Suryaa.co.in

Editorial

కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం?

-పాలేరు సీటు షర్మిలకే
-తెలంగాణలో క్రైస్తవుల ఓట్లపై కాంగ్రెస్‌ వల
-ఏపీలో జగన్‌పై షర్మిల అస్త్రం
-ఏపీ కాంగ్రెస్‌కు స్టార్‌ క్యాంపెయినర్‌
-ఏపీలో క్రైస్తవుల ఓట్లపై కాంగ్రెస్‌ నజర్‌
-డికె శివకుమార్‌ రాయబారం
-ఇప్పటికే డికెను రెండుసార్లు కలిసిన షర్మిల
-ఫలించిన కెవిపి మధ్యవర్తిత్వం?
-తాజాగా రాహుల్‌కు షర్మిల బర్త్‌డే విషెష్‌
-తెలంగాణలో స్పీడు పెంచుతున్న కాంగ్రెస్‌
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైఎస్సార్‌టీపీ అధినేత్రి, దివంగత సీఎం వైఎస్‌ ముద్దులకూతురు, ఒకప్పటి జగన్‌ సంధించిన బాణమైన షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారా? ఆ మేరకు తెరవెనుక ప్రయత్నాలు దాదాపు పూర్తయినట్లేనా? కర్నాటక ఉప ముఖ్యమంత్రి, ట్రబులర్‌షూటర్‌ డికె శివకుమార్‌, దివంగత వైఎస్‌ ఆత్మ కెవిపి రామచంద్రరావు రాయబారం ఫలించిందా? త్వరలో ఆ మేరకు ఒక ప్రకటన విడుదల కానుందా? ఇదీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌. సొషల్‌మీడియాలో కూడా జోరుగా సాగుతున్న చర్చ ఇదే. ఇప్పటిదాకా దీనిపై షర్మిల నోరువిప్పకపోవడం బట్టి, ఈ ప్రచారం నిజమని నమ్మేందుకు అవకాశం ఏర్పడింది.

తెలంగాణలో అధికారపగ్గాల కోసం, తెగించి పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ స్పీడు పెంచుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు పీసీసీ దళపతి రేవంత్‌రెడ్డి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. రేవంత్‌రెడ్డి నాలుగు అడుగులు తగ్గి, తనను వ్యతిరేకించేవారిని కూడా సమన్వయం చేసుకుని వెళుతున్న వైనం, చేరికల ప్రకియను మరింత సుగమం చేస్తోంది.

రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న భావన, కర్నాటక ఫలితాల తర్వాత మరింత పెరిగింది. కార్మిక, కింది స్ధాయి వర్గాలు కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్న కోరికతోపాటు, రేవంత్‌రెడ్డి సీఎం అయితే బాగుంటుందన్న భావన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, బీజేపీలోని రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్‌ వైపు చూస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో వైఎస్‌ బిడ్డ షర్మిల కూడా, కాంగ్రెస్‌ కండువా కప్పేసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు, సూత్రప్రాయ అంగీకారం కుదిరిందన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్‌ సర్కారుపై విరుచుకుపడుతున్న షర్మిలను.. కేసీఆర్‌ ప్రభుత్వం ఇటీవల అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో, ఆమె బీఆర్‌ఎస్‌ సర్కారుపై శివంగిలా విరుచుపడుతోంది. పైగా.. క్రైస్తవుల్లో తిరుగులేని ఇమేజ్‌ ఉన్న షర్మిల కాంగ్రెస్‌లో చేరితే, క్రైస్తవ వర్గం కాంగ్రెస్‌ వైపు మళ్లే అవకాశాలున్నాయి. విభజనకు ముందు క్రైస్తవులు, కాంగ్రెస్‌ పార్టీకే గంపుగుత్తగా ఓటేసేవారు. కానీ విభజన తర్వాత, వారంతా టీఆర్‌ఎస్‌ ఓటబ్యాంకుగా మారిపోయారు.

షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా, తెలంగాణలోని క్రైస్తవుల ఓటు బ్యాంకు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పోలయ్యే అవకాశం ఉందన్న అంచనా, కాంగ్రెస్‌ నాయకత్వంలో కనిపిస్తోంది. ప్రధానంగా షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కు, తెలంగాణలోని క్రైస్తవ సమాజంపై పట్టుంది. ఆయన నిర్వహించే స్వస్థత కూటములకు వేలాదిమంది క్రైస్తవులు హాజరవుతుంటారు.

ఆమె సేవలను అటు ఏపీలోనూ వినియోగించుకోవచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. షర్మిలతో జగన్‌కు చెక్‌ పెట్టాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్‌ విజయానికి ఆయన బావ, షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ పరోక్షంగా సహకరించారు. లోటస్‌పాంటడ్‌ వేదికగా.. ఏపీలోని పాస్టర్లతో అవిశ్రాంత సమావేశాలు నిర్వహించిన అనిల్‌, క్రైస్తవులు-దళిత క్రైస్తవుల ఓట్లను వైసీపీకి వేయించేలా కృషి చేశారన్నది బహిరంగ రహస్యం. జగన్‌ గెలిచిన తర్వాత షర్మిల-అనిల్‌ను దూరంగా పెట్టడంతో, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకోవలసిన పరిస్థితులను సృష్టించారన్నది, వైఎస్‌ కుటుంబాన్ని అభిమానించేవారి విమర్శ.

కాగా షర్మిల వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేలా.. కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌, కాంగ్రెస్‌ మాజీ ఎంపి కెవిపి రామచంద్రరావు రాయబారం నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఆమెకు ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. డికె శివకుమార్‌ ఇప్పటికే ఆమెతో రెండుసార్లు భేటీ అయినట్లు చెబుతున్నారు. వైఎస్‌ జీవించినప్పుడు శివకుమార్‌, ఆయనతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించేవారు.

వైఎస్‌ బెంగళూరు వెళ్లినప్పుడు జగన్‌ నివాసంలో కాకుండా, శివకుమార్‌ ఫాంహౌస్‌లోనే గడిపేవారని వైఎస్‌ సన్నిహితులు కూడా చెబుతుంటారు. షర్మిలతో కూడా శివకుమార్‌ సన్నిహితంగా ఉంటారని, కుటుంబస్నేహం కూడా ఉందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల ఒంటరిపోరాటం వల్ల ప్రయోజనం లేదని, కాంగ్రెస్‌లో చేరితే ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డికె, కెవిపి షర్మిలకు నచ్చచెప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తాజాగా కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా ఆయనను అభినందిస్తూ ట్వీట్‌ చేయటం కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.rahul-gandhi

LEAVE A RESPONSE