Suryaa.co.in

Andhra Pradesh

కాపులకు ఐదు శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలి

-పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రతిపాదనల వెనుక ఎవరున్నారు?
-పవన్ కళ్యాణ్ పై తప్పుడు కేసులు బనాయిస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం
-ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఐదు శాతం ఎకనామికల్ బ్యాక్ వర్డ్ సెక్షన్ ( ఈ డబ్ల్యూ ఎస్ ) రిజర్వేషన్లను ఆర్ధిక వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్న కాపులకు కల్పించాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాపులకు ఐదు శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే నన్నారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదన్నారు. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు అమలుపై హైకోర్టు, సుప్రీం కోర్టులు ఎటువంటి స్టేలు ఇవ్వనప్పటికీ, రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు.

ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఇకనైనా మొసలి కన్నీరు కార్చడం మాని కాపులకు జరిగిన అన్యాయాన్ని కొద్దిలో కొద్దిగానైనా సరి చేయాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల వెనుక గూడుపుఠాణి దాగి ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రామాయపట్నం లో 43 వేల కోట్ల రూపాయలతో సోలార్ ఎక్విప్మెంట్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇండోసోల్ అనే కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యజమాని నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి రెండు వేల ఎకరాల భూమిని కేటాయించాలని కోరారన్నారు .

ఇక ప్లాంట్ కోసం వినియోగించనున్న 40 శాతం విద్యుత్తును నాలుగు రూపాయల చొప్పున సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన ఆయన , మిగిలిన విద్యుత్ అవసరాల కోసం 7200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఇందులో 2200 మెగా వాట్ల పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్, 1500 మెగా వాట్ల విండ్ పవర్ ప్లాంట్, 3500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిపాదించారన్నారు.

విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం కర్నూలు జిల్లాలోని కొలిమిగుంట్ల, కడప జిల్లాలోని కంబాల దిన్నె లో భూములను కేటాయించాలని కోరారన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ గ్రీన్ పవర్ కార్పొరేషన్ పేరిట కొలిమిగుండ్ల లో పదివేల ఎకరాల భూమిని సేకరించిందని తెలిపారు. అలాగే కంబాల దిన్నె లో 374 ఎకరాల భూమిని సేకరించినట్లు వివరించారు. కొలిమిగుంట్ల, కంబాల దిన్నెలలో తాను ప్రతిపాదించిన రెండు ప్లాంట్ల ఏర్పాటుకు భూమిని కేటాయించాలని నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి కోరడం , రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం జరిగిపోయిందన్నారు.

పంపుడ్ పవర్, సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు నెడ్ క్యాప్ అనే సంస్థ పర్మిషన్లను ఇస్తుందని, అదా నీ, గ్రీన్కో సంస్థకు ఇచ్చిందన్నారు. విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఒకో మెగావాట్ కు లక్ష,75 వేల రూపాయలు, పంపుడ్, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు 25 వేల రూపాయల చొప్పున 60 రోజుల్లో చెల్లించాలని ఇండో సోల్ సంస్థకు లేఖ రాసిందని తెలిపారు. దానికి ఇండో సోల్ సమస్త స్పందిస్తూ తాము రాష్ట్రంలో 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నామని, తమకు కేటాయించే భూముల్లో మౌలిక వసతులు కల్పించాకే డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

భూముల అమ్మకానికి అయితే 5 లక్షల రూపాయలు, ఏటా లీజుకు అయితే 31 వేల రూపాయలు చెల్లించాలని నెడ్ క్యాప్ కోరగా, తాము రాష్ట్రంలో విపరీతమైన పెట్టుబడులను పెడుతున్నామని తమకు మూడు లక్షల రూపాయలకే ఎకరా భూమి కేటాయించాలని కోరారు అన్నారు. కంబాల దిన్నె లో ఎండోసోల్ సంస్థ ఏర్పాటు చేయనున్న ప్లాంట్ కు 10 వేలఎకరాల భూమి , కడప జిల్లాలో 3600 ఎకరాల భూమి కావాలని అడిగారు. గతంలో ఏపీ గ్రీన్ పవర్ కార్పొరేషన్ పేరును ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ గా పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే సేకరించిన 13,600 ఎకరాల భూములను ఇండో సోల్ కు ఫీజులు చెల్లిస్తే కేటాయించేందుకు సూత్రప్రాయంగా సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఇటీవల తమ ప్రభుత్వం శిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు ఖరీదైన స్మార్ట్ మీటర్ల సరఫరా ఆర్డర్ ఇవ్వలనుకున్నారు. ఆ కంపెనీ వార్షిక లాభం 40 నుంచి 50 కోట్ల రూపాయలకు మించి ఉండదని, అటువంటి కంపెనీ యజమాని 76 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. ఇంత పెద్ద మొత్తం పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీ వెనక ఎవరున్నారని ప్రశ్నించారు.

సాక్షాత్తు కుబేరుడు పెట్టుబడి పెట్టలేడు
రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మెగావాట్ల సోలార్ పార్కుల ఏర్పాటుకు విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేశారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఒక్కొక్క మెగా వాట్ కు ఐదు ఎకరాల చొప్పున రెండున్నర లక్షల ఎకరాల భూమిని కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారని తెలిపారు. 50వేల మెగావాట్ల సోలార్ పార్కుల ఏర్పాటుకు దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమన్న ఆయన, రెండున్నర లక్షల కోట్లతో పాటు, రామాయపట్నంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ఎక్విప్మెంట్ ప్లాంట్ కు మరో 76 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను పెట్టేందుకు విశ్వేశ్వర్ రెడ్డి ముందుకు వచ్చారన్నారు .

