పెండ్
– ఆధారాలు చూపలేక చేతులెత్తేసిన జగన్ సర్కారు
– సర్కారుకు దరఖాస్తు చేసుకున్న శ్రీనివాస్
– మూడునెలలు పరిశీంచిలన ఐఏఎస్‌ల కమిటీ
-సస్పెన్షన్ ఎత్తేస్తూ సర్కారుకు సిఫార్సు
( సుబ్బు)
చంద్రబాబునాయుడు వద్ద ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో సుదీర్ఘకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌పై జగన్ సర్కారు అక్రమంగా విధించిన సస్పెన్షన్‌ను ప్రభుత్వం తాజాగా ఎత్తేసింది. అందుకోసం 3 నెలల క్రితం వేసిన ఐఏఎస్ కమిటీ, శ్రీనివాస్‌పై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. దానితో ఆయన ఏడాది సస్పెన్షన్ కాలాన్ని, రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. శ్రీనివాస్ ప్లానింగ్ డిపార్టుమెంట్‌లో జాయింట్ కలెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు.
చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన కారణంగా శ్రీనివాస్‌ను, గత జగన్ ప్రభుత్వం మనీలాండరింగ్ కేసు పేరుతో సస్పెండ్ చేసింది. అయితే ఆ ఆరోపణలను ఇప్పటిదాకా నిరూపించలేకపోయింది. కానీ ఏడాదిపాటు ఆయన కుటుంబాన్ని మానసికంగా వేధింపులకు గురిచేసింది. వివిధ కంపెనీల నుంచి చంద్రబాబునాయుడుకు వచ్చిన నిధులను, ఆయన ద్వారా తీసుకున్నారన్నది జగన్ ప్రభుత్వ ఆరోపణ.
కాగా అధికారం మారిన నేపథ్యంలో.. తనపై విధించిన సస్పెన్షన్ తొలగించాలని, గత ప్రభుత్వం కక్షసాధింపుల కోసమే తనపై సస్పెన్షన్ విధించిందంటూ శ్రీనివాస్ ప్రభుత్వానికి మూడు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. సహజంగా సీఎం చంద్రబాబునాయుడు వద్ద సుదీర్ఘకాలం పీఎస్‌గా పనిచేసిన అధికారి దరఖాస్తు, పంచకల్యాణి గుర్రం కంటే వే గంగా కదలాలి. వెంట వెంటనే అన్ని స్థాయుల్లోనూ సంతకాలు అయిపోవాలి. కానీ బాబు సర్కారు, శ్రీనివాస్ విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరించింది.
నలుగురు జాయింట్ సెక్రటరీలు, జీఏడీ క్యాబినెట్ సెక్రటరీతో కూడిన ఒక కమిటీకి శ్రీనివాస్ వ్యవహారాన్ని అప్పగించింది. వారు 3 నెలల పాటు శ్రీనివాస్‌ను విచారించి, ఆయన వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించారు. అన్నీ విచారించిన కమిటీ.. గత ప్రభుత్వం చేసిన ఆరోపణలు రుజువు కాకపూవడంతో, శ్రీనివాస్ సస్పెన్షన్ ఎత్తేయని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దానికి ఇంత కాలం పట్టింది.
అదే జగన్ సర్కారులో అయితే.. నిబంధనలు పక్కనపెట్టి, అనుకున్న వారికోసం కేవలం రోజుల్లోనే ఫైళ్లు పంచకల్యాణి గుర్రంలా పరుగులు తీసేవి. అదే జగన్-చంద్రబాబుకూ తేడా. ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయడం ద్వారా, ప్రభుత్వం నిబంధనల ప్రకారమే వ్యవహరించిందన్న సంకేతాలు పంపినట్లయింది.
కాగా ఇప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంలో ఏ సీఎం వద్ద పనిచేసిన పీఎస్ స్థాయి అధికారులపై, తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వైఎస్ నుంచి అంతకుముందు పనిచేసిన ముఖ్యమంత్రులెవరూ, ఆ స్థాయికి దిగజారలేదు. చివరికి సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్‌లపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాకపోతే వారికి అప్రాధాన్య పోస్టింగులు ఇవ్వడమో, అసలు పోస్టింగు లేకుండా చేయడం వరకే పరితమయ్యేవారు. కానీ జగన్ తొలిసారిగా ఒక పీఎస్ స్థాయి అధికారిపై కక్షసాధించిన వైనం.. ఆయన స్థాయి తక్కువ తనం, కక్షసాధింపు మనస్తత్వానికి అద్దం పట్టింది.