Suryaa.co.in

Features

నా దేశమే నా జెండా ..

ఎన్నో జాతులు మతాలు భాషల్ని వాయిద్యాలుగా చేసి
ప్రకృతి గర్వంగా ఎలుగెత్తి పాడే
గొప్ప సంగీతం నా దేశం

ఎన్ని ప్రయాణాలు ఎన్నెన్ని మలుపులు
నా దేశ చరిత్రలో
ఎన్నెన్ని పోరాటాలు నా దేశ ఖడ్గ విన్యాసంలో!
మరెన్ని పారవశ్య దృశ్యాలు నా దేశం కళ్లల్లో!
మట్టి పరిమళాన్ని మోస్తున్న నేల కదా నా దేశం

నా దేశపు జెండా ఆకుపచ్చ రంగులో
అడవుల మందహాసం కనిపిస్తుంది
పచ్చదనం పరవళ్లు తొక్కే
పాడిపంటల సోయగం నా దేశం
పల్లెసీమలు గర్వంగా ఎత్తిన కాగడా నా దేశం
త్యాగ మూర్తుల వీర గాధల పైరగాలి నా దేశం
ప్రజా కవుల స్ఫూర్తి గీతాలంబన నా దేశం
అడవి బిడ్డల పట్టు తేనెల తియ్యందనం
నా దేశం
ఎల్లలు హద్దులెరుగని కావ్య భావం నా దేశం
మనమంతా పచ్చని చిలుకలై విహరించే
పచ్చని చెట్టు నా దేశం
పట్టు పరికీణీల సాంస్కృతిక వైభోగం నా దేశం
శిల్ప కళా సారస్వత సంబరాలకు
నిలువెత్తు రూపం నా దేశం
ధాన్యరాసుల ఇలవేలుపు నా దేశం

**

నేను బట్టలును కట్టుకున్నట్లు
నా దేశం జెండాను చుట్టుకుంటుంది
ఎంత మంది త్యాగాల వల్ల
ఒక గుడ్డముక్క జెండా అవుతుంది
నా దేశపు జెండా అంటే
ఉరికంబం మీద భగత్ సింగ్
చిట్ట చివరి సందేశం
స్వతంత్ర పోరాటంలో
లాఠీ దెబ్బలు తిన్న ఉక్కుగుండె
స్వేచ్చ కోసం జాతి త్యాగ రుధిరాల
నెత్తుటి కేతనం

నా దేశపు జెండా
నా జాతి సామూహిక సంకల్పం
నా జెండాలో ప్రతి రంగు
నా దేశ దేహఛ్ఛాయలో భాగమే

నా దేశపు జెండాని మోసినప్పుడు
నేనో హిమాలయాన్నవుతాను..!!

వైష్ణవి శ్రీ

LEAVE A RESPONSE