రామాయపట్నంలో సోలార్ ఎక్విప్మెంట్ ప్లాంట్, విద్యుత్ ప్లాంట్ల విశ్వేశ్వర్ రెడ్డి ప్రతిపాదనలను , క్యాబినెట్ ఆమోదించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఈ లెక్కన ఇండో సోల్ కంపెనీ ప్రమోటరుగా విశ్వేశ్వర్ రెడ్డి 3.15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు ప్రతిపాదనలు చేయడం, అందులో ఇప్పటికే 76 వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగి పోయాయన్నారు . 3.15 లక్షల కోట్ల పెట్టుబడులలో ప్రమోటరుగా విశ్వేశ్వర్ రెడ్డి కనీసం 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులైన సొంతంగా సమకూర్చాలని, ఇన్ని వేల కోట్ల రూపాయల డబ్బులను పెట్టుబడులుగా పెట్టడానికి నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి వెనుక ఎవరున్నారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. వేలకోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం రాష్ట్రంలోనే ఎందుకు పెట్టాలనుకుంటున్నారని నిలదీశారు.

మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవడైనా అంగీకరిస్తారా?
50 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ప్రతిపాదిస్తారా?, దాన్ని మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవరైనా అంగీకరిస్తారా? అంటూ రఘురామకృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు. సూర్యుడు ఉన్నప్పుడు ఉత్పత్తి అయ్యే 50వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరాకు ఎంత నెట్వర్క్ కావాలి… అంత విద్యుత్ సరఫరా డిస్ట్రిబ్యూషన్ అనేది సాధ్యమేనా?? అని అయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడులన్నీ భూ యజ్ఞం కోసమేనా అన్న ఆయన… ప్రమోటర్ కంపెనీ చూస్తే అంత పెట్టుబడులు పెట్టేదిగా లేదని కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంగీకరిస్తుందని విస్మయం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ విషయం గురించి ఆలోచించాలని సూచించారు.

తనను హింసించినట్లుగా… హింసించాలని చూస్తే కష్టం
తనని హింసించినట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తప్పుడు కేసులు బనాయించి హింసించాలనుకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. సిఐడి చీఫ్ సునీల్ కుమార్, మరో సి ఐ డి అధికారి సునీల్ నాయక్, పవన్ కళ్యాణ్ పేర్కొన్నట్లుగా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి లు జనసేనాని పై తప్పుడు కేసులను బనాయించాలనే ఆలోచనలు విరమించుకోవాలని సూచించారు.

ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ కు స్థలం ఇచ్చారన్న కారణంగానే రోడ్డు విస్తరణ పేరిట గ్రామంలోని జనసేన మద్దతుదారుల ఇళ్లను కూల్చివేసినట్లుగా ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారన్నారు. ఇళ్ల ప్రహరీ గోడలను మాత్రమే బద్దలు కొట్టినట్లుగా సాక్షి దినపత్రికలో వార్తా కథనం వచ్చిందన్నారు. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించారని ఆ పత్రిక కథనం లో పేర్కొనడం పరిశీలిస్తే, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు ఎవరో ఒకరు ఫిర్యాదు చేయడం ఈ సునీల్ మరొక సునీల్ ను ఆదేశించడం… పవన్ కళ్యాణ్ పై తప్పుడు కేసులు నమోదు చేయడం జరుగుతుందేమోనన్న అనుమానం తనకు ఉందని అన్నారు.

రాజధాని గ్రామమైన ఇప్పటంపై ఆగ్రహంతో రగిలిపోతున్న తమ పార్టీ పెద్దలకు విశాఖపట్నం అంటే ఎందుకంత ప్రేమ అన్నది జగమెరిగిన సత్యమేనని అన్నారు. విశాఖలో అడ్డగోలుగా భూములు కొనుగోలు చేసి తమ భూదాహాన్ని తీర్చుకోవాలని భావిస్తున్న ప్రభుత్వ, తమ పార్టీ పెద్దలు… ఆ భూముల విలువను పెంచుకోవడానికి విశాఖపట్నం వెళ్లేందుకు ఆరాటపడుతున్నారని విమర్శించారు. శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా శాశ్వతంగా ఉండే పాస్ పుస్తకాలపై, కొంతకాలం ముఖ్యమంత్రి గా ఉండే
జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు ముద్రించుకోవాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాచరిక వ్యవస్థలోనూ ఇలాంటి ఆలోచనలను ఆనాటి ప్రభువులు చేయలేదన్నారు. తమ పేర్లతో పథకాలను ప్రవేశపెట్టడం, తమ ఫోటోలను ముద్రించుకోవడం, వీధి వీధిలో విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం చూస్తుంటే విస్మయం కలుగుతోందన్నారు . ఐదేళ్ల క్రితం పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు పరదాల మాటున పెళ్లికూతురు వలె ఎందుకు నడిచి వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు . ఆయనకి ఇప్పుడేమైనా ప్రాణహాని ఉందా అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా సింహబలుడు చిత్రంలోని ఒక సన్నివేశాన్ని మీడియా ప్రతినిధులకు రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు.

LEAVE A RESPONSE