Suryaa.co.in

Editorial

జనసేనకు 6 నుంచి 8 సీట్లు?

– బీజేపీతో పొత్తు ఖరారు
– 12 మందితో తుది జాబితా ఇచ్చిన జనసేన
– 6 నుంచి 8 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం
– 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ రెడీ
– రెండో జాబితాలో ప్రకటన
– పవన్‌కు సమాచారం ఇచ్చిన కిషన్‌రెడ్డి
– పొత్తుతో 5 శాతం ఓట్లు పెంచుకోవచ్చని బీజేపీ అంచనా
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు ఖరారయింది. ఆ మేరకు జనసేనకు కొన్ని సీట్లు కేటాయించేందుకు, బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ ప్రకటించే రెండవ జాబితాలో ఆ అంశాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మెజారిటీ నేతలు కూడా జనసేనతో కలసి వెళ్లాలని, కోర్ కమిటీలో సూచించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీజేపీ-జనసేన మధ్య పొత్తు పొడిచింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలసి, కదనరంగంలోకి దిగనున్నాయి. ఆ మేరకు జనసేన ఇచ్చిన జాబితాపై బీజేపీ కోర్ కమిటీ చర్చించింది. జనసేన మొత్తం 12 స్థానాలు కోరుతూ, తుది జాబితాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అందించింది.

మొత్తం 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ, పొత్తు చర్చలకు ముందు మాత్రం… గ్రేటర్ హైదరాబాద్ లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాలు సహా మొత్తం 12 సీట్లు కోరుతూ, ఒక జాబితా రూపొందించింది. అందులో శేరిలింగంపల్లి సీటు కోసం ఇప్పటికే బీజేపీలో రెండు వర్గాల మధ్య ఆదిపత్యపోరు కొనసాగుతోంది.

అయితే చర్చల సందర్భంలో, దానిపై కసరత్తు చేసిన బీజేపీ నాయకత్వం.. తన పార్టీ బలాబలాలు బేరీజు వేసుకున్న తర్వాత, జనసేనకు 6 నుంచి 8 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ విషయాన్ని కిషన్‌రెడ్డి ఇప్పటికే జనసేన దళపతి పవన్‌కు సమాచారం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే పవన్ కల్యాణ్ మరో రెండు స్థానాలు కావాలని గట్టిగా పట్టుపడితే.. అప్పుడు మరొక సీటు ఇవ్వడం ద్వారా, తొమ్మిదిసీట్లతో పొత్తు చర్చల ప్రక్రియకు తెరదించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

జనసేన పొత్తుతో.. కనీసం 4 నుంచి 5 శాతం వరకూ ఓట్ల శాతం పెంచుకోవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. పవన్ అభిమానులతోపాటు, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా కాపుల ఓట్లను కూడా సాధించవచ్చన్న వ్యూహం బీజేపీలో లేకపోలేదు. ఇప్పటికే ఏపీలో టీడీపీతో పొత్తు ఖరారు చేసుకున్న పవన్ పార్టీ రంగంలో ఉన్నందున, కమ్మ సామాజికవర్గం కూడా బీజేపీ-జనసేన కూటమికి ఓట్లు వేయవచ్చన్న అంచనా, బీజేపీ నాయకత్వంలో కనిపిస్తోంది.

LEAVE A RESPONSE