– మళ్లీ తెలంగాణ సీఎంగా కేసీఆర్ రావాల్సిందే
– ప్రజల కోసం మరోసారి పునరంకితమవుదాం
– ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ.. ఈ బిఆర్ఎస్ పార్టీ
– బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇతర ముఖ్య నేతలు
– తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కేటీఆర్ మరియు పార్టీ ముఖ్య నేతలు
హైదరాబాద్: దశాబ్దాలుగా దగాకు గురై, అన్యాయానికి గురై నెత్తురు మండే ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం త్యాగాల పునాదుల మీద, ఆనాడు తనకు అప్పుడు ఉన్న పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి అట్లాగే పార్టీలోని రాష్ట్ర బాధ్యతలకు అన్నిటికీ కూడా రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకు చరమగీతం పాడొచ్చు, శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరిసంపదలతో తులతూగిందో అట్లా మళ్ళీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో కెసిఆర్ ఆనాడు 25 వసంతాల కిందట పార్టీని ఏర్పాటు చేశారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చిన ఆశ్రమం జలదృశ్యంలో జెండా ఎత్తారు. ఈ 25 సంవత్సరాల్లో ఒక అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ. మొదటి 14 ఏళ్లు తన పోరాటంతో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి, తెలంగాణ జాతిని మొత్తంగా ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో సమీకరిస్తూ.. వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ.. అంబేద్కర్ చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగా అడుగడుగునా పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ, ఈ బిఆర్ఎస్ పార్టీ.
పదేళ్లపాటు ప్రజలు అధికారం ఇస్తే మరి ఒక బాధ్యతగా భావించి రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు బాధ్యతను ఇవ్వడాన్ని ఒక గౌరవంగా భావించి రాష్ట్రాన్ని అగ్రభాగాన పదేళ్ల తన పరిపాలనలో నిలబెట్టిన నాయకుడు, మహానాయకుడు కెసిఆర్ . గత రెండున్నర సంవత్సరాలుగా ఈ దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలోని కోట్లాదిమంది అనగారిన వర్గాల తరఫున, అణగారిన ప్రజల తరఫున ఇవాళ వారి గొంతుకై నిలుస్తున్నది బిఆర్ఎస్ పార్టీ.
ఆనాడు 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు అధికార పార్టీగా, గత రెండున్నరేళ్లు ప్రతిపక్ష పార్టీగా అన్ని పాత్రలు ప్రజలు ఇచ్చిన ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఇవాళ భారతదేశ చరిత్రలోనే అతి కొద్ది పార్టీలు 25 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్కపెట్టదగ్గ సంఖ్యలో ఉంటాయి. బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో మరోసారి ఈరోజు పునరంకితం అవుతున్నాం.
ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్లు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనవాడే ఉండాలని చెప్పినట్లు మళ్ళీ పునరంకితం అవుతాం. తెలంగాణను కాపాడడానికి తెలంగాణలోని ఈ అరాచక కాంగ్రెస్ బిజెపిల నుండి తెలంగాణను మళ్ళీ ఒకసారి పట్టాలెక్కించడానికి కెసిఆర్ నాయకత్వంలో అందరం సమిష్టిగా ఐక్యంగా పోరాటం చేస్తాం.
తప్పకుండా 2028వ సంవత్సరంలో తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ ని ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కూడా ఆయన సైనికులుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, తెలంగాణ బలంగా బలగంగా తెలంగాణ దళంగా కలిసికట్టుగా కదం తొక్కుతాం. తప్పకుండా తెలంగాణకు మళ్ళీ ఒకసారి పునరంకితం అవుతాం. 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ రోజున తప్పకుండా మాకు మరింత ఉత్సాహం, మరింత ఉత్తేజం ఇవ్వడానికి మా నాయకుడు కేసీఆర్ ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం అవుతున్నారు. వారి దిశానిర్దేశం కోసం తెలంగాణలోని లక్షలాదిమంది గులాబీ దండు ఎదురుచూస్తున్నారు.
నేను హృదయపూర్వకంగా 25 ఏళ్లుగా ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్న ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి అభిమానికి, ప్రతి కెసిఆర్ సోదరుడికి, సోదరికి, సోషల్ మీడియాలో కూడా మా తరఫున ఉధృతంగా పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్లకు, మాకు అండగా నిలబడ్డ జర్నలిస్టు మిత్రులకు, కవులు కళాకారులకు, ఉద్యమంలో మొదటి నుండి ఆయువుపట్టుగా నిలిచిన మా విద్యార్థి సోదరులకు, అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన ఉద్యోగులకి, అట్లాగే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిన మా న్యాయవాద మిత్రులకు ప్రతి వర్గానికి సబ్బండ వర్గాలకు సకల జనులకు శిరస్సు వంచి ఇవాళ తెలంగాణ సాధనకు తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి కెసిఆర్ గారితో నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వినమ్ర ధన్యవాదాలు ఈ సందర్భంగా మళ్ళీ పునరంకితం అవుతూ పునరుత్తేజంతో ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాను.