– టీడీపీ దారెటు?
– టీడీపీతో పొత్తుకు సీపీఐ సిద్ధం
– బీజేపీని వదిలేస్తే తామూ వస్తామన్న సీపీఎం
– బీజేపీ కుట్రతోనే బాబును అరెస్టు చేశారన్న కామ్రేడ్లు
– బీజేపీతో పొత్తుపై పెదవి విప్పని టీడీపీ
– అమిత్‌షాతో బాబు భేటీ తర్వాత మౌనం
– బీజేపీతో బలవంతపు పొత్తు కోసమే బాబు అరెస్టన్న చర్చ
– బీజేపీతో పొత్తు వద్దంటున్న టీడీపీ సీనియర్లు
– మైనారిటీలు దూరమవుతారన్న హెచ్చరికలు
– ఏపీ ప్రజలు మోదీపై కోపంగా ఉన్నారని విశ్లేషణ
– అమరావతి వివాదానికి బీజేపీ మౌనమే కారణమని వాదన
– జగన్‌ను ప్రోత్సహిస్తూనే పొత్తు ఏమిటన్న ప్రశ్న
– ఎన్నికల సమయంలో బీజేపీ అవసరాన్ని గుర్తు చేస్తున్న మరికొందరు సీనియర్లు
– ఈసీ, ఈడీ, ఐటీలు కేంద్రం గుప్పిట్లోనే ఉంటాయని వాదన
– గత ఎన్నికల ఫలితాల అనుభవాలు గుర్తుచేస్తున్న సీనియర్లు
– తప్పయినా పొత్తు తప్పదంటున్న విశ్లేషణ
– బీజేపీతో పొత్తుపై సీనియర్లలో కుదరని ఏకాభిప్రాయం
– బాబు నిర్ణయం ఎటువైపు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఇప్పుడు తొలిసారిగా కొత్త సమస్య ఎదుర్కొంటున్నారు. ఒకవైపు బీజేపీ, మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు టీడీపీతో పొత్తుకు సిద్ధపడటంతో, వారిద్దరిలో ఎవరివైపు మొగ్గు చూపాలో తెలియని సంకటంలో పడ్డారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత పొత్తు నిర్ణయం పెండింగ్‌లో ఉంచారు. ఈలోగా బాబు అరెస్టు కావడం.. అందుకు కేంద్రమే కారణమన్న భావన బలపడటం.. ఈలోగా వామపక్షాలు టీడీపీతో పొత్తుకు సిద్ధపడుతుండటం వంటి పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. దీనితో ఏ పార్టీతో పొత్తుకు వెళ్లాలన్న ప్రశ్న బాబు ముంగిట నిలిచింది.
వచ్చే ఎన్నికల్లో తాము టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకటించిన వెంటనే.. బీజేపీని వదిలిస్తే తాము కూడా,
టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని సీపీఎం వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. బీజేపీతో కలసి ఉండే పార్టీలకు దూరంగా ఉండే వామపక్షాలు.. హటాత్తుగా బీజేపీని ఇప్పటిదాకా ఏమాత్రం వ్యతిరేకించని టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని ప్రకటించడం, సహజంగానే చర్చనీయాంశంగా మారింది.
నిజానికి సీపీఐ ఇప్పటిదాకా ఏపీలో టీడీపీ అనుకూల విధానాన్నే కొనసాగిస్తోంది. అమరావతి, విశాఖ రైల్వేజోన్, విశాఖ స్టీల్‌ప్లాంట్‌తోపాటు.. జగన్ సర్కారు వ్యతిరేక విధానాలతో కలసి పోరాడుతోంది. కొన్ని అంశాల్లో మద్దతునిస్తోంది. కానీ సీపీఎం
మాత్రం టీడీపీకి దూరంగానే ఉంటోంది. ఆ పార్టీ అగ్రనేతలు సీఎం జగన్‌తో వ్యక్తిగత సంబంధాలు బాగానే కొనసాగిస్తున్నారు. వైసీపీలో నెంబర్‌టూగా ఉన్న ఒక ఎంపీకి, సీపీఎం అగ్రనేత సమీప బంధువన్న ప్రచారం జరుగుతోంది.
