-త్వరలో పరిపాలనా పరమైన అనుమతులు, ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం
-గత సంవత్సరం ప్రారంభమైన 15 నూతన డిగ్రీ కాలేజీలు
-రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు
-327కు చేరిన బీసీ గురుకులాలు, సంతోషం వ్యక్తం చేస్తున్న సబ్బండ వర్ణాలు
-ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి గంగుల కమలాకర్
వెనుకబడిన వర్గాలను అన్నిరంగాల్లో అభివ్రుద్ది చేసే సంకల్పంతో కేసీఆర్ సర్కార్ విశేష కృషి చేస్తుంది, తాజాగా 17 నూతన బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేయడం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ప్రభుత్వానికి తన కృతజ్ణతలు తెలియజేసారు. నేడు విడుదల చేసిన ప్రకటనలో వివరాలను వెల్లడిస్తూ రాష్ట్ర వెనుకబడిన వర్గాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలకు త్వరలోనే పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఈ విద్యా సంవత్సరం నుండే తరగతుల ప్రారంభానికి ముఖ్యమంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాలతో అన్ని చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలియజేసారు.
గతంలో వర్గల్ కాలేజికి అదనంగా 2022 – 23 విద్యా సంవత్సరంలో నూతనంగా 15 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసుకొని క్లాసులను ప్రారంభించుకున్నామని, ఇందులో రెండు వ్యవసాయ డిగ్రీ కాలేజీలున్నాయని తాజాగా జిల్లాకొక డిగ్రీ కాలేజీకి ముఖ్యమంత్రి అనుమతిస్తూ మరో 17 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడం బీసీలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యం వైపు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేయడానికి నిదర్శనమన్నారు మంత్రి గంగుల. గత విద్యా సంవత్సరంలోనే నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో 33కొత్త గురుకులాల్ని సైతం ప్రారంభించామన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకునెట్టేయబడ్డ బీసీల జీవితాల్లో స్వరాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ సారథ్యంలో అన్నిరంగాల్లో స్వర్ణయుగం సాదిస్తున్నామన్నారు. గతంలో కేవలం 19 గురుకులాలు, 7000మంది విద్యార్థులకు మాత్రమే గురుకుల విద్య అరకొరగా అందుతుండేదని, కేసీఆర్ ప్రభుత్వం సకల హంగులతో, ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో గురుకులాలను దశలవారీగా 261కి అనంతరం 310కి నేటి పెంపుతో ఏకంగా 327కు బీసీ గురుకులాలను పెంచిందన్నారు. బీసీ గురుకులాల్లో ప్రతీ ఏడు ఇంగ్లీష్ మీడియంలో చదివిన 1,68,000 పైచీలుకు వెనుకబడిన వర్గాల బిడ్డలు నేడు అన్ని పోటీపరీక్షల్లోనూ తమ సత్తా చాటుతూ తెలంగాణ కీర్తి పతాకను వినువీధుల్లో ఎగిరేయడం సంతోషంగా ఉందన్నారు.
దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న శుభతరుణంలో కేసీఆర్ సర్కార్ వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం వేల కోట్లను ఖర్చు చేస్తుందని చెప్పారు మంత్రి గంగుల. 250 యూనిట్ల వరకూ రజకులకు, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందజేస్తున్న ప్రభుత్వం తాజాగా చేతి వృత్తుల కులాలను ప్రోత్సహించడం కోసం లక్ష రూపాయల సహాయాన్ని సైతం అందజేస్తుందని, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరోసారి ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్.