ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి దాటి రుణాలను ఎత్తిన జమోరె ప్రభుత్వం
రాజ్యసభ వేదికగా వెల్లడించిన కేంద్రం
మంత్రి పదవికి రాజీనామా చేసి అంబటి రాంబాబు సినిమాలు తీసుకోవచ్చు
ప్రజల ఇళ్లల్లోకి వాలంటీర్లను ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా?
మొద్దు శీను లాగే కోడి కత్తి శ్రీను ప్రాణాలకు ప్రమాదం
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ఒక్క ఏడాదిలోనే కార్పొరేషన్ల పేరిట జగన్మోహన్ రెడ్డి సర్కార్ 77 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరాద్ వెల్లడించారు. రాజ్యసభలో టిడిపి సభ్యులు కనుక మేడల రవీందర్ కుమార్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం గా భగవత్ కరాద్ సమాధానం ఇస్తూ ఎఫ్ ఆర్ బి ఎం పరిమితిని దాటి జమోరె ప్రభుత్వం అప్పులను ఎత్తిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (3) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందని ఆయన పేర్కొన్నారు.
కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణించాలని సూచించారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి తనకు తెలిసిన కొంత నిజం మాత్రమే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఫ్రాడ్…రాష్ట్ర ప్రభుత్వమే ఫ్రాడ్… దొంగలు బాబోయ్ దొంగలు అని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.
బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వివరాలను వెల్లడించి, తప్పయితే చర్చకు రావాలని జగన్మోహన్ రెడ్డికి ఆయన వందిమాగాదులకు నేను సవాల్ చేశాను. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి గారు , నేను రాష్ట్ర ప్రభుత్వ అప్పులను విస్పష్టంగా వెల్లడించాం. అయినా, అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించడం లేదు.
పార్లమెంట్లో అర్థసత్యం చెప్పే సరికి బట్టలు చించుకొని సాక్షి దినపత్రికలో నానా కూతలు కూశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వ అప్పులను నేను, పురందరేశ్వరి గారు గట్టిగానే చెప్పాము. నేను రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 10.57 లక్షల కోట్ల రూపాయలని చెప్పగా, పురందరేశ్వరి గారు మాత్రం అణ పైసలతో సహా అప్పుల వివరాలను వెల్లడించారు. స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వ అప్పు 10.77 లక్షల కోట్ల రూపాయలని పేర్కొన్నారు.
ఈ లెక్కలు తప్పయితే ఖండించమని ఆమె కూడా సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతెంత అప్పులు చేసింది… ఏమేమి తాకట్టు పెట్టారన్న దానిపై పూర్తి వివరాలు నా వద్ద ఉన్నాయి. ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది 30 వేల కోట్ల రూపాయల అప్పులు చేసే వెసులుబాటును కేంద్రం కల్పించింది. అయితే ఇప్పటికే 29 వేల కోట్ల రూపాయల పైచిలుకు అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చేసింది.
మరో 750 కోట్ల రూపాయల అప్పు చేసే అర్హత మాత్రమే ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. అయినా కూడా, మళ్లీ వచ్చేవారం కూడా రాష్ట్ర ప్రభుత్వం చిప్ప పట్టుకుని ఢిల్లీ వీధిల్లో తిరుగాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ అప్పులు ఎన్నో మీడియా, ప్రజలు గుర్తించారని రఘురామకృష్ణం రాజు అన్నారు..
నీటిపారుదల శాఖ పై ఫోకస్ చేసే వారిని మంత్రిగా నియమించండి
సాగునీటి పారుదల శాఖామంత్రిగా అంబటి రాంబాబు రాజీనామా చేసి తనకిష్టమైన సినిమాలను నిర్మాణం చేయవచ్చు . ముఖ్యమంత్రి జమోరె నీటి పారుదల శాఖపై ఫోకస్ చేసే వారిని మంత్రిగా నియమించాలి. అంబటి రాంబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారంటే సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతారేమోనని అనుకున్నాను. ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య ఉంటూ, రాయలసీమ లోని సాగునీటి ప్రాజెక్టులకు జమోరె ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో వివరిస్తున్నారు.
