Suryaa.co.in

Telangana

మంత్రి హరీష్ రావు కమ్యూనిస్టులను విమర్శించడం సిగ్గుచేటు

– సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి

సిద్దిపేటలో అంగన్వాడీల సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కమ్యూనిస్టులను నమ్మొద్దు, వారికి కార్యకర్తలే లేరని, అంగన్వాడీలను, ఆశాలను వారి ఉచ్చులో పడొద్దని అనడం మంత్రి హరీష్ రావు రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం.

కమ్యూనిస్టులు అవకాశవాదులే అయితే మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతు ఎందుకు తీసుకున్నారో ప్రజలకు జవాబు చెప్పాలని అన్నారు.హరీష్ రావు మాటలు చూస్తుంటే ఓడెక్కేదాకా ఓడ మల్లయ్య ఓడెక్కినాక బోడి మల్లయ్య అన్న సామెత లా ఉందన్నారు.

అంగన్వాడీలు, ఆశా వర్కర్లు స్కీం వర్కర్లు అందరికోసం టిఆర్ఎస్ ఏర్పడక ముందు నాటి నుండే సంఘాలు పెట్టి వాళ్ళ హక్కుల కోసం నికరంగా పోరాడుతుంది కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని, ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి కార్మికుల ఓట్లు వేసుకొని మోసం చేయడం అధికార పార్టీ నాయకులకు నైజంగా మారిందని అన్నారు.

ఎర్రజెండా అంటేనే కార్మిక వర్గమని కార్మిక వర్గ హక్కుల కోసం ఎంతకైనా పోరాడుతుందని ఇలాంటి మాటలతో కార్మిక వర్గ ఐక్యతను దెబ్బతీయలేరని అన్నారు.కమ్యూనిస్టుల పై అక్కసు వెళ్ళగక్కడం మానుకోవాలని అన్నారు.

దేశంలో రాష్ట్రంలో మతోన్మాద రాజకీయాలు చేస్తూ, అవినీతి, అక్రమాలు, అరాచకాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కలిసి పనిచేయాల్సినటువంటి తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు.

కమ్యూనిస్టుల చరిత్ర నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతుందని, ప్రజల కోసం ఎర్రజెండా నీడన ఎంతో మంది త్యాగాలు చేశారని ఆ త్యాగాల స్ఫూర్తితో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు.

LEAVE A RESPONSE