-రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: సమగ్ర శిక్షా పథకం కింద 2022-23లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన, భవనాలు మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 867 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ కేంద్రం విడుదల చేసిన నిధులలో ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి 823 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు పేరుతో వినూత్న పథకాన్ని రూపొందించిందని చెప్పారు. సమగ్ర శిక్షా పథకం కింద వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపడుతున్న అత్యుత్తమ చర్యలు, వినూత్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుకరించేందుకు వీలుగా పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు “షాగన్ డిజిటల్ రెపోసిటొరీ” వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
సమగ్ర శిక్షా పథకం కింద యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ డేటా బేస్ ద్వారా లోపాలను గుర్తించి నిర్ణయించిన విధంగా, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వీకరించిన వినతుల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, భవనాల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు. అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతి ఏటా కసరత్తు చేస్తాయని, అవి ఆయా రాష్ట్రాల వార్షిక కార్యాచరణ ప్రణాళికలోను, బడ్జెట్‌లోను ప్రతిబింబిస్తాయని మంత్రి వివరించారు.
17883 కోట్లతో ఏపీలో జాతీయ రహదారుల విస్తరణ
ఆంధ్రప్రదేశ్‌లో 17883.69 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 22 జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ ప్రాజెక్ట్‌లను చేపట్టినట్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లు వేర్వేరు దశల్లో అమలులో ఉన్నట్లు తెలిపారు. 17883 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన రహదారుల అభివృద్ధి, విస్తరణ ప్రాజెక్ట్‌ల కోసం ఈ ఏడాది నవంబర్ 25 నాటికి 5042.74 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
2909 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఆనందపురం-పెందుర్తి-అనకాపల్లి 6 లేన్ల జాతీయ రహదారి అభివృద్ధి కోసం ఇప్పటికే 1641.75 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అలాగే 1194.57 కోట్ల వ్యయంతో చేపట్టిన గొల్లపూడి- చిన్నకాకాని విజయవాడ బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం 281.94 కోట్ల ఖర్చు చేసినట్లు తెలిపారు. 1128.68 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆలూరు- జక్కువ సెక్షన్ ఆరు లేన్ల జాతీయ రహదారి అభివృద్ధి కోసం 112.36 కోట్ల రూపాయలు, 767.75 కోట్లతో చేపట్టిన జక్కువ-కొర్లాం సెక్షన్ 6 లేన్ల రహదారి పనుల కోసం 113.58 కోట్లు, 957.43 కోట్లతో చేపట్టిన కొర్లాం-కంతకాపల్లి 6 లేన్ల అభివృద్ధి కోసం 247.97 కోట్లు, 923.81 కోట్లతో చేపట్టిన కంతకాపల్లి-సబ్బవరం 6 లేన్ల అభివృద్ధి కోసం 142.86 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
గన్నవరం సమీపంలో విజయవాడ ఎయిర్ పోర్టు వద్ద జాతీయ రహదారిపై హాఫ్ ఫ్లైఓవర్‌ను 29.34 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. 1889 కోట్లతో రేణిగుంట-నాయుడుపేట మధ్య 6 లేన్ల జాతీయ రహదారి అభివృద్ధి కోసం 322.59 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 17883 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల కింద 2022 నవంబర్ 25 నాటికి 5042.74 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు.
గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద ప్రత్యేకించి నిధులు కేటాయింపులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ఇంటర్ కనెక్టెడ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ నెట్ వర్క్ సృష్టించి తద్వారా ఏకీకృత ఆర్థిక, ప్రాథమిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య పరమైన పోటీ పెరగడం, ఎగుమతులు వృద్ధి, ఉద్యోగాలు కల్పన ఏర్పడుతుందని మంత్రి చెప్పారు. జాతీయ రహదారులు, రైలుమార్గం, జలమార్గాలు, టెలీకాం వంటి విభిన్న ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల మధ్య సమన్వయం ఏర్పడుతుందని అన్నారు. స్టీల్, పవర్, ఫెర్టిలైజర్, బొగ్గు వంటి పరిశ్రమలకు లాజిస్టిక్ సహకారం అందుతుందని అన్నారు. అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయ ప్రణాళికతో సమగ్రాభివృద్ధి లక్ష్యంతో 2021 అక్టోబర్లో పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు.