Suryaa.co.in

Andhra Pradesh

వైకాపా నుంచి త్వరలోనే 50 మంది ఎమ్మెల్యేలు జంప్

-కుదిరితే తెదేపా, జనసేన పార్టీ లలో చేరిక
-లేకపోతే పిల్ల కాంగ్రెస్ నుంచి తల్లి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే ఛాన్స్
-నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

అధికార వైకాపా నుంచి త్వరలోనే ఓ 50 మంది ఎమ్మెల్యేలు కుదిరితే తెలుగుదేశం , జనసేన పార్టీల లో చేరే అవకాశం ఉందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆ రెండు పార్టీలలో చేరడం కుదరకపోతే నిజానికి వారంతా కాంగ్రెస్ వాదులే కాబట్టి నాకున్న సమాచారం మేరకు.. పిల్ల కాంగ్రెస్ నుంచి తల్లి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్నారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఇప్పుడు కాకపోతే 2029లోనైనా బాగుపడతామని ఉద్దేశంతో వారు వైకాపాకు గుడ్ బై చెప్పబోతున్నారన్నారు.

మూడు రాజ్యసభ స్థానాలలో ఒకటి వైకాపా కు దక్కకపోవచ్చు
రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ పదవులలో వైకాపా కు ఒకటి దక్కకపోవచ్చునని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైకాపా నాయకత్వం కంగారుగా మూడేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన తెదేపా శాసనసభ్యులు ఘంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం ద్వారా, వైకాపా ప్రభుత్వం ప్రైవేటీకరణకు మద్దతునిస్తోందని చెప్పకనే చెప్పింది.

వైకాపా నుంచి టిడిపి వైపు వచ్చిన వారిపైనే వేటు వేస్తారా?, లేకపోతే టిడిపి నుంచి అనధికారికంగా వైకాపాలో చేరిన శాసనసభ్యులపై కూడా వేటు వేస్తారా?, ఒకవేళ కేవలం వైకాపా లో గెలిచి తెదేపాకు మద్దతునిస్తున్న నలుగురు శాసనసభ్యులపైనే వేటు వేస్తే కుదురుతుందా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

ఇటువైపు నలుగురు, అటువైపు నలుగురితో పాటు, ఇప్పటికే గంటా శ్రీనివాసరావు పై వేటు వేసిన నేపథ్యంలో 9 మందిని తీసివేస్తే, వైకాపా కచ్చితంగా ఒక సీటు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు. వైకాపా నుంచి రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేయడానికి అప్లికేషన్ కూడా అడిగే పరిస్థితి లేదనిపిస్తోంది. నీ సీటుకు, నీకొక దండం అనే పరిస్థితి నెలకొందన్నారు.

సంక్షోభంలో ఉన్నది జగన్ పార్టీ అయితే… సాక్షిలో మాత్రం తెదేపా, జనసేన సంక్షోభంలో ఉన్నట్లు అడ్డగోలు రాతలు
జగన్మోహన్ రెడ్డి పార్టీ అతిపెద్ద సంక్షోభంలో ఉంటే, సాక్షి దినపత్రిక మాత్రం తెదేపా, జనసేన కూటమి సంక్షోభంలో ఉన్నట్లు తప్పుడు వార్త కథనాలను వండి వారుస్తోందని రఘురామ కృష్ణంరాజు ధ్వజమెత్తారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు సంతకం తో కూడిన ఒక ఫేక్ సీట్ల జాబితాను సోషల్ మీడియాలో వదిలారు.

తెదేపా 113 స్థానాలలో పోటీ చేయనున్నట్లుగా, జనసేన 63 స్థానాలలో పోటీ చేస్తుందనేది ఈ ఫేక్ జాబితా సారాంశం. వైకాపా నాయకత్వం నక్కజిత్తులు, తోడేలు ఆలోచనలలో భాగంగానే ఈ ఫేక్ సీట్ల జాబితాను విడుదల చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం ఉండదు. ఎందుకంటే, ఈ జాబితా తాడేపల్లి ప్యాలెస్ లోనే తయారై ఉంటుంది. దీనితో, వైకాపా నాయకత్వం ఎంత కంగారు పడుతున్నదనేది ప్రజలకు అర్థమవుతూనే ఉందన్నారు.

