– ఎలాంటి ఆధారాలు లేకుండా ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ లతో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు
– చంద్రబాబు ని ఒక్క రోజైనా జైలులో పెట్టాలనే ఆత్రుత తప్ప కేసులో పసలేదు
– శాసనమండలి పక్షనేత యనమల రామకృష్ణుడు
చంద్రబాబును ఆర్థిక నేరస్థుడిగా చిత్రీకరించేందుకు వైసీపీ యత్నిస్తోంది. అసలు ఆర్థిక నేరస్థుడు ఎవరు? 16 నెలలు జైలులో ఉండి.. బినామీ ట్రాన్సాక్షన్స్ చేసుకుని లక్ష కోట్ల అవినీతికి జగన్ రెడ్డి పాల్పడ్డారు. మేం పెట్టిన అభియోగాల్లో జగన్ రెడ్డి రూ.43వేల కోట్ల అవినీతి చేశారని సీబీఐ తేల్చింది. ఇవన్నీ ఆర్థిక నేరాలే.
క్విడ్ ప్రో కో ద్వారా రాష్ట్ర సంపదను దోచేసిన వ్యక్తి ఆర్థిక నేరస్థుడా, లేక నిజాయతీగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తా? చంద్రబాబుపై ఎలాంటి మచ్చ లేదు. ఆర్థిక నేరస్థులు హత్య చేసిన వారికంటే ప్రమాదకరమని జగన్ రెడ్డి విషయంలో సుప్రీం వ్యాఖ్యానించింది. ఇలాంటి వారి కేసుల విషయం ఏడాదిలోనే తేల్చి శిక్షించాలని సుప్రీం చెప్పింది. ఇప్పుడు కేసులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో అర్థం కావడం లేదు. ఏ పదవి లేకుండానే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచేసిన జగన్ రెడ్డి జీవిత చరిత్ర అంతా అవినీతిమయమే.
ఆయన అఫిడవిట్ చూస్తేనే ఎంత ఆస్తి పెరిగిందో అర్థమవుతోంది. దీనిపై ఎందుకు సమాధానం చెప్పరు? జగన్ రెడ్డికి సంబంధించిన రూ.5వేల కోట్లను ఈడీ అటాచ్ చేసింది. ఇంత ఆస్తి ఎలా సంపాదించారో వైసీపీ నేతలు, సజ్జల చెప్పాలి. 2019లో జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.2.50 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఈ డబ్బు ఎక్కడుందో జగన్ రెడ్డి చెప్పాలి. ఆర్థిక నేరస్థుడు ఎవరో సీబీఐ, ఇతర విచారణ సంస్థలు చాలా స్పష్టంగా చెప్పాయి. దీనికి సజ్జల, వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి.
16 నెలలు జైలులో ఉండటంతో చంద్రబాబును కూడా ఒక్కరోజైనా జైలులో పెట్టాలనే ఆత్రుత తప్ప స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏవిధమైన పస లేదు. కేసు కావాలని ఫ్యాబ్రికేట్ చేశారు. సీఐడీ వాళ్లు ఇచ్చిన రిపోర్ట్ ఫ్యాబ్రికేటెడ్. సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ యాక్టివిటీకి, ప్రభుత్వ యాక్టివిటీకి సంబంధం లేదు. కార్పోరేషన్ కు ఏమైనా డబ్బు కావాలంటే ఇస్తుంది. యాక్టివిటీస్ ఉంటే కార్పోరేషన్ కి, సీమెన్స్ కు సంబంధం ఉంటుంది.
అంతే తప్ప చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కార్పోరేషన్ యాక్టివిటీస్ మొత్తం చంద్రబాబు చేయించారనే విధంగా రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఇది ఏవిధంగా లీగల్ గా సస్టైన్ కాదు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. మంచి ఉద్దేశంతో పెట్టారు. టెక్నాలజీ మారుతున్నప్పుడు స్కిల్స్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది.
గుజరాత్ ను ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. యువతకు ఉద్యోగాల కల్పన కోసమే స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుచేయడం జరిగింది. చంద్రబాబు దూరదృష్టితో చేశారు. దీనిపై అవినీతి మరక అంటగట్టడం దుర్మార్గం. జగన్ రెడ్డి చర్యల వల్ల యువత నష్టపోతారు. రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. ఇప్పటికే పరిశ్రమలు రావడం లేదు. రాష్ట్రాన్ని జగన్ రెడ్డి నాశనం చేస్తున్నారు. తప్పుడు సంకేతాల ద్వారా అంతా నాశనం చేస్తున్నారు. నిర్దోషిని పట్టుకుని దోషిగా చిత్రీకరిస్తున్నారు.
జగన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్లారు. ఈ రోజు తిరిగొస్తున్న ఆయనకు రిటర్న్ గిఫ్ట్ గా చంద్రబాబును అరెస్ట్ చేశారు తప్ప ఇందులో ఎలాంటి ఆధారాలు లేవు. చట్టాలను పాటించలేదు. చంద్రబాబు గారికి హాని జరిగితే జగన్ రెడ్డి బాధ్యత వహించాలి. 73 ఏళ్లు ఉన్న వ్యక్తి, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి. రాష్ట్రాభివృద్ధిని కోరే వ్యక్తి పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.
మూడు రాజధానులతోనే విధ్వంసం ప్రారంభమైంది. అహం ,కోరిక, పరిపాలన కాంక్షతో దుర్యోధనుడు నాశనం అయ్యాడు. ఇప్పుడు జగన్ రెడ్డి కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. రాజారెడ్డి బాటలోనే వెళ్తున్నారు. జగన్ రెడ్డి బినామీ ట్రాన్సాక్షన్స్ నా దగ్గర ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు బయటపెడతాం. హైదరాబాద్ లో వైఎస్ ఉండే ఇల్లు కూడా కబ్జాది కావడంతో రెగ్యులరైజేషన్ కు అడిగారు.
అలాంటి ఆర్థిక పరిస్థితులున్న జగన్ రెడ్డికి.. నేడు లక్షల కోట్లు, ప్యాలెస్ లు ఎలా వచ్చాయి. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. జగన్ రెడ్డి సీబీఐ కేసుల్లో రేపటి నుంచి విచారణ ప్రారంభం అవుతోంది. ట్రయల్స్ ప్రారంభం అయితే జగన్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయం. భవిష్యత్ లో డిస్ క్వాలిఫై అవుతారు. ఇంతటి దారుణమైన వ్యక్తిత్వం కలిగిన జగన్ రెడ్డి..
చంద్రబాబు గురించి మాట్లాడటం బాధాకరం. 12 సీబీఐ కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ రెడ్డి తరపున సజ్జల మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. టీడీపీ అధికారంలోకి వస్తే అందరి భరతం పడతాం. ప్రజాస్వామ్య రక్షణ జరగకపోతే రాష్ట్రానికి విముక్తి ఉండదని ప్రజలు గ్రహించాలి. అప్రజాస్వామికంగా పోలీసులు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర బంద్ ను విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయం.