– నెలరోజుల నుంచి కనిపించని కార్యకలాపాలు
– ఎన్నికల సమయంలోనూ నిపించని హడావిడి
– కార్యాలయం ముఖం చూడని సీనియర్లు
– పార్టీ ఆఫీసులో కనిపించని ప్రెస్మీట్లు
– సమస్యలపై గళం విప్పని అధికార ప్రతినిధులు
– తెలంగాణ ప్రజల సమస్యలపై గళం విప్పని అధ్యక్షుడు
– ఇప్పటిదాకా మీడియాముందుకు రాని అధ్యక్షుడు కాసాని
– ప్రైవేటు వ్యక్తుల పెత్తనంతో దూరమవుతున్న నేతలు
– పార్టీ అధినేత చంద్రబాబుకు నేతల ఫిర్యాదు
– జిల్లా పార్టీ సమీక్షలకు సెలవు
– ప్రత్యర్ధులపై స్పష్టత లేని పార్టీ వైఖరి
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలుగుదేశం తెలంగాణ శాఖలో మౌనం రాజ్యమేలుతోంది. హైదరాబాద్ లోని టీడీపీ ఆఫీసు, నేతలు లేక వెలవెలబోతోంది. పార్టీ ఆఫీసును ప్రైవేటు పీఆర్వోలకు ధారాదత్తం చేయడంతో, వారి పెత్తనం సహించలేక సీనియర్లు పార్టీ ఆఫీసు ముఖం చూడటం మానేశారు. తెలంగాణ టీడీపీని పార్టీ నాయకత్వం వదిలేసిందన్న భావన, చాలామందిలో స్థిరపడిపోవడం కూడా దానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో, పార్టీని పరుగులు తీయాల్సిన నాయకత్వం స్తబ్దతగా ఉండటాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎన్నికల సమయంలో కూడా పార్టీ ఆఫీసులో మౌనం రాజ్యమేలడంపై, కార్యకర్తల్లో విస్మయం వ్యక్తమవుతోంది. జిల్లా సమీక్షలు, ఎన్నికల వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపిక కసరత్తు, రాజకీయ ప్రత్యర్ధులపై మాటల దాడిపై బిజీగా ఉండాల్సిన పార్టీ ఆఫీసు, జనం లేక వెలవెలపోవడంపై పార్టీ శ్రేణుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
భారీ వర్షాలు, ధరణి సమస్యలు, కొత్త పెన్షన్లు, అందని రైతుబంధు వంటి కీలక సమస్యలతో తెలంగాణ ప్రజానీకం తల్లడిల్లుతోంది. దానిపై ప్రతిపక్షంగా ప్రభుత్వంపై విరుచుకుపడాల్సిన పార్టీ నేతలు, పత్తా లేకుండా లేకుండా పోవడంపై పార్టీ శ్రేణుల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో పలు కీలకమైన సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్టీపీ క్షేత్రస్థాయి పోరాటాలు చేస్తున్నాయి. చివరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా హడావిడి చేస్తున్నారు. కానీ కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం, వాటికి దూరంగా ఉండటంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టకపోవడమే ఆశ్చర్యం.
బీఎస్పీ, వైఎస్సార్టీపీ లాంటి పార్టీ అధ్యక్షులు కూడా ప్రెస్మీట్లు పెట్టి, సర్కారును దునుమాడుతున్న పరిస్థితిని టీడీపీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. కానీ కాసాని మాత్రం ఇప్పటిదాకా ప్రెస్‌మీట్ నిర్వహించి, కేసీఆర్ సర్కారును విమర్శించకపోవడం, ప్రజలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యపైనా స్పందించకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు.
తాను ప్రెస్మీట్లు పెట్టకపోయినా అధికార ప్రతినిధులు, అనుబంధసంస్థల అధ్యక్షులు, పొలిట్‌బ్యూరో సభ్యులతో కూడా ప్రెస్మీట్లు పెట్టించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వం విఫలమైంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విపక్షాలన్నీ, ప్రభుత్వ అసమర్థతపై విరుచుకుపడుతున్నాయి. కానీ టీడీపీ మాత్రం దానిపై ఇప్పటిదాకా నోరుమెదిపింది లేదు. నగ రాన్ని డల్లాస్ చేస్తామన్న మంత్రి కేటీఆర్ మాటలను గుర్తు చేస్తున్న విపక్షాలు, తాజా పరిస్థితిని చూపిస్తూ సర్కారును ఇరుకునపెడుతున్నాయి.
