-ఉత్తరాంధ్రలో బాబుకు బ్రహ్మరథం… పవన్ సభలకు జగదాంబ, కొత్తూరు జంక్షన్లు బద్దలు
-రిషికొండపై నిర్మించింది టూరిజం రిసార్ట్ కాదు… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాస సముదాయం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు మా పార్టీ నేతల వద్ద సమాధానం లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. మద్యం అమ్మకాలలో ప్రభుత్వ పెద్దలు 30 వేల కోట్ల రూపాయలు అక్రమంగా అర్జిస్తున్నారన్న పవన్ కళ్యాణ్ ఆరోపణలకు, లేదు లేదు… మేము 20 వేల కోట్ల రూపాయలు మాత్రమే తింటున్నామంటారా?, లేకపోతే మేము ఒక్క రూపాయి కూడా అక్రమంగా తినడం లేదంటారా?? అని ఆయన ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా తినడం లేదంటే, నగదు లోనే మధ్యాన్ని ఎందుకు అమ్ముతున్నావు చిట్టి అంటూ ప్రశ్నించే పవన్ కళ్యాణ్, మార్కెట్లో లభించే బ్రాండ్లు మన ఊరిలో ఎందుకు దొరకడం లేదు పొట్టి అని నిలదీస్తారు. ఇలా చిట్టి, పొట్టి అనే మాటలతో ఆయన ప్రశ్నించే ప్రశ్నలకు మా పార్టీ, ప్రభుత్వ పెద్దల వద్ద సమాధానం లేదు. అందుకే ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అంటూ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ సభలకు ఏ రేంజ్ లో ప్రజాదరణ ఉన్నదో ఆయనకు సోషల్ మీడియా వేదికగా లభించిన వ్యూవర్ షిప్ ని పరిశీలిస్తే స్పష్టమవుతుంది. జనసేన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారాన్ని 42,000 మంది తిలకించగా, ఇతర చిన్న చిన్న చానల్స్ ద్వారా ఏడు, ఎనిమిది వేల మంది వీక్షించారు. నీలి చానల్స్ సహకరించకపోయినా, ఆయనకున్న ప్రజాధరణ ను సోషల్ మీడియా మాధ్యమం తేట తెల్లం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు, వ్యాపారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
రాష్ట్రంలో సారా వ్యాపారం ద్వారా 30 వేలకోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారన్నారు . పరిశోధించకుండా ఏదీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడరు. సారా వ్యాపారం ద్వారా సంపాదించేది 25 వేల కోట్ల రూపాయలేనని ఇప్పటివరకు నేను భావించాను. కానీ పవన్ కళ్యాణ్, 30 వేల కోట్ల రూపాయలను అంటున్నారంటే ఆయన వద్ద లెక్క ఉండే ఉంటుంది. అందుకే గతంలో నేను మాట్లాడిన మాటలను సరి చేసుకుంటూ, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.
పొద్దున్నే బటను నొక్కే కార్యక్రమం ద్వారా ప్రజల కు డబ్బులు ఇచ్చి, సాయంత్రానికి సారా ద్వారా లాగేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అక్షర సత్యం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కావలసిన వారికి కాంట్రాక్టు పనులను కట్ట బెడుతూ, రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులను పెట్టడానికి వస్తే వారిని 30 నుంచి 40 శాతం వాటా ఇవ్వమని ప్రభుత్వ పెద్దలు అడుగుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రభుత్వ పెద్దలు ఎవరినైతే వాటాలు అడిగారో వారే పవన్ కళ్యాణ్ కు చెప్పి ఉంటారు. అందుకే ఆయన అంత ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు అడుగుతున్న వాటాల గురించి చెబుతున్నారు.
