– పదేళ్ల నుంచి బెయిల్‌పై ఉన్న సీఎం అంటూ సీజేఐకి లేఖలు
– లక్షల సంఖ్యలో పోస్టుకార్డుల ఉద్యమం
– ఇప్పటికే బాబుకు బాసటగా లక్షల సంఖ్యలో తమ్ముళ్ల ఉత్తరాలు
– ‘జగన్ బెయిల్’ను జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్న వ్యూహం
– జగన్ కోర్టు హాజరుపై ఇదో ఒత్తి‘ఢీ’
– లేఖలో కోడికత్తి కేసు గైర్హాజరు ప్రస్తావన
– జగన్ బెయిల్‌పై జనంలో చర్చకు తెరలేపిన టీడీపీ
– జగన్‌పై లీగల్ డిబేట్ చేయడమే టీడీపీ లక్ష్యం
– బాబు అరెస్టు-ముందస్తు బెయిల్‌పై టీడీపీ ప్రతివ్యూహం
( మార్తి సుబ్రహ్మణ్యం)
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడును… గత 20 రోజుల నుంచి జైలులో ఉంచిన ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై, జాతీయ స్థాయిలో టీడీపీ ‘లీగల్ డిబేట్’కు తెరలేపనుంది. చంద్రబాబు వేసిన క్వాష్- ముందస్తు బెయిల్‌ను అడ్డుకుంటున్న జగన్ సర్కారును, దెబ్బకు దెబ్బతీసేందుకు బ్రహ్మాండమైన ఎత్తుగడకు తెరలేపింది. దానితో జగన్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సుప్రీంకోర్టు వేదిక కానుంది.
గత పదేళ్ల నుంచి బెయిల్‌పై ఉంటూ విచారణకు హాజరుకాని.. ఏపీ సీఎం-వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహారాన్ని, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు టీడీపీ, ఉత్తరాల ఉద్యమానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ‘ఐయామ్ విత్ యు బాబు’ పేరిట.. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు ఉత్తరాల ద్వారా నైతిక మద్దతు ఇస్తున్న టీడీపీ శ్రేణులు.. ఇక రూటు మార్చి, వాటిని రాజమండ్రికి కాకుండా, న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టుకు పంపేందుకు సిద్ధమవుతున్నారు.
పదేళ్ల నుంచి బెయిల్‌పై ఉంటూ, ఏ ఒక్క విచారణకూ హాజరుకాని వ్యక్తిగా.. దేశంలోనే రికార్డు సృష్టించారంటూ, ఇప్పటికే టీడీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. దేశంలో బెయిల్‌పై ఉన్న ఏ ఒక్క వ్యక్తీ కోర్టుకు హాజరుకాలేదని, ఆ ఘనత జగన్
ఒక్కడికే దక్కుతుందన్న విమర్శలకు పదునుపెడుతున్నారు. దీన్ని బట్టి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుస్తోందంటూ, జగన్‌పై ఆరోపణలు చేస్తున్న టీడీపీ.. ఇక ఆయన లక్ష్యంగా సుప్రీంకోర్టును వేదిక చేసుకుని, లేఖాస్త్రాలు సంధించనుంది.
అంటే పదేళ్ల నుంచి బెయిల్‌పై ఉన్న జగన్ కోర్టుకు హాజరుకాని అంశాన్ని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి, లేఖల ద్వారా తీసుకువెళ్లనున్నారన్న
మాట. సీబీఐ-ఈడీ కేసుల్లో అరెస్టయి 16 నెలలపాటు జగన్ జైల్లో ఉన్న విషయాన్ని, చీఫ్ జస్టిస్‌కు గుర్తు చేయనున్నారు. రెండు-మూడు సార్లు తప్ప, ఎప్పుడూ కోర్టు విచారణకు హాజరుకాలేదని సీజేఐకి సమాచార రూపంలో ఇవ్వనున్నారు.
దానితోపాటు ఎన్ఐఏ విచారిస్తున్న కోడికత్తి కేసు విచారణకూ, జగన్ హాజరుకావడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి, ఉత్తరాల ఉద్యమం ద్వారా తీసుకువెళ్లనున్నారు. కాబట్టి జగన్‌పై ఉన్న కేసులను త్వరగా విచారించాలని కోరుతూ, లక్షలసంఖ్యలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరిట, లేఖలు రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరిట రాసిన ఒక నమూనా లేఖ, ఇప్పుడు
సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. సుప్రీంకోర్టుకు టీడీపీ లేఖాస్త్రాల ప్రభావం, జగన్ కేసుల విచారణలపై ఎంతవరకూ ఉంటుందో చూడాలి.
దీనిద్వారా జగన్ బెయిల్ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేసి, దానిని చర్చనీయాంశం చేయాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వ అండతోనే జగన్ పదేళ్లు విచారణకు హాజరుకావడం లేదంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తరచూ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కీ సైతం బీజేపీ ఆదేశాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వ ఆదేశాలు లేకపోతే చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం లేదని అటు నారాయణ-రామకృష్ణ స్పష్టం చేశారు. వారి ఆరోపణలను బలపరుస్తూ.. చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప కూడా, కేంద్రం ఆదేశాలతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని అసలు రహస్యం బట్టబయలు చేశారు.
ఈ క్రమంలో బాబు కోర్టులో వేసిన క్వాష్-ముందస్తు బెయిల్‌కు మోకాలడ్డుతున్న జగన్‌ను, టిట్ ఫర్ టాట్లా.. సరైన సమయంలో ఇరుకునపెట్టాలని నిర్ణయించుకుంది. ఒకరకంగా ఇది జగన్‌కు, అసలుకే ఎసరు తీసుకువచ్చే వ్యూహమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బాబును జైల్లో పెట్టిన జగన్ బెయిల్‌ను, సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయించడమే అసలు లక్ష్యమని చెబుతున్నారు.