కానీ టీడీపీ నేతలు మాత్రం ఇప్పటిదాకా, దానిపై కార్యాచరణ చేపట్టిన దాఖలాలు లేవు. ఇక ప్రధానమైన రైతుబంధు, బీసీబంధు, డబుల్బెడ్రూం ఇళ్లు పూర్తిస్థాయిలో అందక లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారు. వారి పక్షాన కాంగ్రెస్, బీజేపీ ప్రత్యక్ష పోరాటాలు చేస్తుంటే, టీడీపీలో మాత్రం చలనం లేదని, పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ ఆఫీసులో ప్రెస్మీట్లు నిర్వహించి నెలరోజుల పైమాటే. అందుకు కారణం పార్టీ ఆఫీసులో తిష్ఠవేసిన ప్రైవేటు పీఏలే కారణమని సీనియర్లు చెబుతున్నారు. తమను పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టవద్దని, ప్రెస్‌క్లబ్‌లో పెట్టుకోమని సదరు ప్రైవేటు వ్యక్తులు లక్ష్మణ రేఖ విధించడమే దానికి కారణమంటున్నారు.
దానితోపాటు తాము కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించాలా? వద్దా అన్న అంశంపై, అధ్యక్షుడు కాసాని ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదంటున్నారు. ఈవిధంగా మౌనంగా ఉన్నందున, టీడీపీ కూడా బీఆర్ఎస్కు బీ టీము అని అనుకునే ప్రమాదం లేకపోలేదని, నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేటు వ్యక్తులను స్వయంగా అధ్యక్షుడే ప్రొత్సహిస్తూ.. ‘నేను ప్రైవేటు పీఏను తొలగించేది లేదు. మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండ’ని ఒక యూట్యూబ్ రిపోర్టర్‌కు స్పష్టం చేయడం వివాదంగా మారింది. స్వయంగా పార్టీ సీనియర్ల సమక్షంలో.. ప్రైవేటు పీఏను కూర్చోపెట్టి, నేతలు ఆయనకు క్షమాపణ కోరడం ఆగ్రహానికి కారణమయింది.
పార్టీకి ఎలాంటి సంబంధం లేని ఒక ప్రైవేటు పీఏను తమ ఎదుట కూర్చోబెట్టి, తమను అతనికి క్షమాపణ చెప్పాలని అడగటాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోయారు. అప్పటినుంచి పార్టీ నేతలు, అధ్యక్షుడిని కలవడ ం మానేసినట్లు సమాచారం. ఈ వైఖరితో విసిగి వేసారిన సీనియర్లు, అసలు పార్టీ ఆఫీసుకే రావడం మానేశారు.
కాగా ఖమ్మం బహిరంగసభ విజయవంతం తర్వాత పార్టీ విస్తరించకపోగా, చితికిలపడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ స్థాయిలో ఏ జిల్లాలో కూడా బహిరంగసభలు నిర్వహించలేదని గుర్తు చేస్తున్నారు. పార్టీలోకి వచ్చేందుకు చాలామంది పాత నేతలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. వారిని తీసుకువచ్చే యంత్రాంగం నాయకత్వం వద్ద లేదంటున్నారు. కొత్తనేతలు రాకపోవడం, ఉన్న నేతలు వెళ్లిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీకి ఏకైక బలమైన ఖమ్మం జిల్లాలో టీడీపీ నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకువెళ్లేందుకు మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకవేళ వారంతా కాంగ్రెస్‌లో చేరితే, ఇక టీడీపీకి ఉన్న ఏకైక జిల్లా అయిన ఖమ్మంపై పూర్తిగా ఆశలు వదులుకోవలసిందే అని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ టీడీపీలో నెలకొన్న అనిశ్చితి, మౌనరాగంపై కొందరు సీనియర్లు పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మీరు జోక్యం చేసుకోకపోతే, తెలంగాణలో పార్టీయ మనుగడ కష్టమని బాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అధ్యక్షుడు కాసానిలో వేగం మందగించినందువల్ల, ఒక కమిటీని వేసి వారితో పార్టీ కార్యక్రమాలు నడిపించాలని సూచిస్తున్నారు. తెలంగాణలో పార్టీని విస్తరించే వ్యూహాలేమీ ఆయన దగ్గర లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పదవుల్లో ఉన్న సీనియర్లు.. పార్టీపై పెద్దగా దృష్టి సారించడం లేదని, చొరవ తీసుకుని అధ్యక్షుడికి చెప్పే చొరవ తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో స్టీరింగ్ కమిటీని నియమించి, వారి ద్వారా పార్టీని ముందుకు నడిపించాలన్నది సీనియర్ల వాదన.