నందికొట్కూరు లో ఆయన నిర్వహించిన సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 14 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్టు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర ఏళ్లలో కేవలం రెండు కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయలేదని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పకుండా, పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన బ్రో చిత్రం బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అయ్యిందని అంబటి రాంబాబు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ తనకున్న స్టార్ డమ్ కు తీసుకోవాల్సిన అంత రెమ్యూనేషన్ తీసుకోకుండా, రీజనబుల్ గానే రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు. ఇతర అగ్ర హీరోల హిట్ సినిమా వసూలు చేసే కలెక్షన్లను , పవన్ కళ్యాణ్ నటించిన ప్లాప్ సినిమా కూడా కలెక్ట్ చేస్తుంది. బ్రో చిత్రం హిట్ అని అందరికీ తెలుసు.
ఇప్పటికే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంబటి రాంబాబు చెబుతున్న లెక్కల ప్రకారమే బ్రో చిత్రం 70 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది . మరో మూడు నాలుగు రోజుల్లో 20 కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తే ఆయన లెక్క ప్రకారం బ్రో హిట్ సినిమా అన్నట్టే. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కనీసం రెండు కోట్ల రూపాయలు కూడా కలెక్ట్ చేయలేదు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న వ్యూహం సినిమా సూపర్ హిట్ అయితే నాలుగు కోట్ల రూపాయల కలెక్ట్ చేస్తుందని, అట్టర్ ఫ్లాప్ అయితే 40 లక్షల రూపాయలు కూడా వసూలు చెయ్యదు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమాకు పోటీగా తానుకూడా సినిమా నిర్మించనున్నట్లు అంబటి రాంబాబు చెబుతూ, కొన్ని టైటిల్స్ ను ప్రకటించారు. నిత్య పెళ్లి కొడుకు అనే టైటిల్ ప్రకటించిన అంబటి రాంబాబు, తన క్యారెక్టర్ ను పెట్టి సినిమా తీసుకోవచ్చు. ఈమధ్య ఆయన డాన్సులు కూడా బాగా చేస్తున్నారు. రెండు పెళ్లిళ్లు నాలుగు తాళిలు అని మరొక టైటిల్ ప్రకటించిన అంబటి, బలపనూరు వెంకట్ రెడ్డి జీవిత గాధను ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించవచ్చు.
భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకుని గంపెడు మంది పిల్లలను కని, దేశంపై వదిలిపెట్టారు. రాంబాబు చెప్పిన టైటిల్స్ కు మా పార్టీలోనే అర్హులు ఉన్నారు. గొడ్డలితో బాబాయి హత్య అనే సినిమా తీసుకోండి. ఆ స్టోరీ కాపీ రైట్స్ మీ వద్దే ఉన్నాయి. బాబాయిని వేసేసిన అబ్బాయి, తెర వెనుక స్త్రీ ఎవరు? వంటి టైటిళ్ల తో సినిమాలు తీసుకోవచ్చునని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు . పవన్ కళ్యాణ్ చిటిక వేస్తే చాలు నెలకు ఒక సినిమా వచ్చి పడుతుంది.
బ్రో చిత్రంలోని క్యారెక్టర్ కు, అంబటి రాంబాబుకు అసలు పోలికే లేదు. అంబటి రాంబాబు చెప్పిన అంశాలను అరపేజీకి పైగా వార్త కవర్ చేసిన సాక్షి దినపత్రిక, పార్లమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన దొంగ అప్పుల గురించి ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెబితే మాత్రం అక్షరం ముక్క కూడా రాయలేదు. జనం అసహ్యించుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా సాక్షి దినపత్రిక ఎడిటర్ కు లేదా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
వాలంటీర్లకు లేని అవకాశాన్ని కల్పించారు
వాలంటీర్లు చేస్తున్న ఆగడాలకు వారిని ప్రజల ఇళ్లల్లోకి ప్రవేశపెట్టిన మా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ది బాధ్యత కాదా?, గుండెలపై చేయి వేసుకొని సమాధానం చెప్పాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. వాలంటీర్ల ఆగడాల గురించి పవన్ కళ్యాణ్ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత, వాల్తేరు లో వెంకటేష్ అనే వాలంటీర్ నగల కోసం ఒక మహిళను హత్య చేయగా, అదే ప్రాంతానికి చెందిన మరొక వాలంటీర్ వివాహితను లేపుకు వెళ్ళాడు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మూడు రోజుల పాటు మేనేజ్ చేశారు.
