మోడీ జీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ జీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ సమావేశానికి తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. పలు కారణాలతో వీరు ఈ భేటీకి హాజరుకాలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ ) పాలక మండలి సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. పాలక మండలిలో సభ్యులుగా ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ , పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ సీఎంలు ఈ భేటీకి హాజరుకావట్లేదని ఇప్పటికే ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులు, బదిలీల విషయమై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో నీతి ఆయోగ్ నిర్వహించే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దేశంలో సహకార సమాఖ్య వ్యవస్థ ఒక పరిహాసంగా మారిందని ఆయన విమర్శించారు. నీతి ఆయోగ్ సమావేశానికి తాను రాలేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే, తమ రాష్ట్రం తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి, చీఫ్ సెక్రటరీని పంపించేందుకు అనుమతినివ్వాలని టీఎంసీ ప్రభుత్వం కోరింది. అయితే ఈ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.
ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో తాను సమావేశానికి రాలేనని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. నిధుల కేటాయింపు విషయంలో పంజాబ్‌పై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనారోగ్య కారణాల రీత్యా నీతి ఆయోగ్ సమావేశానికి రావట్లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సింగపూర్, జపాన్ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన కూడా నేటి సమావేశానికి హాజరు కాలేకపోతున్నారు. కర్ణాటకలో నేడు కేబినెట్ విస్తరణ జరిగింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి రాలేకపోయారు. ఇక, కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఈ భేటీకి రాలేనని ప్రకటించారు. అయితే అందుకు గల కారణాలను ఆయన వెల్లడించలేదు.
ఢిల్లీ లోని ప్రగతి మైదాన్‌లో గల కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతీ ఆయోగ్ పాలక మండలి ఎనిమిదో సమావేశం మొదలైంది. ‘వికసిత్ భారత్ @ 2047’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ భేటీలో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆరోగ్యం, నైపుణ్యాల అభివృద్ధి, మహిళా సాధికారత, మౌలికసదుపాయల వృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా జీ రాజ్‌నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ జీ స్మృతి ఇరానీ జీ పీయూష్ గోయల్ జీ ధర్మేంద్ర ప్రధాన్, నారాయణ్ రాణె, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.