ఉప్పుకప్పురంబు
ఒక్కరీతిగుండు
రెండూ నిప్పు కణికలై
రగులుచుండు..!
ఉప్పు నిప్పుగా మారి
తెల్లవాడికి ముప్పుగా పరిణమించి స్వరాజ్యసిద్ధికి
బాటలు వేయగా
దండికి కదిలె గాంధీ దండు..!
ఒకరా,ఇద్దరా..
వందలూ వేలల్లో
జనం వెల్లువై..
జైహింద్ అంటూ
పెట్టిన పొలికేక…
లక్షల గొంతులు
ఏకమై..శ్లోకమై..
భరతమాత గర్భశోకమై..
దిక్కులు పిక్కటిల్లగా..
బ్రిటిష్ ముష్కరుల
గుండెలు దద్దరిల్లగా..!
సత్యాగ్రహమా..
గాంధీ నిగ్రహమా..
ఆ మాటున ప్రజ్వరిల్లిన
జనాగ్రహమా..
ఊళ్లు యేళ్లై…
నిరసన సెలయేళ్లై..
అడుగులే పిడుగులై
కదిలితే అది కడలితరంగమా
కదనరంగమా..!
ఇటు మనం సాయుధులం
మనపై పోరుకు
ఉప్పు ఆయుధమా
తెల్లదొరల చులకన
అటు ఉవ్వెత్తున
ఎగసిన నిరసన..
పెదవి విరిచిన అధికారం
ఇదెంతలే అని
కొట్టిపడేసిన అహంకారం
బెట్టు వీడి గట్టుదాటి
కదం తొక్కిన
దండి యాత్రికులు
అరెస్టులతో అణగదొక్కే
కుయుక్తితో చెలరేగిన
ముష్కర మూకలు!
సబర్మతిలో మోగిన నగారా
గరం గరమై…
ప్రతి నగరం ప్రజాసాగరమై..
ఊరూవాడా ఉడుకెత్తి..
ఉరకలెత్తి స్వరాజ్యం కోసం
నినదించగా మారుమ్రోగి
స్వాతంత్ర సంగ్రామ భేరి
ప్రతి భారతీయుడి
రక్తం మరిగి..
రవి అస్తమించని
బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు
తొలిసారి కరిగి
అధికారం అహంకారం
గుండెలదరగ
స్వరాజ్య నినాదం ఓంకారమై
భీకర పోరుకు శ్రీకారమై…
మహాత్ముని పిలుపే ఘీంకారమై..!
బాపూ ఆశ్రమంలో
మొదలైన దీక్ష
అరేబియా తీరాన మహాత్ముడు
పిడికిట పట్టిన ఉప్పు
నిప్పు కణికగా మారి
సామ్రాజ్యవాద వలసపాలనకు
చరమగీతమై..
ఇక తమ వల్ల కాదని తెల్లదొరలకు అవగతమై..
నిరంకుశ ఏలుబడి
అంతానికి సంకేతమై
మరోనాటికి గతమై
భారత రాజ్యం
భారతీయుల హస్తగతమై..
ఈడేరిన కోట్లాది జనుల
మనోగతమై..
గెలిచిన అహింసో పరమధర్మః
తలవంచిన పరాయిపాలన..!
దండికి దండం..
మహాత్మునికి వందనం..
ఉప్పు సత్యాగ్రహానికి జోహార్..
స్వరాజ్య సంగ్రామంలో కీలకఘట్టం..
బాపూ అహింసావాదానికి పట్టం..
భారతీయతకు పట్టాభిషేకం..
బోలో
స్వతంత్ర భారత్ కు జై..
75 సంవత్సరాల
స్వరాజ్య వేడుకల ఆనందం..
దండి యాత్ర
92 వత్సరాల స్మృతి..
పులకించిన సబర్మతి…
ఆనంద పారవశ్యంలో
భరతజాతి..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286