అయినా ఆలస్యంగా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పదవ తరగతి పాస్ అయి బాధ్యత లేకుండా రోడ్లపై తిరిగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గుర్తింపు పొందిన వారిని వాలంటీర్లుగా నియమించారు. వారికి లేని అవకాశాన్ని కల్పించారు. ప్రజల ఇళ్లల్లోకి వెళ్లే వెసులుబాటు కల్పించడం ద్వారా ఉద్యోగాలు చేసుకునే వారికి లేని తలనొప్పి తెచ్చి పెట్టారు. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం వల్ల మహిళలు అదృశ్యానికి గురవుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. వివాహిత మహిళలను లేపుకుపోయిన వాలంటీర్ కూడా ఆ మహిళను రెడ్ లైట్ ఏరియాలో అమ్మి వేస్తే, ఎవరిది బాధ్యత అని రఘురామకృష్ణంరాజు నిలదీశారు.
వాలంటీర్లు చేస్తున్నది ఏమిటి?, ప్రతి నెల ఒకటవ తేదీన పింఛన్లు ఇవ్వడమే కదా?, పింఛన్లు ఇవ్వడానికి బటన్ నొక్కితే సరిపోతుంది. గతంలో రేషన్ షాప్ వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకునే వారిని, ఇప్పుడు ఇంటి వద్దకే బియ్యం సరఫరా అంటూ కిలో పది రూపాయల చొప్పున వాటిని వాలంటీర్లే కొనుగోలు చేస్తున్నారు. వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేసే అక్కరకు లేని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ.గ్రామ సచివాలయ వ్యవస్థ అని అంతగా ఉపయోగం లేని మరొక వ్యవస్థకు రూపకల్పన చేశారు.
గ్రామ సచివాలయంలో పది మంది సిబ్బంది ఉంటే, వారిలో ముగ్గురికి చేతినిండా పని ఉంటుంది. మిగిలిన వారికి పని ఉండదు. గతంలో మీసేవ అనే వ్యవస్థ ఉండేది. దాన్ని రద్దు చేసి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. ఉద్యోగాలు కల్పించాల్సిన విద్యావ్యవస్థలో ఉద్యోగాలు కల్పించరు. కానీ ఓట్ల కొనుగోలు, ఓట్ల మిస్ మేనేజ్మెంట్ కోసం వ్యవస్థలను సృష్టించి, ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకొని దాచుకోవడానికి, ఓట్ల కొనుగోలు కోసం ఈ వ్యవస్థలను వాడుకుంటున్నారు.
రేషన్ బియ్యం అందజేసే సమయంలో వాలంటీర్లు , డబ్బులు కావాలా?, బియ్యం కావాలా?? అని అడుగుతున్నారో? లేదో?? ప్రతి ఒక్కరూ స్పందించాలని, తమ అభిప్రాయాన్ని చెప్పాలని రఘురామకృష్ణం రాజు కోరారు . సాక్షి దినపత్రికలో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లను చూసి కొంతమంది అమాయకులు నమ్మితే ఈ ప్రభుత్వాన్ని నమ్మవచ్చు. బెంగళూరులో ఉండే అన్నయ్య వేలిముద్రను ఒంగోలు లో ఉండే ఒక వాలంటీ ర్ దొంగ వేలిముద్రలను తయారు చేయించాడు. దొంగ వేలిముద్రలను తయారు చేయించిన ఇటువంటి వాలంటీర్లు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలోని 46 లక్షల పింఛన్లలో ఐదు నుంచి ఆరు లక్షల దొంగ పింఛన్లను నమోదు చేసి ప్రభుత్వ పెద్దలే కొట్టివేస్తున్నారేమోనని రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నో లోపాలు ఉన్న వ్యవస్థ అవసరమా?, పటిష్టమైన వ్యవస్థలోనే ఎన్నో లోపాలను వెతికి అక్రమాలకు పాల్పడే సమాజంలో, లోపాలతో కూడిన వ్యవస్థలో మరెన్ని అక్రమాలు జరుగుతాయో ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ప్రతి స్కీములో కోటి సమస్యలు ఉన్నాయని, ప్రతి స్కీము హిట్ అని చెప్పుకోవడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. వాలంటీర్లు చేసే పనులకు వాలంటీర్ వ్యవస్థ అన్నది అవసరమే లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.
