– ఎమ్మెల్సీ డా॥ వేపాడ చిరంజీవిరావు
మంచి చేస్తా.. ఉన్న వ్యవస్థలను, వాలంటీర్లను అవమానించడం సంస్కారం కాదు అని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వాఖ్యానించారు.పాలక పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ అమలులోకి వచ్చినప్పటి నుండి అందులో ఎన్నో లోపాలు బయటపడ్డాయి. వాటిని ప్రజాస్వామ్యంలో ఎత్తిచూపడం సహజం.
అంత మాత్రాన సంస్కారం లేదని చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV-5 లను దిగజారి విమర్శించడం ఎంత మాత్రం సమంజసం కాదు.
రాష్ట్రంలో కొంతమంది వాలంటీర్లు (అందరూ కాదు) అధికార పార్టీ అండతో కొన్ని అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లు పత్రికలు, టీవీల్లో చూస్తున్నాం, వింటున్నాం. పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు, స్వయంగా విజయసాయిరెడ్డి కూడా వైకాపా కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించామని గతంలో చెప్పారు.
వాలంటీర్లు చేసిన కొన్ని అక్రమాలను పరిశీలిద్దాం
ఎ) ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా వారి ఓట్లు చేర్చడం, అనర్హులను కూడా ఓటర్లగా చేర్చడం జరిగింది.
బి) ఓటర్లను పోలింగ్ బూత్ ల వరకు తీసుకురావడం, వైకాపా అభ్యర్థికి ఓటు వేయకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించడం జరిగింది.
సి) వైకాపా అభ్యర్థుల తరుపున ఓటర్లకు డబ్బులు పంచడం జరిగింది.
డి) ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లు తొలగించడం జరిగింది.
ఈ) కొంతమంది గంజాయి అక్రమ రవాణాలో పాల్గొనడం, వ్యక్తిగత సమాచారం, కుటుంబ వ్యవహారాలకు చెందిన అంశాలు వాలంటీర్ల ద్వారా బయటకు చేరడం (డేటా చౌర్యం) నిజం కాదా?
1. ప్రభుత్వ ఖజానా నుండి కోట్ల రూపాయిలను వాలంటీర్లకు గౌరవ వేతనాన్ని అందిస్తున్న వారిని వైకాపా పార్టీ సేవకు పార్టీ కార్యకర్తల్లా ఉపయోగించడం, రోజుకి 165 రూపాయిలిచ్చి వారి శ్రమను దోపిడి చేయడం, నిర్వీర్యం చేయడము సంస్కారమా?
2. దేశ,విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచిన, సాక్ష్యాత్తు తెలంగాణా మంత్రి కల్వకుంట్ల తారకరామారావుచే హైదరాబాద్ ఐటీ హబ్ గా మారడానికి చంద్రబాబునాయుడు గారి దూరదృష్టి కారణమని ప్రశంసలు పొందిన, సముచిత ధరలకు కూరగాయలు అందించే రైతు బజార్లు వంటి వ్యవస్థను ప్రవేశపెట్టి, క్లిష్ట సమయంలో రాష్ట్రానికి కియా-కార్ల కంపెనీని, పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకువచ్చిన, రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబునాయుడుగార్ని విధానాలపై కాకుండా, వ్యక్తిగతంగా విమర్శించడం సంస్కారమా?
సిఎం జగన్ చంద్రబాబు ని ‘ముసలాయన’ అని ప్రసంగంలో మాట్లాడారు. ఫోర్డ్ పేర్కొన్నట్లు “నేర్చుకోవడం ఆపివేస్తే 20 సంవత్సరాలయనా, 60 సంవత్సరాలయినా అతడు వృద్ధుడే”.
