-రాష్ట్రం ఏర్పడేనాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు
-రాష్ట్రం ఏర్పాటైన 9 ఏండ్లల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ
-రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం అందించిన సబ్సిడీల సహకారం రూ.50వేల కోట్లు
-దేశంలో విద్యుత్ వినియోగంలో మనమే నెంబర్ వన్
-విద్యుత్ రంగంలో అగ్రగామిగా పాలకుర్తి నియోజకవర్గం
-పాలకుర్తి 132/33 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి
-రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా పాలకుర్తిలో జరిగిన విద్యుత్ విజయోత్సవ సభలో -మాట్లాడిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పాలకుర్తి, జూన్ 5 : చీకట్లో మగ్గిపోతున్న రాష్ట్రాన్ని వెలుగు జిలుగుల తెలంగాణగా మార్చిన ఘతన మన సీఎం కెసిఆర్ కే చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు నుంచి రాష్ట్రం ఏర్పాటైన 9 ఏండ్లల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని మంత్రి అన్నారు.
ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువగా పని చేసి, దేశంలోనే విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని, రాష్ట్రం వస్తే చీకట్లో మగ్గుతారని అన్న అప్పటి సీఎం ఇప్పటి వరకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ విజయం ప్రతిభ అంతా సీఎం కెసిఆర్ కే చెందుతుందని, అకుంఠిత దీక్ష, దక్షతలతో నిరంతరం శ్రమించి, తెలంగాణలో కోతలు లేని, హాలీడేలు లేని, నాణ్యమైన 24 గంటల విద్యుత్ ని నింరంతరాయంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని మంత్రి తెలిపారు.
రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా పాలకుర్తిలో 132/33 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి, అనంతరం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన విద్యుత్ విజయోత్సవ సభలో మంత్రి మాట్లాడారు.
విద్యుత్ లోటు, నిరంతర కోతలు, పవర్ హాలీడేలు, కరెంటు లేక పంటలు ఎండిపోయే దుస్థితి నుండి ఇవ్వాళ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్యుత్ మిగులు రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అభివృద్ధికి సూచికగా, ఇవ్వాళ తలసరి విద్యుత్ వినియోగంలో 1196 యూనిట్లతో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం అందించిన సబ్సిడీల సహకారం రూ.50వేల కోట్లకు పైగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో 27లక్షల 10వేల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, రైతుల తరపున ఇతర అన్ని రకాల సబ్సిడీగా 50వేల కోట్లు ప్రభుత్వం విద్యుత్ సహకారం అందించిందని మంత్రి వెల్లడించారు. ఒక్కో మోటారుకు లక్షా 20వేల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో కేవలం 49వేల కోట్లు మాత్రమే చెల్లిస్తే, ఇప్పుడు 883 కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం చెల్లించందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 87వేల 980 మంది రైతులకు 880 కోట్ల 4 లక్షలు సబ్సిడీగా చెల్లించినట్లు వివరించారు.
విద్యుత్ రంగంలో అగ్రగామిగా పాలకుర్తి నియోజకవర్గం
అలాగే రజకులకు ఆర్థికంగా తోడ్పాటుకు పాలకుర్తి నియోజకవర్గానికి 501 రజక సర్వీసులకు 250 యూనిట్లు ఉచితంగా ఇస్తూ, ఇప్పటి వరకు 16 లక్షల 66 వేల రూపాయలు అందించడం జరిగింది. 246 నాయీబ్రాహ్మణ సర్వీసులకు గాను 250 యూనిట్లు ఉచితంగా ఇస్తూ, ఇప్పటివరకు 36 లక్షల 62 వేల రూపాయల సబ్సిడీ అందించాము.
SC/ST విద్యుత్ వినియోగదారులకు 101 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద 887 సర్వీసులకు ఇప్పటి వరకు 3 కోట్ల 73 లక్షల రూపాయలు అందించడం జరిగింది. నాడు పాలకుర్తి నియోజకవర్గంలో 27 సబ్ స్టేషన్లు మాత్రమే ఉండగా తెలంగాణ ఏర్పడిన తరువాత అదనంగా 14 సబ్ స్టేషన్లు 25 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకోన్నాము. పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ ఏర్పడక ముందు 32 వేల 624 కనెక్షన్లకు 149 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది, కాని తెలంగాణ ఏర్పడిన తరువాత అదనముగా 8 వేల 275 సర్వీసులు మంజూరు చేసి మొత్తం ఈ 10 ఏళ్లలో 883 కోట్ల 73 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం చెల్లించడం జరిగింది.
పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ ఏర్పడక ముందు 5 వేల 830 ట్రాన్స్ ఫార్మర్లు ఉండగా 99 కోట్ల 93 లక్షల రూపాయల తో ఏర్పాటు చేశారు, కాని తెలంగాణ ఏర్పడిన తరువాత అదనంగా 2 వేల 500 కొత్త ట్రాన్స్ ఫార్మర్లు 37 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకోన్నాము. పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ ఏర్పడక ముందు 71 వేల 712 కరెంటు పోల్స్ 29 కోట్ల 56 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయగా, తెలంగాణ ఏర్పడిన 9 సంవత్సరాల కాలంలో అదనంగా 61 వేల 412 కరెంటు పోల్స్ ను 25 కోట్ల 30 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసుకోన్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. వాస్తవాలు ఇలా వుండగా, కొందరు అర్థంలేని ఆరోపణలు చేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటివాళ్ళు ఊళ్ళకు వస్తే, వారిని నిలదీయాలని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు.
విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో మనమే నెంబర్ వన్
జిల్లా కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ, విద్యుత్ ఉత్పత్తితోపాటు, వినియోగంలోనూ మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. సీఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు కలిసి అటు రాష్ట్రాన్ని, ఇటు పాలకుర్తి నియోజకవర్గాన్ని అద్భుతంగా విద్యుత్ రంగంలో తీర్చిదిద్దారన్నారు. అంతకుముందు మంత్రికి విద్యుత్ ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ వ్యాప్తంగా తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.