రచన: శ్రీపాద శ్రీనివాస్
జననానికి తొమ్మిది నెలలు..
మరణానికి ఓ రెండు, మూడు క్షణాలు చాలు
మనిషి జీవితంలో…!
ఈ రెండింటి నడుమ
మనిషి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. అలజడులు, అపనిందలు అందలాలు…!
అంతేనా…
అవసరాల ప్రాతిపదికనే మానవ సంబంధాలు
స్ధాయి, ఆర్ధిక స్ధోమతలనుబట్టే గౌరవ మర్యాదలు, ఆదరణలు
అది మరణంలోనైనా, జననంలోనైన సరే…!
ఒక్కమాటలో చెప్పాలంటే
బంధుత్వాలు, ఆత్మీయ అనురాగాలు, అనుబంధాలు ఆవిరైపోతున్నాయి..
నేటి లోకం పోకడల సెగలకు…!
ఈ తరహా పోకడలను అక్షర రూపంలో చూపేందుకు చేసిన ప్రయత్నమే “ఆత్మవేదన”లోని కధాంశం…!
***
అంతా అయోమయంగా ఉంది నరసింహానికి…
తనను పోలి ఉన్న మనిషి ఒకరు నిర్జీవంగా పడిఉన్నాడు నేల మీద…!
…..ఆ విధంగా పడిఉన్న వ్యక్తి చుట్టూ విషాదవదనంతో మూగి ఉన్నారు తన బందువులు, సన్నిహితులు… శ్రేయోభిలాషులు…!
… వారందరూ విషాధ ఛాయలతో ఎందుకున్నారో అర్ధం కాలేదు ఆక్షణంలో నరసింహానికి..!. …పైగా ఇందులో చాలమంది తన ఇంటి గుమ్మంకేసి తొంగిచూడనివారే గతంలో…!
“అసలు ఏం జరుగుతోంది ఇక్కడ..?… నాలాగే ఉన్న నిర్జీవంగా పడిఉన్న వ్యక్తి ఎవరు?”….అంటూ ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు నరసింహం…!
…కాని తన మాట వినపడనట్టు, తాను వారి ఎదుట నిల్చున్నప్పటికి కనబడనట్టుగాను వ్యవహారిస్తున్నారు అక్కడి వారందరు….!
అంత అయోమయంలోను పక్కగా ఓ ఫోటోకి పూలదండ వేసి ఉండటం గమనించాడు…!
…. ఆ దృశ్యం చూడగానే భయంతో గుండె జల్లు మంది నరసింహానికి…!… ఎందుకంటే ఆ ఫోటో తనదే..!… నిర్జీవంగా పడిఉన్నవ్యక్తిని తానేనని.. తాను మరణించానని ..ఈ దృశ్యాలన్నింటిని చూస్తున్నది తన ఆత్మే అని అవగతం అయింది నరసింహానికి..!
“ఆత్మకి రూపం ఉండదని పెద్దలు అంటారు… కాని తాను బ్రతికున్నప్పుడు తనకు ఉన్న రూపమే తన ఆత్మకు కూడ రావడం నరసింహానికి అశ్చర్యం వేసింది.. ఇది తన భ్రమ ఏమో అనుకున్నాడు ..!
***
అక్కడ గుమికూడిన వారిని చూస్తుంటే అశ్చర్యం వేసింది నరసింహానికి…
తనకి ఇంతమంది బంధువులు, శ్రేయోభిలాషులు ఉన్నారా అనిపించింది నరసింహానికి ఆ క్షణంలో..!
… కానీ ఏనాడు వీరిలో చాలమంది తన గడపను తొక్కిన పాపన పోలేదు… “అవునులే మానవ సంబంధాలన్నీ అవసరాల ప్రాతిపదికనే కదా”… అని తనలో తానే నిర్వేదంగా అనుకున్నాడు ఆత్మ రూపంలో ఉన్న నరసింహం.
***
“ అయ్యో పాపం నరసింహం అప్పుడే వెళ్ళిపోయాడు… నన్ను తరచూ కలుసుకోకుండా ఉండలేకపోయేవాడు… చాలమంచి మనసున్న మనిషి” అంటూ తనకు దూరపు బంధువు అయిన సూర్యం కన్నీళ్లు కార్చేస్తున్నాడు..
