-మా భూములు లాక్కొని తప్పుడు కేసులు బనాయించారు
-నారా లోకేష్ ఎదుట లింగసముద్రం దళితుల ఆవేదన
మేము తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులమన్న కక్షతో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మమ్మల్ని పనిగట్టుకుని వేధిస్తున్నారు, మాకు ఇచ్చిన చెట్టుపట్టాలను రద్దుచేయించారు, అదేమని ప్రశ్నించినందుకు మాపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం దళితులు యువనేత లోకేష్ ఎదుట వాపోయారు.
లింగసముద్రం కు చెందిన దళిత నాయకుడు గాలంకి ప్రసాద్ నేతృత్వంలో బాధిత దళితులు యువనేత లోకేష్ ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. 2015లో గత టిడిపి ప్రభుత్వం లింగసముద్రం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.3-8లో వనం-మనం పథకం కింద ఒక్కొక్కరికి 1.40 సెంట్ల చొప్పున 120మంది దళితులకు చెట్టుపట్టాలు ఇచ్చారు. అందులో మామిడి మేము మామిడి మొక్కలు వేసి సంరక్షించుకుంటున్నాము.
2019లో ప్రభుత్వం మారగానే మా చెట్టు పట్టాలను రద్దుచేశారు. మేం హైకోర్టుకు వెళ్లగా మాకు అనుకూలంగా తీర్పువచ్చింది. మేము టిడిపి సానుభూతిపరులమని కక్షగట్టి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వత్తిడితో ఎమ్మార్వో మాకు పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో చెట్లు లేవని నివేదిక పంపారు. దీనిపై మేము నిరసన తెలపడానికి ప్రయత్నించగా, అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్ విధించారు. మా ట్రాక్టర్ ను సీజ్ చేసి ఆరునెలలపాటు స్టేషన్ లోనే ఉంచారు. ఎమ్మెల్యే అరాచకాల నుంచి మాకు రక్షణ కల్పించి, మా భూములు, చెట్లు మాకు దక్కేవిధంగా సహకారం అందించాలని వారు కోరారు.
నారా లోకేష్ స్పందిస్తూ…
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ఎపి చరిత్రలో తొలిసారిగా దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. దళితులకు చెందిన 12వేల ఎకరాల ఎసైన్డ్ భూములను జగన్ ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుంది.
తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించిన దళితులపై ఉక్కుపాదం మోపుతోంది. దళితులకు చెందాల్సిన రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని అన్యాయం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లింగసముద్రం దళితుల భూమిని వారికి అప్పగించేలా చర్యలు తీసుకుంటాం. దళితులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేస్తాం. దళితులను పనిగట్టుకుని వేధించిన పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.