దశాబ్దాలుగా రాష్ట్రంలో పరిశ్రమలను నిర్వహిస్తున్న వారు కూడా విస్తరణకు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం పరిశీలిస్తే, ప్రభుత్వ పెద్దలు ఎంతగా వారిని వేధించి ఉంటారో స్పష్టమవుతుందన్నారు. విశాఖపట్టాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత, దాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ ను ఇక్కడి ప్రజలు ఎందుకు ఆదరిస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా జగదాంబ జంక్షన్, కొత్తూరు జంక్షన్ బద్దలైంది. ప్రజలు ఎందుకు పవన్ కళ్యాణ్ ఆదరించారో గుడివాడ అమర్నాథ్ సమాధానం చెప్పాలి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలకు ప్రజల్ని బిర్యాని పొట్లాలు ఇచ్చి, క్వార్టర్ సీసాలు ఇచ్చి, బస్సులు ఏర్పాటు చేసి తరలించిన వారు సభ ప్రారంభం కాగానే పారిపోతున్నారు. కానీ ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సభలకు దమ్మిడి ఖర్చు చేయకపోయినా ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయి చేసిన ట్విట్ ను కూడా సాక్షి దినపత్రిక వక్రీకరించి వార్తా కథనాన్ని రాయడం సిగ్గుచేటు. తమ మధ్య వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ మానవతావాది, డబ్బులు లెక్క చేయని మనిషి అని పేర్కొంటూ, పదేపదే ఆయన పెళ్లిళ్ల ప్రస్తావన తమ ప్రసంగాలలో తీసుకురావడం సరికాదన్నారు. కానీ దానికి భిన్నంగా సాక్షి దినపత్రిక వార్త కథనాన్ని రాసిందంటూ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.
బాబు ప్రజా చైతన్య యాత్ర కోసం వేచి చూస్తున్న ప్రజలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాలోని కొత్తూరులో ముగిసింది. కొత్తూరులో నిర్వహించిన సభకు అశేష జనవాహిని హాజరయ్యారు. ఆ జనవాహిని పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రజా చైతన్య యాత్ర ఎప్పుడు చేపడుతారో నని ఎదురు చూస్తున్నట్లుగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. కొత్తూరు సభకు హాజరైన జనవాహిని ఉద్దేశిస్తూ , ఈ జన సందోహాన్ని చూస్తే ముఖ్యమంత్రికి గుండె ఆగిపోతుందేమోనని చంద్రబాబు అన్నారు. మా వాళ్లకు గుండె, శ్వాస రెండు ఇప్పటికే ఆగిపోయాయని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు.
మా వాళ్లు వేసిన హత్యాయత్నం పథకం నుంచి మీరు తప్పించుకోవడం వల్ల, మీపై హత్యా ప్రయత్నం, హత్య కు కుట్ర వంటి కేసు నమోదు చేశారన్నారు. ఉత్తరాంధ్రలోని తోటపల్లి , వంశధార రెండవ దశ ప్రాజెక్టు పనులు ఎంత తిరో గమన దిశలో ఉన్నాయో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు ఎంతో, ఈ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టిందేంటో గణాంకాలతో సహా ఆయన వెల్లడించారని రఘు రామకృష్ణంరాజు తెలిపారు. ఒక్క అవకాశం అని అడిగితే ఓటు వేసిన నాలాంటి వారికి చంద్రబాబు నాయుడు ప్రసంగాల ద్వారా కనువిప్పు కలిగింద న్నారు. ప్రజా చైతన్య యాత్ర ద్వారా సాగునీటి ప్రాజెక్టులపై ప్రజలకు చంద్రబాబు నాయుడు చక్కటి అవగాహన కల్పించారని పేర్కొన్నారు.
రిషికొండ సందర్శనకు పవన్ కళ్యాణ్ అనుమతించరు
రిషికొండ సందర్శనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించదని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. రిషి కొండపై నిర్మిస్తున్నది పర్యాటకశాఖ రిసార్ట్ కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాస సముదాయము. జగన్మోహన్ రెడ్డి తన భార్యతో నివసించేందుకు భారీ భవనాన్ని నిర్మించడంతోపాటు, అధికారులతో సమావేశం అయ్యేందుకు ప్రత్యేక సమావేశ మందిరాన్ని కూడా నిర్మించుకున్నారు. రిషికొండను పవన్ కళ్యాణ్ సందర్శిస్తే ఈ విషయం వెలుగులోకి వస్తుందని, అందుకే ఆయన్ని రిషికొండ సందర్శించేందుకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదన్నారు.
ముఖ్యమంత్రి ఒక ప్రాంతంలో నివసిస్తే దాన్ని రాజధాని అంటారనుకుంటే అది పిల్లవాడి చేష్టలే అవుతుంది. తనకు తాను పిల్లవాడుగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అలా భావిస్తున్నారనుకుంటే, ఆయన వందిమాగాదులు కూడా అలాగే ప్రచారం చేయడం సిగ్గుచేటు. మంత్రులు మా పార్టీ నాయకులు చేస్తున్న రాజధాని ప్రచారానికి భయపడే ఉత్తరాంధ్ర ప్రజలు ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పట్టారు. అమరావతి ఆర్ -5 జోన్ పై , ప్రధాన కేసుతో పాటే సుప్రీంకోర్టు వాదనలు వినాలి. ఇక రిషి కొండపై తీర్పు వెలువడితే , సుప్రీం కోర్టు లేదంటే హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ ను నేను దాఖలు చేస్తానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
ఎంపీ, ఎమ్మెల్యే కాకపోయినా అదే బెంచ్ పైకి బెయిల్ పిటిషన్ కేసా?
ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారించే బెంచ్ కు, ఎంపీ, ఎమ్మెల్యే కానీ వ్యక్తుల బెయిల్ పిటిషన్ కేసు విచారణకు రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా అభియోగాలను ఎదుర్కొంటూ జైల్లో ఉన్న వైయస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకరేమో ఒంట్లో బాగాలేదని, మరొకరేమో ఇంట్లో బాగాలేదని బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహా నిందితులని కాబోలు ఎంపీ, ఎమ్మెల్యే కేసులను విచారించే బెంచ్ పైకి పిటీషన్ వచ్చిందేమో నన్నారు. న్యాయమూర్తి మారినంత మాత్రాన న్యాయం మారదని అందరిలాగే నేను కూడా భావిస్తున్నాను.
ఎంపీ, ఎమ్మెల్యే కేసులను గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారించేది. తనపై దాఖలు చేసిన ఒక పిచ్చి కేసు కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారించగా, వైయస్ అవినాష్ రెడ్డి పై మోపబడిన హత్యా నేరం కేసు విచారణ మరొక బెంచ్ చేపట్టడం ఏమిటని గతంలో మనం మాట్లాడుకున్నామని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. క్రిమినల్ లా సవరణకు మూడు ముసాయిదా బిల్లులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
ఈ ముసాయిదా బిల్లులను స్టాండింగ్ కౌన్సిల్ కు పంపారు. శీతాకాల సమావేశంలో ఈ మూడు బిల్లులను ఉభయ సభలు ఆమోదించడం, చట్టంగా మారడం ఖాయం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నాపై నమోదు చేసిన 124 A రాజ ద్రోహం కేసుపై సభలో చర్చోప చర్చలు జరిపి సరైన చట్టం కాదని తేల్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాపై ఉద్దేశపూర్వకంగా రాజద్రోహం కేసు పెట్టి అప్పటి సి ఐ డి చీఫ్ సునీల్ కుమార్ తో నన్ను చిత్రహింసలు పెట్టించింది. ఆ , వీడియో చూసి జగన్మోహన్ రెడ్డి ఆనందించారు. ఇకపై అటువంటి కేసులు పెట్టకుండా ముసాయిదా బిల్లును స్టాండింగ్ కౌన్సిల్ కు పంపారు.
ఈ చట్టంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే పదవి విరమణ పొందిన ఎన్వి రమణ గతం లో స్టే విధించారు. కొత్తగా ఎవరిపై ఈ చట్టం కింద కేసు నమోదు చేయడానికి వీలు లేదు. రాజ ద్రోహం కేసు చట్టం నుంచి తొలగించడానికి మన రాష్ట్రానికి చెందిన కొందరు దరిద్రులు చేసిన పనులే కారణం. ఇటువంటి ముష్కరులు మళ్లీ తప్పు చేయకుండా ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు.
కస్టోడియల్ టార్చర్ అన్నది చేయకుండా, నిందితుల విచారణ ఇన్ కెమెరాలో చేయాలని ముసాయిదా బిల్లు రూపొందించారు. గతంలో నన్ను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారు. సీసీ కెమెరాలు ఉన్న వాటిని తొలగించి చిత్రహింసలు పెట్టారు. నన్ను కొట్టిన వాడికి కొట్టానని చెప్పే దమ్ము లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే కొట్టామని చెప్పాలి. ముఖ్యమంత్రి నన్ను కొట్టకపోయినా, కొడుతుంటే చూసి ఆనందించాడు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి ప్రవేశపెట్టిన మూడు ముసాయిదా బిల్లులు ప్రజాస్వామ్యాన్ని భక్షించే దుర్మార్గులకు చెంపపెట్టువంటివని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.