– దళితుడిని చంపిన అనంతబాబు సభకు ప్రభుత్వ మద్దతా?
– మాజీమంత్రి కె.ఎస్.జవహర్
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేత అనంతబాబుకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడం బడుగు బలహీనవర్గాలను అవమానించడమే. అనంతబాబు చేతిలో హతమైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం సంతాప సభకు గతంలో అనుమతించని ప్రభుత్వం ఇప్పుడు నిందితుడు అనంతబాబు సభకు ఎలా అనుమతి ఇస్తారు?
అనంతబాబుకు వైసీపీ నేతలు మద్దతుగా నిలవడం దళితులను వంచించడం కాదా? గంజాయి, గ్రానైట్, సారా వంటి అక్రమ వ్యాపారాలను యధేచ్ఛగా కొనసాగించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు సభలు, సమావేశాలంటూ అనంతబాబు హడావుడి చేస్తున్నాడు. తనే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపానని ఒప్పుకున్న వ్యక్తికి సభలు పెట్టుకునేందుకు అనుమతులివ్వడం పోలీసు వ్యవస్థకు మాయని మచ్చ. తాడేపల్లి ప్యాలెస్‌కు మూటలు తరలిస్తున్నందుకే అనంతబాబు లాంటి వ్యక్తుల ఆగడాలు యధేచ్ఛగా సాగుతున్నాయి.
కూనవరం బహిరంగ సభకు ప్రత్యేకంగా బస్సులు కేటాయించి జనాన్ని సమీకరించడం దళితులను అవమానించడం కాదా? ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటాల కోసం చేపట్టే కార్యక్రమాలకు బస్సులివ్వమంటే అనుమతించని ప్రభుత్వం అనంతబాబు సభకు మాత్రం అడక్కముందే బస్సులివ్వడం దేనికి సంకేతం? కూనవరంలో బహిరంగ సభ పెట్టింది ఎవరికోసం? ఒక నేరస్తుడి బహిరంగ సభకు వందల మంది పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేయడం దేనికి సంకేతం?
హత్యకేసులో నిందితుడైన అనంతబాబు సభకు అనుమతి ఎలా ఇచ్చారు? ప్రధాన రహదారిపై ప్రజలకు ఇబ్బంది కలిగేలా అనుమతి ఎలా ఇస్తారు? బహిరంగసభకు అనుమతి ఇవ్వొద్దని దళిత సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఆందోళన చేసినా పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా అనుమతులివ్వడం దళితులను అవమానించడమే.
పంచ్ ప్రభాకర్‌లాంటి వ్యక్తులతో ఒకవైపు మాల, మాదిగలను అవమానిస్తూ.. మరోవైపు అనంతబాబులాంటి ఖూనీకోర్లను దళితులపైకి ఉసిగొల్పుతున్నాడు. దళితుడిని పొట్టనపెట్టుకున్న వైసీపీకి బుద్ధి చెప్పడానికి దళితులు, దళిత సంఘాలు ఐక్యం కావాలి.