-ఆందోళన వ్యక్తం చేసిన అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య
-విజయవాడలో ఘనంగా 55వ బ్యాంకుల జాతీయీకరణ దినోత్సవం
-సామాజిక అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల పయనం: కిషోర్ కుమార్
-దేశ నిర్మాణంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర అమూల్యం : వైవి సత్యన్నారాయణ
దేశ సర్వతోముఖాభివృద్దిని కాంక్షిస్తూ నాడు తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యం నీరుగారుతోందని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశంలో 55వ బ్యాంకుల జాతీయీకరణ దినోత్సవం సందర్భంగా అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య నేతృత్వంలో నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిపాలనా కార్యాలయం వద్ద బుధవారం ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సమాఖ్య జాతీయ ప్రదాన కార్యదర్శి కిషోర్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి వైవి సత్యన్నారాయణ మాట్లాడుతూ దేశ నిర్మాణ ప్రక్రియలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన అత్యావశ్యకమన్నారు. సామాజిక లక్ష్యాలను అనుసరించి ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కొలమానాలలో ప్రైవేట్ రంగ బ్యాంకులను మించి పని చేస్తున్నాయన్నారు.
జన్ ధన్ ఖాతాల పరంగా 16.5 బిలియన్ల ఖాతాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రారంభించగా, ప్రైవేట్ రంగ బ్యాంకులు కేవలం 68 మిలియన్ జన్-ధన్ ఖాతాలను మాత్రమే తెరిచాయన్నారు. సమాజంలో ఆదాయ అసమానత సమస్యగా మారిందని, ఫలితంగా ఆర్థిక అసమానత్వాన్ని రూపుమాపటంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలక పాత్ర షోషించాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులలో నియామకాల కొరత వల్ల ప్రస్తుత శ్రామికశక్తిపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు జాతీయ విలువలను నిలబెట్టడం, అత్యంత నిబద్ధతతో పౌరులకు సేవ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. జాతీయూకరణపై అవగాహన కల్పించే క్రమంలో దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు.
రక్తదాన శిబిరాలు, ఆరోగ్య పరీక్షా శిబిరాలు, చెట్ల పెంపకం, పాఠశాల, కళాశాలల్లో జాతీయూకరణపై చర్చలు, సమాజ అభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు విఆర్కె మోహన్, శ్రీనివాసరావు, నారయ్య, గౌస్, మూర్తి, యోబు, నటరాజ్ , రామిరెడ్డి, మురళీ కృష్ణ, సూర్య ప్రకాష్ అజీమ్ భాషా తదితరులు పాల్గొన్నారు.