….మధ్య మధ్యలో తాను బాధపడటం అందరూ చూస్తున్నారో లేదో అని ఒర కంట అక్కడ వార్నందర్నీ పరికీస్తూన్నే..!
ఆ దృశ్యం ఆత్మరూపంలో ఉన్న నరసింహం కంటపడింది…
“ వారంతరంలో మాకు పిల్లలతో ప్రశాంతంగా గడిపే రోజు ఇది..ఇలాంటి సమయంలో ఇంటికి వచ్చి మమ్మల్నీ ఇబ్బంది పెడితే ఎలా?…పైగా ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఇది”….అంటూ తనను ఇదే సూర్యం మావయ్య తూలనాడిన సందర్భం నరసింహానికి గుర్తుకు వచ్చింది.
……అప్పట్లో తాము స్ధితి మంతులు కాకపోవడం ఇటువంటి చీదరింపులకు ఓ కారణం అనుకుంటూ.. నరసింహం తనను తాను తమాయించుకునే వాడు…!
కాని ఇప్పుడున్న పరిస్ధితిని చూస్తే భిన్నంగా ఉంది…ఈ మనుషుల మనస్థత్వం ఇంతెనేమో…అని అనుకుంటూ మదనపడిపోతోంది నరసింహం ఆత్మ ఆక్షణంలో…!
***
“ ఏవండీ…మీ అమ్మగారు తన నగలను, బీరువా తాళాలను నరసింహం మావయ్య దగ్గరే ఉంచి ఉంటుంది…బంధువులు అందరూ రాకుండానే ఆవి ఎక్కడ ఉన్నయో ముందు వెతకండి”…
“అబ్బాబ్బా..కాస్తా వేచి ఉండవే…మా పెద్ద అక్క బావ గారు అదే పనిమీద ఉన్నారు… మనం కూడ అదే పనిచేస్తే వారికి అనుమానం వస్తుంది”… అంటూ నరసింహం శవం దగ్గరే ఏడుస్తున్నట్టు నటిస్తున్న రామేశం, తన భార్య సరోజని సైగలతో నెమ్మదిగా వారిస్తున్నాడు.
ఈ దృశ్యాన్ని గమనించిన నరసింహం ఆత్మ ఒక్కసారి నోరు వెళ్ళపెట్టింది బాధతో..!.
“ఓరేయ్ వెంకటయ్య…చూశావురా పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో?….. తల్లి తండ్రులకు దూరమైన నా దూరపు బంధువు పిల్లలు వీరందరు…. అలాంటి వీరందరిని సొంత పిల్లల్లా పెంచి పెద్ద చేశాను…. పెళ్ళి సైతం మానుకున్నాను వీరందరి కోసం..!
“…నేను చూపిన ఆ మమకారాన్ని వీరంతామర్చిపోయారు.. నేను పోయిన బాధ కంటే…పంపకాల మీదే వీరి దృష్టి పడింది ఇప్పుడు..!..
మమతానురాగాలు ఆవిరైపోతున్నాయిరా ఇలాంటి వారి కారణంగా”… అంటూ తన స్నేహితుడు వెంకటయ్యని పట్టుకుని ఎడ్చేస్తోంది నరసింహం ఆత్మ..!
..కాని ఇదేమి పట్టనట్లు తన స్నేహితుడు చని పోయిన బాధలో కనీళ్ళు కార్చేస్తున్నాడు వెంకటయ్య…!
***
“నరసింహం అన్నయ్యకి నేను అంటే చాల ప్రేమ… నేను తన అమ్మ పోలికతో ఉన్నానని అంటూ ఉండేవాడు. అమ్మ నగలను, పట్టు చీరలను తనకు ఇచ్చేస్తాను అంటూండేవాడు”….అని తన పిన్ని కుతూరు సరోజ వెక్కివెక్కి ఎడుస్తూ అంటున్న మాటలు నరసింహం చెవిని తాకాయి…
తన తల్లి చనిపోయినప్పుడు కూడ సరోజ ఇవే మాటలను అన్నసందర్భం గుర్తుకు వచ్చింది నరసింహానికి…
“ పెద్దమ్మకి నేను అంటే చాల ఇష్టంరా..తన నగలను, పట్టు చీరలను నాకు ఇచ్చేస్తాను అంటుఉండేది..పాపం ఆ కోరిక తీర్చుకోకుండానే పెద్దమ్మ వెళ్ళిపోయింది”… అంటూ ఇదే విధంగా అంది సరోజ..!
“చనిపోయిన వాళ్ళు లేచివచ్చి ఎలాగో చెప్పలేరని..పరుల సొమ్ము కోసం ఇంత పచ్చిగా అబద్ధాలకు దిగడం నరసింహం ఆత్మను మరింత బాధకు గురిచేసింది…
…..ఎందుకంటే “తాను తన పిన్ని కూతురు సరోజతో” ఏనాడుకూడ తల్లి పట్టు చీరలు, నగలు గురించి ప్రస్తావించలేదు..!.. అంటే “తన తల్లి కూడ సరోజతో” చెప్పిందన్న మాటలు అబద్దం అన్నమాట…!..
“నువ్వు నా వాళ్ళు… నా వాళ్లు అని అనుకునే వాళ్ళేవరు నీ చెంత నిలవరు… చివరికి వాళ్లు వాళ్ల గురించే బ్రతికేస్తారు…నీ గురించి అంటూ ఆలోచించేవారంటూ ఎవరు ఉండరు”… అనే జీవిత సత్యం అంటే ఎమిటో చక్కగా బోధపడింది నరసింహం ఆత్మకి..!
***
మరోపక్క విచార వదనంతో ఓ మూల నిలుచునిఉంది ఉన్న తనకు సోదరి వరసైన జానకీ…
… “సెల్ ఫోన్ కు రిప్ అని మెసేజ్ పెట్టాను…ఫోన్ చేసి పలకరించాను..పెళ్లిల్లు అయ్యాక సంసారంలో మునిగితేనుతూ ఉంటాం… ప్రతి దానికి వచ్చి పలకరించాలంటే ఎలాగా?… అని తన తల్లి చనిపోయిన సందర్భంలో ఇదే జానకమ్మ తనను ఉద్దేశించి అన్నమాటలు గుర్తుకొచ్చాయి నరసింహం ఆత్మకి…
… …ఆ మాటలు మరల ఇప్పుడు గుర్తుకు వచ్చి బాధతో విలవిలలాడిపోయింది నరసింహం ఆత్మ…!
అవసరాల ప్రాతిపదికనే మానవ సంబంధాలు, స్ధాయి, ఆర్ధిక స్ధోమతలనుబట్టే గౌరవ మర్యాదలు, ఆదరణలు అది మరణంలోనైనా, జననంలోనైన సరే!…
సమాజంలో నేడు ఇలాంటి పోకడలు తాండవిస్తున వేళ చిటికెడు ప్రేమను ఇతరులనుండి ఆశించడం తప్పే”…. అంటూ అక్కడే ఉన్న తన సోదరి జానకీ వైపు నిర్వేదంతో చూస్తూ ఉండిపోయింది నరసింహం ఆత్మ…!
***
“ నీ తోటి వారితో అంటిముట్టనట్టుగా ఉండటంలోనే గొప్పతనం ఉందనుకున్నావు… మరొకర్ని ఆదుకునే స్ధాయిలో ఉన్నావు… కాని మన స్నేహితుడు వెంకటేశానికి ప్రాణం మీదకు వచ్చినప్పుడు మాత్రం ముఖం చాటేశావు…. నీ కంటే స్ధితి మంతులు, సిరి సంపదలు కలిగి ఉన్న నీ బంధు వర్గం వారి కోసం మాత్రం అర్రులు చాచావు….
పైగా ఇదే నా తత్వం అని…జీవితాన్ని ఎంజాయ్ చేయడం నీకు తెలియదని ఆనాడు నన్ను వెటకరించావు…
అలాంటి వాడివి ఇప్పుడు మాత్రం నన్ను చుడటానికి ఎందుకు వచ్చావురా?… నేను మరణిస్తేకాని నీ తత్వంలో మార్పురాలేదన్న మాట….!
ఒరేయ్ భానుమూర్తి… నిర్జీవంగా ఉన్న నా దేహాన్ని ఒక్కసారి చూడరా…
కనీసం నేను తొడుకున్న చొక్కను సైతం నేను తీసుకెళ్లలేక పోతున్నాను… ఆకలి వేస్తున్న ఏమి తినలేకపోతున్నాను… దాహం వేస్తున్నా చుక్కనీరు కూడ త్రాగలేక పోతున్నాను…… ఎందుకంటే ఇప్పుడు నేను ఆవనిని విడిచిపోబోతున్న ఆత్మని కదా..! ..
.. ఏదైనా భూమి మీద నూకలు ఉన్నంత వరకేరా…ఇక్కడ మనం చేసిన మంచి పనులు, సంపాదించుకున్న పేరు ప్రతిష్టలే మనల్ని అందరి హృదయాల్లో సజీవంగా ఉండే విధంగా చేస్తాయి.. ఆ పాప పుణ్యాల ఫలమే మరణాంతరం తదుపరి మన కర్మఫలాలను నిర్ణయిస్తాయి…. అంతేకాని ఇక్కడ నుండి మనం పైకి తీసుకుపోయేది అంటూ ఏమి ఉండదురా …… భూమి మీద ఈ జీవితం క్షణ భంగురం అని…ఏది శాశ్వతం కాదు అని తెలుసుకో”…
…. అని అక్కడే ఉన్న తన క్లాస్ మేట్ భానుమూర్తిని నిలదీస్తున్నట్టుగా కడిగేస్తోంది నరసింహం ఆత్మ…!
…కాని నరసింహం ఆవేదన ఆరణ్యరోదనే అయింది… ఎందుకంటే అది ఎవరికి వినిపించని ఆత్మ ఆవేదన కాబట్టి…!
***
“జాతస్యహి ధృవో మృత్యు: ధ్రువం జన్మమృతస్యచ తస్తాద పరిహార్ధేనత్వం శోచితుమర్హసి” అనేది కాదనలేని సత్యం…. అదే విధంగా…
“ కులం, మతం ఎదైనాసరే మరణాంతరం మరణించిన వారి ఆత్మ కోసం జరిపే తంతులు కోకల్లలు మన సంప్రదాయంలో…
ఈ సంప్రదాయాలన్ని చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం… ఆ విధంగా శాంతించిన ఆత్మ భగవంతునివద్ధకు చేరుకోవడం కోసం కొరకే”… అంటూ అక్కడ జరపలసిన తదుపరి కార్యక్రమాల గురించి అక్కడ వారికి వివరిస్తున్నాడు…పరాంధామయ్య పంతులు గారు
పంతులు గారు మాటలు విన్న నరసింహం ఆత్మ ఒక్కసారిగా వికటంగా నవ్వింది నిర్వేదంతో…
“అయ్యో పిచ్చి పంతులు గారు మీరు వట్టి చాధస్తుల్లా ఉన్నారు… ఆ తంతులన్నీ పూర్తి కాకుండానే ఆత్మ సైతం భయపడి పారిపోయేంత భయంకరమైనవి నేటి సమాజంలోని కొందరి తీరుతెన్నులు…!
ఇలాంటి వారి కారణంగానే ఎవరైనాసరే బ్రతికున్నప్పుడు “క్షణ క్షణానికి” చస్తూ ఉంటే… చనిపోయిన తరువాత “ప్రతి క్షణానికి కనీసం వందసార్లు అయినా చావల్సిందే”
…. ఈ విధంగా ఆత్మను సైతం ప్రశాంతంగా ఉండనివ్వని మనస్తత్వాలు వీరందరివి ఎందుకంటే…..స్ధాయి, అంతస్ధులను బట్టి సంబంధాలను నెరపడం…కళ్ళ ముందు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలాగా ప్రవర్తించే నేటి మనషుల మనస్తత్వమే అందుకు ప్రధాన కారణం…!
ఇంకా నేను ఇక్కడే ఉంటే ఇంక ఎన్నెన్ని చూడాల్సి ఉంటుందో…ఇప్పటికే నా గుండె పగిలిపోతోంది… అంటూ దిక్కులు పగిలేలా అరుస్తూ బాధతో పైకి పారిపోసాగింది నరసింహం ఆత్మ.
