- పవన్ కళ్యాణ్ కి బ్రహ్మరథం పట్టిన జనం
- ఎదురొచ్చిన గజమాలలు.. హారతులు పట్టిన ఆడపడుచులు
- వేలాది ద్విచక్ర వాహనాల ర్యాలీ
- తాడేపల్లిగూడెంలో వారాహి విజయ యాత్ర సభ
జయహో జనసేనాని అంటూ తాడేపల్లిగూడెం ప్రజానీకం ఎలుగెత్తారు.. వారాహి విజయ యాత్రకు ప్రతి అడుగునా బ్రహ్మరథం పట్టారు. వేల సంఖ్యలో ద్విచక్రవాహనాలు అనుసరించగా ఆడపడుచుల హారతులు.. గజమాలల సత్కారాలు.. అభిమానుల హర్షాతిరేకాల మధ్య పవన్ కళ్యాణ్ పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. జన సైనికులు, వీరమహిళలు విజయనాదంతో గర్జించగా., జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎస్వీఆర్ సర్కిల్ నుంచి సమరనాదం చేశారు. వారాహి రథం అధిరోహించి జనసేనాని చేసే ప్రసంగం వినేందుకు తాడేపల్లిగూడెం పట్టణ వాసులంతా ఎస్వీఆర్ సర్కిల్ కి చేరుకున్నారా అనిపించేంతగా ఆ కూడలి కిక్కిరిసింది.
పవన్ కళ్యాణ్ ర్యాలీతో అలంపురం నుంచి ఎస్వీఆర్ సర్కిల్ లోని వారాహి విజయ యాత్ర సభా ప్రాంగణం వరకు జనం రోడ్ల మీద బారులు తీరి జనసేనానికి ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ రోడ్ షో సాగిన తాడేపల్లిగూడెం – తణుకు జాతీయ రహదారి, పట్టణంలోని మెయిన్ సెంటర్ మొత్తం జనసంద్రంగా మారింది. యాత్ర ఆద్యంతం పండుగ వాతావరణం మధ్య సాగింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు అలంపురం నుంచి సభకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ కి సభ విజయాన్ని కాంక్షిస్తూ ఆడపడుచులు హారతులు పట్టారు. అక్కడి నుంచి వేలాది ద్విచక్రవాహనాలు అనుసరించగా జనసేన శ్రేణుల కేరింతల మధ్య ముందుకు కదిలారు. అలంపురం జంక్షన్, జువ్వలపాలెం బస్టాండ్, తాడేపల్లిగూడెం వంతెన, మెయిన్ సెంటర్లలో భారీ జనసమూహాలు జనసేనానిపై పూల వర్షం కురిపించాయి. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరుస్తూ.. అభివాదం చేస్తూ.. ఆడపడుచులు, జనసైనికులకు కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. జువ్వలపాలెం బస్టాండ్ సెంటర్ వద్ద భారీ గజమాలతో పార్టీ శ్రేణులు సత్కరించారు.
- గ్రామ గ్రామం నుంచి స్వాగత బ్యానర్లు
వారాహి విజయ యాత్ర సభతో తాడేపల్లిగూడెం పట్టణం మొత్తం జనసేన జెండాలు రెపరెపలాడాయి. స్వాగత హోర్డింగులు, బ్యానర్లతో పట్టణం మొత్తం నిండిపోయింది. పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకుతూ బస చేసిన ప్రాంతం నుంచి ఎస్.వి.ఆర్ సర్కిల్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి జనసేన శ్రేణులు బ్యానర్లు కట్టారు. ప్రతి గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడిస్తామని చెప్పకనే చెప్పారు. సేనాధిపతిగా మీరు ముందుండండి.. సైన్యంగా మేము మీ వెనుక నడుస్తామంటూ యువత పెద్ద ఎత్తున బ్యానర్లు ప్రదర్శించారు. ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో.. నినాదం జనసేన శ్రేణులు చేతబూనిన ప్రతి బ్యానర్లో కనబడింది. ఆడబిడ్డల మాన ప్రాణ రక్షణ జనసేనతోనే సాధ్యం.. హల్లో ఏపీ.. బైబై వైసీపీ నినాదాలు ప్రచురించిన ప్లకార్డులు వారాహి యాత్ర సభ ఆధ్యంతం దర్శనమిచ్చాయి.
- బైబై వైసీపీ.. వెల్కమ్ జనసేన..
వారాహి యాత్ర సభా ప్రాంగణానికి చేరుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ ఆడపడుచుల గ్యాలరీ వద్దకు వెళ్లి సభకు వచ్చిన ప్రతి వీర మహిళకు ప్రత్యేకంగా అభివాదం చేశారు. వారాహి విజయ యాత్ర సభ నిర్వహించిన ఎస్వీఆర్ సర్కిల్ ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. ర్యాలీ, సభా ప్రాంగణ పరిసరాల్లో ఉన్న భవంతులు, వాహనాలు కూడా వారాహి యాత్రకు వచ్చిన జనం ఆక్రమించేశారు. సభకు నలువైపులా ఎటుచూసినా కనుచూపుమేర జనప్రవాహం కేరింతలు కనబడ్డాయి. సభకు వచ్చిన ప్రజలు ఇబ్బంది పడకుండా పవన్ కళ్యాణ్ ప్రసంగం వినేందుకు వీలుగా ఎస్వీఆర్ సర్కిల్ పరిసరాల్లో భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇంఛార్జ్ కొటికలపూడి గోవిందరావు, తాడేపల్లిగూడెం ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.