Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌

– మూడేళ్ల‌ల్లో రూ.12వేల కోట్లు పీడీయ‌స్ బియ్యం ఎగుమ‌తి చేశారు
– రేషన్ మాఫియా పై ఉక్కు పాదం
– బియ్యం అక్ర‌మ ర‌వాణా ప్ర‌క్షాళ‌నలో భాగంగా అధికార యంత్రాంగం మీడియాతో క‌లిసి పనిచేస్తాం
– మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆక‌స్మిక త‌నిఖీల్లో అక్ర‌మాలు వెలుగులోకి

విశాఖ‌ప‌ట్నం:- ప్ర‌జ‌ల‌కు అందాల్సిన రేష‌న్ బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ఉక్కుపాదం మోపామ‌ని రాష్ట్ర ఆహార మ‌రియు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ పేర్కొన్నారు.

సోమ‌వారంనాడు ఆయ‌న విశాఖ పోర్టును ఆకస్మిక తనిఖీ చేశారు. బియ్యం స్మగ్లింగ్‌కు గేట్ వే గా వైజాగ్ పోర్ట్ మారింద‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల నేప‌ధ్యంలో మంత్రి మనోహర్ అకస్మిక తనిఖీల్లో అక్రమ రవాణా పెద్ద ఎత్తున బ‌య‌ట‌ప‌డింది.

కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ ట‌న్నుల పీడీఎస్ బియ్యం ప్ర‌త్యేక బృందాలు సీజ్ చేసిన‌ట్లు మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తెలిపారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో రెండు నెలలుగా విశాఖ పోర్ట్‌ను ఎంచుకున్నట్లు గుర్తించామ‌ని పేర్కొన్నారు. దీనిపై మ‌రింత లోతుగా విచార‌ణ చేప‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఊహించ‌ని విధంగా కాకినాడ పోర్టులో కోటి 38ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు, అదేవిధంగా విశాఖ‌ప‌ట్నంలో దాదాపు 36వేల మెట్రిక్ ట‌న్నులు రేష‌న్ బియ్యాన్ని మూడు సంవత్స‌రాల‌లో ఎగుమ‌తి చేశార‌ని తెలిపారు. సుమారుగా అంచ‌నా వేసుకుంటే అక్ర‌మంగా త‌ర‌లించిన బియ్యం విలువ రూ.12వేల కోట్లు ఉంటుంద‌ని పేర్కొన్నారు.

కాకినాడ పోర్టులో నిఘా పెంచ‌డంతో విశాఖ పోర్టు నుండి గ‌త రెండు నెల‌ల కాలంలో 70వేల మెట్రిక్ ట‌న్నుల బియ్యం త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. ఇటీవ‌ల అధికారుతో స‌మీక్షా స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌ను అప్ర‌మ‌త్తం చేశామ‌న్నారు. ప‌క్కా స‌మాచారం ఆధారంగానే త‌నిఖీలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.

రెండు పోర్టుల్లో నిఘాను పెంచామ‌ని ఈ క్ర‌మంలో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం త‌ర‌లిస్తున్న‌ట్లు త‌నిఖీల్లో బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. అన‌కాప‌ల్లిలో కూడా త‌నిఖీలు జ‌రుపుతామ‌న్నారు. రాబోయే రోజుల్లో రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌ను అడ్డుకునేందుకు ఉక్కుపాదంతో ముందుకు వెళుతున్నామ‌ని అందులో భాగంగా రాష్ట్ర, కేంద్ర‌ ప్ర‌భుత్వాలు క‌లిసి రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌ను అరిక‌డ‌తామ‌న్నారు.

దాదాపుగా కోటి 48ల‌క్ష‌ల కార్డుదారుల‌కు ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేయాల్సిన బియ్యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించి క్వాలిటీ ఆఫ్ రైస్ ప్రాక్ట్ ఆఫ్ ఇండియా పేరుతో ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నార‌ని త‌ద్వారా వేల కోట్లు సంపాదించుకుంటున్నార‌ని తెలిపారు. ఫ‌లితంగా రాష్ట్రానికి చెడ్డ పేరు వ‌స్తుంద‌న్నారు. ఇత‌ర దేశాల‌లో చాలామంది పేద‌లు ఈ బియ్యాన్ని తీసుకునే విధంగా అక్ర‌మార్కులు తెగ‌బ‌డుతున్నార‌ని చెప్పారు.

అక్ర‌మ ర‌వాణాను అడ్డుకునేందుకు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సీఐడీ ద్వారా సిట్‌ను ఫామ్ చేశార‌ని తెలిపారు. విశాఖ‌లో ప‌ట్టుబ‌డ్డ బియ్యం అక్ర‌మ రవాణాపై సిట్‌కు నివేదిక అంద‌జేస్తామ‌న్నారు.

బియ్యం అక్ర‌మ ర‌వాణా సాగ‌కుండా ప్ర‌క్షాళ‌న చేయ‌డంలో అధికార యంత్రాంగం, మీడియాతో క‌లిసి ప‌నిచేస్తామ‌న్నారు. మ‌న దేశం గురించి, భ‌ద్ర‌త గురించి అంద‌రం ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణాను అడ్డుకునేందుకు దాదాపు రూ.12,800 కోట్ల మేర ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు చెప్పారు. ఎట్టి ప‌రిస్తితుల్లోనూ రేష‌న్ బియ్యం ఎగుమ‌తి కాకుండా అక్ర‌మార్కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

LEAVE A RESPONSE