– అప్పటివరకూ వదిలేదిలేదంటున్న గ్రామస్థులు
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన అధికారులను స్థానికులు నిర్బంధించారు. తమ సమస్యలను పరిష్కరించిన తరువాతే సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడేళ్ల కిందట గ్రామంలో అర్హులైన 600 మంది లబ్ధిదారులకు.. ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించారు. ఆ భూముల్లో స్థలాల విభజన చేయకుండా, సౌకర్యాలు కల్పించకుండా.. లబ్ధిదారులకు స్థల వివరాలు లేని ఖాళీ పట్టాలు అందజేశారు.
అప్పటి నుంచి లబ్ధిదారులు తమ స్థలాలు ఎక్కడ అని పలుమార్లు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. దీంతో స్థలాల్లో ఇంటి నిర్మాణం గురించి తేల్చే వరకు ఎవరూ బయటకు వెళ్లేది లేదంటూ స్థానికులు అధికారులను నిర్బంధించారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే దొరబాబుకు అత్యధిక మెజారిటీ ఇచ్చినా తమ గ్రామంపై ఎందుకింత వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపితే గానీ, వదిలేది లేదని హెచ్చరించారు.