అన్ని బిజెపికి అంశాలలో మద్దతు ఇచ్చారు… మద్దతు ఇవ్వడం తప్పని తాను అనడం లేదు బిజెపికి అంశాల వారీ గానే మద్దతు ఇచ్చామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలను చెప్పారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. బిజెపికి అన్ని అంశాలలో మద్దతును ఇచ్చారు. మద్దతు ఇవ్వడం తప్పని తాను
చెప్పడం లేదు. వాళ్లు కూడా దానికి తగ్గట్లే సహకరించారని ఇండియా టుడే కాంక్లేవ్ లో జగన్మోహన్ రెడ్డి వెల్లడించారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

మీ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఏనాడు చీల్చలేదు… మీరే మీ కుటుంబానికి అన్యాయం చేశారు
కాంగ్రెస్ పార్టీ తన కుటుంబంలో చిచ్చు పెట్టి చీల్చిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు . కాంగ్రెస్ పార్టీ ఏనాడు వైయస్ కుటుంబాన్ని చీల్చలేదని, వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబానికి అన్యాయం చేశారన్నారు. వైయస్ వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తమ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ… మరి మీ బాబాయ్ కి నువ్వు ఏమి చేశావని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించి నువ్వు బయటకు వచ్చేస్తే, మీ చిన్నాన్న నీ వెంట ఎందుకు బయటకు రావాలి. మీ చిన్నాన్నకు 2004లో నువ్వు చేసింది ఏమిటో తెలియదని అనుకుంటున్నావా?, అప్పుడే అంతా తెలుసు… ఆ తర్వాత ఇంకా స్పష్టంగా తెలుసుకున్నాం. మా చిన్నాన్నను చంపేశారని అంటున్నావు కదా… మరి 2004లో మీ చిన్నాన్న లోక్ సభ టికెట్ ను నూనుగు మీసాల యువకుడివైన నువ్వు ఎందుకు లాక్కోవాలని ప్రయత్నించావని జగన్మోహన్ రెడ్డిని రఘురామ కృష్ణంరాజు నిలదీశారు.

2004లో కడప నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్ సభ టికెట్ జగన్మోహన్ రెడ్డి కే ఇవ్వాలని,మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద నువ్వు, మీ తల్లి విజయమ్మ పంచాయితీ పెట్టింది నిజం కాదా?, వైయస్ రాజశేఖర్ రెడ్డి, వరదరాజులు రెడ్డిని పిలిపించి వైఎస్ వివేకానంద రెడ్డి తో మాట్లాడి నామినేషన్ వేయించాలని కోరింది అబద్ధమా? అంటూ ప్రశ్నించారు.

కడప లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైయస్ వివేకానంద రెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో , వైయస్ జగన్మోహన్ రెడ్డి అలకపాన్పు ఎక్కడం నిజం కాదా అంటూ రఘురామకృష్ణం రాజు శరపరంపరగా ప్రశ్నస్త్రాలను సంధించారు. 2009లో సిట్టింగ్ ఎంపీ అయినా వైఎస్ వివేకానంద రెడ్డి ని కాదని జగన్మోహన్ రెడ్డికి కడప లోక్ సభ టికెట్ ను కట్టబెట్టడం జరిగిందన్నారు.

2004లో వైఎస్ వివేకానంద రెడ్డి గెలిచిన తర్వాత ఆయన్ని ఎంపీ పదవికి రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేయగా, వైఎస్ వివేకానంద రెడ్డి రాజీనామాకు సిద్ధపడగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అంగీకరించలేదని చాలామంది బాహాటంగానే చర్చించుకున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి పై జగన్మోహన్ రెడ్డి చేయి కూడా చేసుకున్నారని అప్పట్లో అందరూ అనుకున్నారు.