వికలాంగుల్లోనూ యూపీ కంటే ఏపీనే ఫస్ట్
వికలాంగుల్లోను అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లక్షన్నర మంది వికలాంగులు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా ఏడు లక్షల మందికి చేరింది. ఒకేసారి వికలాంగుల సంఖ్య ఇంతగా పెరగడానికి కారణాలు ఏమిటంటే… ఓట్ల కొనుగోలుకు, స్థానిక నాయకులను వశపరచుకోవడానికి మా పార్టీ పెద్దలు ఒక సామాజిక వర్గానికి చెందిన వారిని అత్యధికంగా వికలాంగులుగా చూపిస్తున్నారు.
కడప జిల్లాలోని వీరప నాయుని మండలం ఎన్ పాల గిరి గ్రామంలో ఉన్న జనాభానే తక్కువ అంటే అందులో 2 15 మంది వికలాంగులు ఉండడం ఆశ్చర్యకరం. వీరిలో ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో వికలాంగులు పెరిగిపోయారని చెప్పుకోవడం ఏమిటో అర్థం కావడం లేదు. అర్హులైన వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను, పక్కదారి పట్టించడానికి అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తున్న వారిని కూడా తప్పుడు సర్టిఫికెట్లతో వికలాంగుల జాబితాలో చేరుస్తున్నారు.. దీనివల్ల అర్హులైన వారికి అందాల్సిన లబ్ది, అనర్హులకు కూడా అందుతోంది.
ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. నిజమైన వికలాంగులకు 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయండి. అంతేకానీ వికలాంగులు కాని వారిని కూడా వికలాంగుల జాబితాలో చేర్చి వారికి లబ్ధి చేకూర్చాలనుకోవడం సరికాదు. భర్తతో సుఖంగా సంసారం చేసుకుంటున్న వారిని కూడా ఒంటరి మహిళగా వాలంటీర్లు చూపెడుతున్నారు. ఒంటరి మహిళలకు లభించే ఆర్థిక సహాయంలో వాలంటీర్, లబ్ధిదారులు కలిసి పంచుకుంటున్నారు.
పదవ తరగతి విద్యార్హత కలిగిన వారిని ఎండిఓ సెలెక్ట్ చేయగా, ఎమ్మెల్యే జాబితాను పంపుతున్నారు. వారిని వాలంటీర్లుగా నియమిస్తున్నారు. సదరు వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. రిషి కొండపై అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాల నిలుపుదల కోసం గత తొమ్మిది నెలలుగా పోరాటం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నట్లుగా భవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.
ఇతరులెవరైనా ఇలాగే చేస్తే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని గగ్గోలు పెట్టి, సాక్షి దినపత్రికలో ప్రత్యేక వార్తా కథనాన్నీ రాసి ఉండేవారు. రేపు ఒక వేళ కోర్టు తప్పని చెప్పినా ఏమి జరుగుతుందోతెలియదు. దసరాకు రిషికొండలో నిర్మించిన భవనంలో జగన్మోహన్ రెడ్డి కొత్త కాపురం పెట్ట నున్నారు. కోడి కత్తి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నశ్రీను, న్యాయస్థానం శిక్ష ఖరారు చేసిన నాలుగేళ్ల జైలు శిక్ష పడదు.
అయినా అతనికి బెయిలు లభించడం లేదు. డ్రైవర్ ను హత్య చేసి పార్సల్ చేసిన వారికి బెయిలు లభించింది. బాబాయిని హత్య చేయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా బెయిల్ లభించింది. కానీ కోడి కత్తితో చిన్న గాటు పెట్టిన వ్యక్తికి మాత్రం జైలు లభించడం లేదు.
పొడిపించుకున్న వ్యక్తి కోర్టుకు హాజరుకానని చెబుతున్నాడు. జైలులో ఉన్న కోడి కత్తి శ్రీనుకు ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. జైలులో మొద్దు శ్రీను తరహాలోనే కోడి కత్తి శ్రీనును అంతమొందించే ప్రమాదం లేకపోలేదని రఘురామకృష్ణం రాజు ఆందోళన వ్యక్తం చేశారు.