Suryaa.co.in

National

టీ చేస్తుండగా పేలి 10 మంది మృతి

– రైల్లోకి అక్రమంగా సిలిండర్
– రూ. 10 లక్షల పరిహారం

మదురై: తమిళనాడు లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మదురై రైల్వే స్టేషన్ లో లో ఆగి ఉన్న రైలు బోగీ (ప్రైవేటు పార్టీ కోచ్) లో అగ్నిప్రమాదం సంభవించింది.శనివారం తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు.రైల్లోకి అక్రమంగా తీసుకొచ్చిన సిలిండర్ పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు.ఈ ప్రైవేటు పార్టీ కోచ్ ఆగస్టు 17న ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నవూ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

శుక్రవారం నాగర్ కోయిల్ జంక్షన్ వద్ద దీన్ని పునలూరు – మదురై ఎక్స్ ప్రెస్ రైలుకు అటాచ్ చేశారు. నిన్న రాత్రి మదురై రైల్వే స్టేషన్ వద్ద దీన్ని డిటాచ్ చేసి స్టాబ్లింగ్ లైన్ లో నిలిపి ఉంచారు.అయితే, ఈ ప్రైవేట్ పార్టీ కోచ్ లో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు రైల్లోకి రహస్యంగా గ్యాస్ సిలిండర్ ను తీసుకొచ్చారు. ఈ ప్రైవేటు పార్టీ కోచ్ ను ఐఆర్సీటీసీ పోర్టల్ నుంచి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు.

శనివారం తెల్లవారుజామున దానిపై టీ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు చేలరేగాయి. చూస్తుండగానే బోగీ అంతా వ్యాపించాయి.మంటలను గుర్తించిన కొంత మంది ప్రయాణికులు వెంటనే బోగీ నుంచి కిందకు దిగారు.సమాచారమందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు.ప్రమాద సమయంలో బోగీలో 65 మంది ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటన పై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

ఘటనపై రైల్వే శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.

LEAVE A RESPONSE