చంద్రబాబునాయుడు ఈ రోజుకి కూడా 18 గంటలు కష్టపడుతున్నారు. ప్రస్తుతం అస్థవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలని తపన పడుతున్నారు. మీరు పేర్కొన్న ఆయనే కదా క్లిష్ట పరిస్థితులలో రాష్ట్రానికి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకువచ్చినది. యువకుడిగా చెప్పుకొనే జగన్ ఏమి చేస్తున్నారో చూస్తున్నాం..వచ్చిన కొద్ది పాటి పెట్టుబడిదారులను, పరిశ్రమలను వెళ్లగొడు తున్నారు.
3. ముఖ్యమంత్రి గారూ.. చంద్రబాబునాయుడు ముసలాయన అనడం ఎంత వరకు సంస్కారం? అదే నోటితో అదే వయుస్సున్న నరేంద్రమోడి గార్ని అలా అనగలరా?
4. 100లతో ప్రారంభమైన యువగళం వేలతో జన సంద్రంగా మారి లోకేష్ పాదయాత్రలోని ప్రతి అడుగు తాడేపల్లి ప్యాలెస్ అధికార దర్పణాన్ని,అక్రమాలను బట్టబయలు చేస్తుంది . లోకేష్ గారికి వస్తున్న ప్రజాదారణను చూడలేక, ఓర్చుకోలేక ఏం మాట్లాడాలో తెలియక ఎప్పుడో విద్యార్థి దశలో ఉన్న ఫోటో పట్టుకొని వ్యక్తిగత విమర్శలకు దిగడం సంస్కారమా?
5. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన చనిపోయిన 3000 మందికి ఒక్కొక్కరికి రూ.1,00,000లు చొప్పున 30 కోట్లు రూపాయిలు సొంత ధనాన్ని అందించిన పవన్ కళ్యాణ్ కురుపాంలో అమ్మఒడి నిధులు, వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధులు విడుదల సందర్భంగా ప్రభుత్వ అధికార కార్యక్రమంలో జుగుప్సాకరంగా వ్యక్తిగత అంశాలు, భార్యల విషయానికి పోయి విమర్శించడం సంస్కారమా?
6. తెలుగు పత్రికారంగం ఖ్యాతిని నేటికీ ఖండాంతరాలకు వ్యాపింపజేసిన మీడియా దిగ్గజం రామోజీ , ఆంధ్రజ్యోతి, TV-5 లను గజదొంగల ముఠా అని అధికారక కార్యక్రమ సభలో విమర్శలు చేయడం సంస్కారమా?
మంచి చేస్తున్న వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేయడం ఇది “కలియుగం కదా?” అని అడుగుతున్నానని జగన్మోహన్రెడ్డిగారు ప్రసంగించారు. నిజమే ఇది కలియుగం కాబట్టే వివేకానందరెడ్డిగారి హత్యను గొడ్డలిపోటును మొదట గుండెపోటుగా ప్రకటించడం, తరువాత రాజకీయ ప్రయోజనాల కొరకు దానిని చంద్రబాబు పై నెట్టడం, నేడు సిబిఐ రంగ ప్రవేశం చేయడంతో నిజాలు ఒకటికి ఒకటి బయటపడుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకు తల్లిని, తోబుట్టువును ఉపయోగించుకొని తరువాత గాలికి వదిలివేయడం కలియుగమే అని ప్రజలు గుర్తించారన్న విషయాన్ని సిఎం జగన్ గుర్తెరిగి వ్యవహరిస్తే మంచిది!
సీఎం జగన్ తనకు నచ్చని ప్రత్యర్థి నాయకులు,ప్రతిపక్ష పార్టీలు, పత్రికలు,టీవీ ఛానళ్లపై విమర్శలు చేసేందుకు ప్రభుత్వ సభలను వేదికగా చేసుకోవడం సిగ్గుచేటు. ప్రజల సొమ్ముతో నిర్వహించే సభల్లో ఇటువంటి వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజల విలువైన సమయంతో పాటు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కిందకు వస్తుందనే కనీస జ్ఞానాన్ని సిఎం జగన్ అలవర్చుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.