Suryaa.co.in

Telangana

కుల వృత్తులు, వ్యవసాయాధారిత పేద కుటుంబాలకు మద్దతుగా చాకలి ఐలమ్మ పోరాటం

– బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్

ఆధిపత్య, పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా, కుల వృత్తులు, వ్యవసాయాధారిత పేద కుటుంబాలకు మద్దతుగా చాకలి ఐలమ్మ పోరాటం చేశారని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆమె పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ కె. లక్ష్మణ్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్ గారితో తదితర నాయకులు పాల్గొన్నారు. దేశంలోని కులవృత్తులను, చేతివృత్తులను బలోపేతం చేయటానికి, వెనుకబడిన వర్గాలకు ఆర్ధిక భరోసా కల్పించేలా పీఎం విశ్వకర్మ యోజనను తీసుకొచ్చారని లక్ష్మణ్ తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు ఆమె పోరాట పటిమను ఒక స్ఫూర్తిగా, ప్రేరణగా తీసుకోవాలి.కులవృత్తి మీద ఆధారపడి జీవించిన చాకలి ఐలమ్మ తెలంగాణలో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఆధిపత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటం చేశారు.

నిజాం తాబేదారుగా వ్యవహరించిన విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలు, అకృత్యాలు, దొరల పెత్తందారీతనంపై తిరగబడి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు.వరంగల్ జిల్లా పాలకుర్తి పరిసర ప్రాంతాల్లో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని చాటుతూ సమాజాన్ని సంఘటితం చేసి, మహోన్నత ఉద్యమానికి ఊపిరిపోశారు చాకలి ఐలమ్మ.

వ్యవసాయాన్ని నమ్ముకున్న పేద వర్గాలకు అండగా, కులవృత్తులవారికి మద్దతుగా నిలిచారు.దొడ్డి కొంరయ్య, కుమ్రం భీం, షోయబుల్లాఖాన్, చాకలి ఐలమ్మ వంటి ఎందరో యోధులు హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం ఉద్యమించారు.ఎందరో పోరాటయోధులతో త్యాగాలతో తెలంగాణకు విముక్తి లభించగా.. నేడు ఆ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి, ప్రపంచానికి చాటేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించింది.

దేశంలోని కులవృత్తులను, చేతివృత్తులను బలోపేతం చేయటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పీఎం విశ్వకర్మ యోజన లాంటి బృహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చారు.హస్తకళా నైపుణ్యాలు మరియు సాధనాలను ఉపయోగించి వారి సాంప్రదాయ నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణా కార్యక్రమాలు ఇస్తూ ఒక అమూల్యమైన అవకాశాన్నికల్పిస్తున్నారు.

వడ్రంగి, కమ్మరి, టైలర్లు, బుట్టలు అల్లేవారు, క్షురకులు, స్వర్ణకారులు, చెప్పులు కుట్టేవారు మరియు ఇతరుల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా పనిముట్లతో పాటు ఆర్థిక చేయూతనిస్తున్నారు.

చేతివృత్తుల కులాల సాధికారత కోసం రూ. 13,000 కోట్ల రూపాయలతో రుణాలు మంజూరు చేయడంతో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో దాదాపు 30 లక్షల కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం.. సంప్రదాయ కళాకారులు మరియు చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం చేస్తూ కుల వృత్తులను నమ్ముకున్న వారికి అండగా నిలుస్తోంది.

చాకలి ఐలమ్మ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని విశ్వకర్మ యోజన స్కీంలో వెనుకబడిన వర్గాలు, కులవృత్తుల వారందరూ విశ్వకర్మ యోజనలో భాగస్వామ్యమై నరేంద్ర మోదీ గారికి మద్దతుగా నిలవాలని కోరుతున్నాను.

ఓబీసీ మోర్చా, బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున బిజెపి శ్రేణులంతా ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేసేలా సామాజిక ఉద్యమం తీసుకురావాలి.చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే.రానున్న ఎన్నికల్లో బీసీలే ప్రధాన పాత్ర వహించాలి.

గత తొమ్మిదేళ్లలో బీసీలను ఆదుకునేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాలను ఆదరించి మద్దతుగా నిలవాలి.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను వంచించి దగా చేశాయి. బీసీలకు రాజకీయంగా ఇవ్వాల్సిన 33 శాతం వాటాకు కోతపెట్టి.. ఇప్పుడు ఓబీసీ ఎజెండా ఎత్తుకుని ఓబీసీ ఓట్ల కోసం ప్రాకులాడుతున్నారు.

రానున్న రోజుల్లో బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు చేసిన అన్యాయాన్ని ఎండగడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఫలాల గురించి ప్రజలకు వివరిస్తాం.రాజ్యాధికారంలో బీసీలకు తమవంతు వాటా దక్కిననాడే పరిపూర్ణ న్యాయం జరుగుతుంది.

LEAVE A RESPONSE