చిన్నాన్నను దూరం చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి అయితే చేరదీసింది కాంగ్రెస్ పార్టీ అని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. మీ తండ్రిని ముఖ్యమంత్రిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే నని పేర్కొన్న ఆయన, మిమ్మల్ని తొలిసారిగా ఎంపీని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ యేనని అన్నారు.

మీ చిన్నాన్నకు మంత్రి పదవి ఇస్తే మీకు ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, మీ చిన్నాన్నకు మంత్రి పదవి ఇస్తే మిమ్మల్ని, మీ చిన్నాన్నను కాంగ్రెస్ పార్టీ ఎలా విడదీసినట్లు అవుతుందని ప్రశ్నించారు. సిబిఐ చార్జిషీట్ ప్రకారం వైయస్ వివేకానంద రెడ్డిని ఓం నమశ్శివాయ చేసింది ఎవరో అన్నది చాలా స్పష్టంగా ఉందన్నారు.

వైయస్ వివేకానంద రెడ్డిని పరలోకానికి పంపింది మీ అనుచరులే…
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని పరలోకానికి పంపింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుచరులేనని రఘు రామ కృష్ణంరాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తుంటే, నాకు ఒక కథ గుర్తుకు వస్తుంది. న్యాయస్థానంలో ఒక నిందితుడు తండ్రి లేని వాన్నీ క్షమాబిక్ష పెట్టమని న్యాయమూర్తిని అభ్యర్థించారట. దానికి పక్కనే ఉన్న వ్యక్తి, తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడిగా వీడు బోన్లో నిలబడ్డాడని చెప్పినట్లుగా… మీ చిన్నాన్నను రాజకీయంగా నిరాశ్రయున్ని చేసింది మీరేనని, మీకు సంబంధం లేకపోయినా వైయస్ వివేకానంద రెడ్డిని పైకి పంపించింది మీవాళ్లేనని సిబిఐ అంటోందన్నారు.

మీ చెల్లెల్ని కూడా తమ వైపు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో చిచ్చు పెట్టిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. వైఎస్ షర్మిల మీకోసం కాళ్లు అరిగేలా తిరిగింది. కానీ ఆమెకు మీరు ఎటువంటి పదవి ఇవ్వలేదు. కడప లోక్ సభ పార్టీ టికెట్ తనకు కాదు… షర్మిలకు ఇవ్వమని వైఎస్ వివేకానంద రెడ్డి కోరినప్పటికీ, వైఎస్ షర్మిలకు పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు?

ఒకవేళ అమ్మాయిని రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటే, మరి ఎందుకు పాదయాత్రలు చేయించారు? మీ బావను ఎందుకు చర్చిల చుట్టూ తిప్పారు?. నిజంగానే షర్మిలను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకున్నవారే అయితే ఆమెతో పాదయాత్రలను చేయించడం ఎందుకు?, ఎన్నికల ప్రచారం చేయించడం ఎందుకనీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

2014 ఎన్నికలలో షర్మిల సేవలను పార్టీ కోసం వినియోగించుకున్నారు. 2019 ఎన్నికలలో కూడా ఆమె పార్టీ తరఫున కాళ్లు అరిగేలా ప్రచారం నిర్వహించారు. అయినా ఆమెకు కనీసం పార్టీ పదవి కూడా ఇవ్వలేదు. దీనితో, షర్మిల కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే… మీ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందనడంలో ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కాలేదు.

షర్మిల ను రాజకీయంగా పూర్తిగా వాడుకున్నారు. ఇప్పుడు ఆమె తన దారి తాను చూసుకుంటే… కాంగ్రెస్ పార్టీ మా కుటుంబంలో చిచ్చు పెట్టిందని జగన్మోహన్ రెడ్డి రాద్ధాంతం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

జగన్ రెడ్డి అనడం తప్పని సజ్జల వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది
జగన్ రెడ్డి గారు అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు హోదాలో షర్మిల సంబోధించడంలో తప్పేముందో అర్థం కావడం లేదని రఘు రామ కృష్ణంరాజు అన్నారు. షర్మిల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తప్పని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. అందరికీ బూట్లు నా కావాల్సిన అవసరం లేదు. తోడబుట్టిన వారే అయినప్పటికీ, ప్రజల తరఫున ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారు అని సంబోధిస్తే తప్పేముందన్నారు.

అందుకే ఇకనుంచి జగనన్న అనే సంబోధిస్తానని షర్మిల వారికి దీటైన కౌంటర్ ఇచ్చారు. ఇక షర్మిల వ్యాఖ్యలను తప్పు పట్టడానికి లేదు. ఒక్క షర్మిల కే కాదు… రాష్ట్రంలోని మహిళలందరికీ అన్నగానే జగన్మోహన్ రెడ్డి భావిస్తారు. చిన్నారులకు మామయ్యగా తనని తాను పరిచయం చేసుకుంటారు. కానీ రాష్ట్రంలోని ఏ ఒక్క మహిళను ఆయన ఉద్ధరించింది లేదు.

సొంత చెల్లెళ్లను గాలికి వదిలేశారు. చిన్నాన్న కూతురిపై పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి తో ఫిర్యాదు చేయించి కేసు పెట్టించారు. వాళ్ల జీవితాలను తగలబెట్టింది జగన్మోహన్ రెడ్డి అయితే, తిట్లు మాత్రం కాంగ్రెస్ కా? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని సలహా ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి
రాష్ట్ర విభజన పాపమంతా కాంగ్రెస్ పార్టీ దేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఆర్టికల్ 3 నిబంధన గురించి తెలుసో తెలియదో కూడా తెలియని సమయంలో, ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని దిక్కుమాలిన సలహాను ఇచ్చింది జగన్మోహన్ రెడ్డే నని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో నేను కేసు వేశాను. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కేసు వేసిన తొలి వ్యక్తిని నేనే. దాదాపు కోటి రూపాయలను ఖర్చు చేసి సీనియర్ న్యాయవాది చేత వాదనలను వినిపిస్తుంటే, నన్ను కేసు విత్ డ్రా చేసుకోమ్మని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అప్పుడే నేను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో., శోభనం గదిలోకి పాల గ్లాసుతో వెళ్లిన పెళ్లికూతురు, తాను పెళ్లి చేసుకున్నది నిజమైన మగవాడిని కాదని తెలుసుకొని ఎంత ఆవేదన చెందుతుందో… జగన్మోహన్ రెడ్డి నిజమైన సమైక్యవాది కాదని తెలిసినప్పుడు నాకు అంతే బాధ అనిపించిందని పేర్కొనడం జరిగింది.

రాష్ట్ర విభజన కోసం వైకాపా తరఫున జగన్మోహన్ రెడ్డి లేఖ కూడా ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీకి సిపిఎం పార్టీ మినహాయించి అన్ని పార్టీలు సహకరించాయి. విభజన పాపంలో అందరికీ భాగం ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బాగుంది. విభజన అనంతరం రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే సమయంలో, ప్రజలు మనకు ఇచ్చిన అవకాశం తో చేయాల్సినంత డ్యామేజ్ చేశాము. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన మాట నిజమే అయినప్పటికీ, మీరందరూ సహకరించారన్నది కూడా అంతే నిజమని రఘురామకృష్ణం రాజు అన్నారు.

విజయమ్మను కూడా దేవుడే ఓడించాడా?!
వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమిపాలైనప్పుడు దేవుడే ఆయన్ని ఓడించాడని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, విశాఖపట్నంలో విజయమ్మను కూడా దేవుడే ఓడించారా అని ప్రశ్నించారు. చెల్లెల్ని ఇంటి నుంచి వెళ్లగొట్టి, ఆమెకు మీరే అన్యాయం చేసి, ఇప్పుడు పక్క వారిపై నిందలు వేయడం సబబేనా? అని నిలదీశారు. తన తప్పును తెలుసుకున్న చెల్లి, తన తండ్రిని రాజకీయంగా ఆదరించి ముఖ్యమంత్రిని చేసిన పార్టీలో ప్రముఖ పాత్రను పోషించడానికి వెళ్లారు.గతంలో తన కుటుంబానికి న్యాయం చేసిందని భావించిన ఆమె, ఇప్పుడు తనకు కూడా న్యాయం చేస్తుందని ఆశిస్తోంది.

నాది కాంగ్రెస్ పార్టీ కాదు. మరో పది రోజుల్లో నేను ఏ పార్టీలో చేరుతానో తెలిసిపోతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్దాలను ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ చెబుతున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

అమరావతి నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కసితో రాత్రింబవళ్లు పనిచేద్దాం
అద్భుతమైన అమరావతి నగరాన్ని రాత్రి పగలు అన్న తేడా లేకుండా కసిగా పని చేసి నిర్మించుకుందామని రఘురామకృష్ణం రాజు కోరారు . నష్టపోయిన వారికందరికీ సమయం పోయింది. కొంతమంది జీవితాలను కోల్పోయారు. వాటిని మనము రికవరీ చేయలేము. కానీ మ్యాగ్జిమం డ్యామేజీ నుంచి రికవరీ చేసి అమరావతినీ గొప్ప రాజధాని నగరంగా తీర్చిదిద్దుకుందామన్నారు.

విశాఖపట్నం ను ఆర్థిక నగరంగా, కర్నూలులో హైకోర్టు బెంచిని ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాలకు తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేద్దామన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడంతో పాటు, నూతన పరిశ్రమలను తీసుకువచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా పుంజుకునేలా , సంక్షేమానికి ఎటువంటి లోటు లేకుండా పని చేసే ప్రభుత్వం త్వరలో ఏర్పడనుందన్నారు.

నూతన ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులకు న్యాయం జరిగి, రాష్ట్ర రాజధాని పూర్వ వైభవాన్ని సంతరించుకోనుందని చెప్పారు. ఇప్పటికీ పాలకులు ఏమైనా వెధవ వేషాలు వేస్తే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయని పేర్కొన్నారు.. ఇంకా ఏమైనా అడ్డంకులను సృష్టిస్తే ధైర్యంగా నిలబడి పోరాడుదామని రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు.

పోలవరాన్ని త్వరిత గతిన పూర్తి చేసుకుందామన్న ఆయన, విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణను కూడా కేంద్ర సహకారంతో అడ్డుకుందామని చెప్పారు. సమిష్టిగా కృషి చేస్తూ అద్భుత విజయాలను సాధిద్దామని పిలుపునిచ్చారు.

అమరావతిnమహిళలు, రైతులు, ప్రజల పోరాటానికి విప్లవాభినందనలు
అమరావతి కోసం గత 1500 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న మహిళలు, రైతులు, ప్రజలకు విప్లవాభివందనాలను తెలియజేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇక్కట్లను కల్పిస్తున్న ముఖ్యంగా మహిళలు పోరాట స్ఫూర్తిని కనబరిచారు. అన్యాయం జరిగిన రైతులు తమ శక్తినంత ధారపోసి ఈ ప్రభుత్వ దమన కాండను ఎదిరిస్తున్నారు.

తిరుపతి రావు, శివారెడ్డి, మాదాల శ్రీనివాస్ నాయకత్వంలో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వారికి సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణ రావు, ఉన్నం మురళీధర్ రావు, నర్రా శ్రీనివాస్ వంటి ఎంతోమంది అండదండలను అందించారు. అలాగే సరైన సమయంలో సీనియర్ న్యాయవాదులు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టులో అమరావతి రైతుల పక్షాన వాదనలు వినిపించారు.

ఎంతో శక్తివంతుడైన ముఖ్యమంత్రి గత నాలుగు సంవత్సరాలుగా న్యాయస్థానాలలో , అన్ని మార్గాలను దిగ్బంధనం చేయడం ద్వారా ప్యాలెస్ నిర్మాణం పూర్తి అయినప్పటికీ, అందులో అడుగుపెట్టకుండా చేశారు.
కొలికపూడి శ్రీనివాసరావు వంటి వారు ఈ పోరాటానికి ఎంతో సహకరించారు. అమరావతి ఉద్యమానికి సహకరించిన మీడియాకు, ఎంతోమంది నాయకులకు, ముఖ్యంగా అమరావతి మహిళలకు రైతులకు అభినందనలను తెలియజేయ చేస్తున్నట్టు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

కెసిఆర్ తెలుగులో చెబితే… జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషులో చెప్పారంతే…!
ప్రతి ఒక్కరికి అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. నిరాశ నిస్సృహలో ఉన్న సమయంలో మనసులోని మాట బయటకు వస్తుంది. గత మూడు నెలల క్రితం అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఓడిపోతే, పోతాం… ఓడ గొడితే ఏమి చేస్తాం… ఇంట్లో హ్యాపీగా కూర్చుంటాం అని అన్నారు. కెసిఆర్ తెలుగులో చెప్పిందే… జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడే కాంక్లేవ్ లో ఇంగ్లీషులో నిర్వేదంగా చెప్పారంతేనని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అని ఊదరగొట్టారు. దొంగ ఓట్లను నమ్ముకున్నారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం సీరియస్ గా దృష్టి సారించి 50 లక్షల నుంచి పదిలక్షలకు తగ్గించింది. ఇంకా దొంగ ఓట్లను ఏరి వేసే ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. ఈ ప్రభుత్వం పై ఉద్యోగస్తులు, నిరుద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి మోసగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మహిళలు కూడా తిరుగుబాటు బావుటాను ఎగరవేశారు .

ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు పై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఆసరా మోసం పై అన్ని వర్గాలు ఆగ్రహంతో గుర్రు గా ఉన్నాయి . బీసీ మహిళలకు బీసీ సబ్ ప్లాన్ నుంచి ఆసరా మొత్తాన్ని అందజేస్తారట. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో బీసీ కుల వృత్తుల వారికి పనిముట్లను అందజేసేవారు. ఇప్పుడు అవేవి ఉండవు. ఎస్సీ లకు రుణాలు ఉండవు. అవన్నీ ఎత్తేసి ఆసరా పేరిట జగన్మోహన్ రెడ్డి టోకరా ఇస్తూ కొత్త స్కీం తీసుకొచ్చినట్లు డ్రామా నడిపించారు. సంక్షేమానికి తానే ఆద్యుడు అన్నట్లుగా పూజ్యుడు అన్నట్టు గా చేసుకుంటున్న ప్రచారాన్ని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఇప్పటికీ ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి వదిలివేయడానికి సిద్ధమని, తనకు తన పదవీకాలం సంతృప్తినిచ్చింద జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగించింది. జగన్మోహన్ రెడ్డికి పదవీకాలం ఎందుకంత సంతృప్తినిచ్చిందో అర్థం కాలేదు. లక్ష కోట్ల రూపాయల సంపాదించుకోవాలంటే 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలనుకున్న ఆయన, ఆల్రెడీ తన టార్గెట్ ను పూర్తి చేసుకున్నారేమోనని అన్నారు.

అమరావతి నగర నిర్మాణాన్ని స్మాష్ చేయాలని అనుకున్నారే మో, అలాగే పోలవరం నిర్మాణాన్నీ డిలే చేయాలని భావించారేమో, అలాగే తన అనుయాయులైన కొంతమందికి లబ్ధి చేకూర్చాలనుకుని, అనుకున్న దాని కంటే ఎక్కువగానే లబ్ది చేకూర్చారేమో… తన పదవీకాలంలో ఆయన ఎందుకు సంతృప్తిని పొందారో అర్థం కాలేదన్నారు.

ఇక గతంలో టైమ్స్ గ్రూపుకు 24 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి, నాలుగున్నర కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఇండియా టుడే సంస్థతో కాంక్లేవ్ ఏర్పాటు చేయించుకొని తన అమృత భాషనాన్ని వినిపించారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE