Suryaa.co.in

Features

పుస్తకానికి జయోస్తు

భగవంతుడు సృష్టించాడు మనిషిని..
వరమిచ్చాడు అద్భుతమైన మేథస్సుని.
ఆ మేధస్సు చేసిన అద్భుతాలు ఎన్నో,ఎన్నెన్నో.
చేర్చి,కూర్చిన విజ్ఞానమెంతో.
వందల సంవత్సరాల తపస్సు..
పరిణమించింది జ్ఞానంగా …
పరిఢవిల్లింది ఎందరో దివ్య జ్ఞాన మూర్తుల.. తేజస్సుగా.
బూర్జపత్రాలతో ఆరంభించి నేటి ఆధునిక కాగితం వరకు..
ఘంటాల నుండి కలాల వరకు విస్తరించింది..అక్షర. శిల్పం
జ్ఞానం..సర్వ వేద సారం..
నేటి మానవుని శక్తికి,ప్రగతికి సోపానం.

జన్మనిచ్చేది అమ్మైతే…
అప్పుడప్పుడు తోడు నిలిచేది తోబుట్టువులైతే
మనసుకు ఊతమిచ్ఛేది పుస్తకం.
తాను కదలకుండా ప్రపంచాన్ని చూపిస్తుంది.
తాను నవ్వకుండా నవ్విస్తుంది.
తాను ఏడవకుండా ఏడిపిస్తుంది..
మన అనుభవాలు కొన్నైతే…
పుస్తకం ద్వారా కోట్లమంది అనుభవాలు… జీవన వేదాలు..
గీతాసారాలు..
ఒక్కొక్క అనుభవం ..ఒక్కొక్క అనుభూతి
ఎన్నెన్నో ఊహలు…ఆ ఊహలతో అల్లుకునే భవితవ్యాలు.
ఆ పోరాటం లో మనిషి చేసే అంతర్యుద్ధం.
భావోద్వేగాలతో మనసొక కురుక్షేత్ర రణరంగం.
పుస్తకం కలిగిస్తుంది మనిషికి ప్రేరణ.
సూచిస్తుంది సమస్యలకు చక్కటి పరిష్కార యోచన.
దిశానిర్దేశం చేస్తుంది పుస్తకం.

నాటి తరానికి నేటి తరానికి అద్భుతమైన వారధిలా అనుభవాల సారధిలా…
ఏ తోడూ లేని ఏకాకికి మంచి నేస్తమే పుస్తకం.
అదొక విజ్ఞాన సర్వస్వం. కంటికి కనబడని విషయాలను వివరించే సుకవి .
ప్రాచీన, ఆధునిక,సామాజిక, సాంకేతిక, శాస్త్రీయ,భౌగోళిక, ఆర్థిక, వైజ్ఞానిక, రసాయనిక, ఆధ్యాత్మిక.. ఇలా… ఎన్నెన్నో రంగాలు..ఎన్నో విశేషాలు.
అద్భుత సందేశాలు,ఆనంతకోటి విజ్ఞాన విశేషాలు. ఎందరో వ్యక్తులు,ఎందరెందరో విద్రోహులు..
ఒకటేమిటి మానవ జీవితాల దర్పణం ఈ పుస్తకం.
వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే అద్భుత యంత్రం….మంత్రం.

ఈ పుస్తకమేగా….
విష్ణువు విశ్వరూపాన్ని సంభ్రమ విభ్రమాలను కలిగించే..
సుందర సురుచిర వాగ్విలాస సంపదతో అభివర్ణించి మన హృదయాల చెరగని ముద్ర వేసి,
మనలను ఆనంద రసడోలికల ఊయలలూపింది.
ఈ పుస్తకమేగా అష్టాదశ పురాణములను ,
సంస్కృతీ సంప్రదాయాలకు మనలను అనుయాయులుగా తీర్చిదిద్దినది.
ఈ పుస్తకమేగా ఎన్నో మత,కుల విశేషాలను విశ్వానికి పరిచయం చేసినది..
అటువంటి పుస్తకానికి జయోస్తు.

– శశిబాల

LEAVE A RESPONSE