– అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎమ్ వి ఎస్ నాగిరెడ్డి
ఈ మూడు సంవత్సరాలకాలంలో ₹.83 వేల కోట్లు మేర రైతులకు వివిధ పథకాలు ద్వారా ప్రయోజనం అందించామని రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎమ్ వి ఎస్ నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహ సమావేశ మందిరంలో రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం వి ఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ, ఇంకా ఏమైనా రైతు సమస్యలు ఉంటే తెలుసుకుని పరిష్కరించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం అన్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాలు శాస్త్రవేత్తలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారి సమస్యలు పరిష్కారం ధ్యేయంగా అగ్రి మిషన్ పనిచేయవలసి ఉందన్నారు. ఆ దిశలో ముఖ్యమంత్రి గారికి శాస్త్రవేత్తలకు, అధికారులకు, రైతులకు మధ్య వారధిగా అగ్రి మిషన్ వైస్ చైర్మన్ గా బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం కోసం అడుగులు వేయడం కోసం ఈ జిల్లా స్థాయి పర్యటనలు చేపట్టడం జరుగుతోందని, 2023 వరకు నిరంతరం ఈ విధంగా రైతులతో కలిసి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చెయ్యడం జరిగిందన్నారు.
ముఖ్యంగా రైతులు తెలియ చేస్తున్న సూచనలు డ్రిప్ ఇరిగేషన్, వ్యక్తిగత యాంత్రీకరణ, విద్యుత్ మీటర్లు వంటివి ముఖ్యంగా మా దృష్టికి తీసుకుని వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే డ్రిప్ ఇరిగేషన్ దిశగా అడుగులు వేయడం ప్రారంభం అయిందని, ఉచిత విద్యుత్ ప్రవేశ పెట్టిన డా వై ఎస్ రాజశేరరెడ్డి తనయుడిగా ముఖ్యమంత్రి ఆ విషయంలో వెనకడుగు వేసే అవకాశం లేదన్నారు. వ్యవసాయ బోర్లు కు విద్యుత్ మీటర్లు బిగించినా, మీటర్ చార్జీలు కూడా రైతుల తరపున ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. టర్పాలిన్స్ అడిగారు, ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం చేరుకుని, సమస్య పరిష్కారం కై ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విధానంలో రైతు ల వద్దకు వచ్చి వారీ సమస్యకు పరిష్కారం కోసం ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రైతుల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ చైర్మన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించి నట్లు తెలిపారు. భారత దేశంలోనే ప్రకృతి వైపరిత్యాలు మూలంగా పంటలు నష్ట పోయిన సీజన్ లోనే పంట నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం మనదే అన్నారు.
జిల్లా స్థాయి లో రైతు సమస్యల పరిష్కారం కోసం కొంత మొత్తం నిధులు కలెక్టర్ లకు ఇవ్వడం ద్వారా మరింత వేగంగా వాటికి సత్వర పరిష్కారం చర్యలకు అవకాశం ఉందన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రైతుల పక్షాన నిలబడి ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పొట్ట దశలో ఉండే పంటకు పొటాష్ అవసరం ఉంటుందని, వాటి కొరత రాకుండా చూడడంతో పాటు నాణ్యమైన ఎరువు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్పత్తి, వినియోగం, ఎగుమతుల విషయంలో సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు.
జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు రైతులతో మమేకమై వారి సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇప్పటివరకూ జిల్లా స్థాయి లో మూడు సలహా మండలి బోర్డ్ సభ్యులు సమావేశం నిర్వహించు కోవడం జరిగిందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుందన్నారు. వైస్ చైర్మన్ గారు జిల్లా స్థాయిలో సమస్యలపై నేరుగా చేర్చించడం ద్వారా త్వరిత గతిన వాటికి రాష్ట్రస్థాయిలో పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లాలో రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం తో పాటు, వారికి సత్వర చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతు సమస్యకు పరిష్కారం కోసం తగిన విధంగా జిల్లా యంత్రాంగం అడుగులు వెస్తుందని తెలిపారు. రైతుల ప్రతి సమస్య ఎంతో సానుకూలంగా వైస్ చైర్మన్ గారు విని వాటిని నమోదు చేసుకోవడం ఒక మంచి సూచనకు మార్గం అన్నారు. ఒక రైతుగా వైస్ చైర్మన్ స్పందించిన తీరు పట్ల జిల్లా రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో రాజానగరం, అనపర్తి శాసనసభ్యులు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి, జిల్లాస్థాయి అగ్రి అడ్వజరీ బోర్డు చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, అగ్రి మిషన్ మెంబర్ జె.రామారావు(బాబి), అగ్రి మిషన్ ఓ ఎస్ డి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్ మాధవరావు, జిల్లా మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ కృష్ణారావు,, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి సత్య గోవిందం, జిల్లా ఆర్టికల్చర్ ఆఫీసర్ వి. రాధాకృష్ణ వివిధ శాఖల అధికారులు, రైతులు, శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.