సీపీఎం నేత మధు అనారోగ్యంతో ఉన్నప్పుడు, సీఎం జగన్ ఆయనను పరామర్శించారు. ఇక సీపీఐకి చెందిన పత్రికకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వని ప్రభుత్వం, సీపీఎంకు చెందిన పత్రికకు మాత్రం బాగానే ఇస్తోంది. ఈ క్రమంలో రెండుపార్టీలూ, టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
అయితే టీడీపీ-బీజేపీ పొత్తుపై టీడీపీ నాయకత్వం, ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతోంది. అమిత్‌షాతో భేటీ తర్వాత చంద్రబాబు.. సీనియర్లు, మాజీ
మంత్రుల అభిప్రాయాలు సేకరించారు. అటు లోకేష్ వద్ద కూడా పలువురు సీనియర్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు. వారిలో మెజారిటీ నేతలు బీజేపీతో పొత్తు వ ద్దని, అదే జరిగితే మైనారిటీలు పార్టీకి దూరమవుతారని స్పష్టం చేశారు. రాయలసీమ నేతలైతే బీజేపీతో పొత్తు ఉంటే తాము పోటీ చేయలేమని, కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. ఏపీ ప్రజలు జగన్ కంటే మోదీపైనే ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారని వారు బాబుకు విశ్లేషించారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోగా.. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, విశాఖ రైల్వేజోన్ అంశాల్లో ఏపీకి మొండి చేయిచూపారన్న ఆగ్రహం ఉందని గుర్తు చేశారు. ప్రధానంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. ఆ ప్రభావం ఉన్న విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాల్లో టీడీపీ తీవ్రంగా నష్టపోతుందని విశ్లేషించారు. జగన్ అవినీతి-అక్రమాలకు కేంద్రంలోని బీజేపీ దన్నుగా ఉందన్న విషయం అందరికీ తెలిసిపోయిందని స్పష్టం చేశారు.
ఇసుక – లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు నాలుగున్నరేళ్లుగా ఆరోపిస్తున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్టింంచుకోని విషయాన్ని గుర్తు చేశారు.పదేళ్ల నుంచి బెయిల్‌పై ఉన్న జగన్.. ఒక్కసారి కూడా కోర్టు విచారణకు హాజరుకాలేదంటే, కేంద్ర మద్దతు ఏ స్థాయిలో ఉందో
ఊహించుకోవచ్చని పలువురు సీనియర్లు, బాబు వద్ద తమ వాదన వినిపించారు. కన్నా లక్ష్మీనారాయణను వైసీపీ కోరిక ప్రకారమే అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు.
పైగా మోదీ.. సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా ప్రోత్సహిస్తున్నారని, ప్రభుత్వానికి అప్పులిస్తూ ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. విశాఖలో జగన్ సర్కారు అవినీతిపై
విమర్శలు గుప్పించిన మోదీ.. కొద్దిరోజుల తర్వాతనే జగన్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారని బాబు వద్ద వ్యాఖ్యానించారు. ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండువేల కోట్లు కావాలంటేనే ఇవ్వలేదు. ఇప్పుడు వేలకోట్లు అప్పులిస్తున్నారంటే అర్ధం ఏమిట’ని పలువురు నేతలు, బాబు వద్ద వ్యాఖ్యానించారు.
ఒకవైపు వైసీపీ-మరో వైపు టీడీపీని కంట్రోల్ చేయాలన్నదే బీజేపీ అసలు లక్ష్యమైనందున, టీడీపీ ఆ పార్టీ ట్రాప్‌లో పడకూడదని స్పష్టం చేశారు. కాకపోతే.. ఎన్నికల తర్వాత బీజేపీకే మద్దతునిస్తామని, ఆ పార్టీ నాయకత్వానికి స్పష్టం చేస్తే సరిపోతుందన్న సలహా ఇచ్చారు. అసలు చంద్రబాబు అరెస్టుకు కేంద్రమే కారణమన్న భావన ప్రజల్లో బలంగా ఉంటే, మళ్లీ అదే పార్టీతో పొత్తు అనాలోచితమని పలువురు సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
పొత్తు పేరుతో ఎక్కువ సీట్లు తీసుకుని, పరోక్షంగా వైసీపీకి లాభం చేయడమే బీజేపీ పొత్తు లక్ష్యమని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నోటా కంటే తక్కువ ఓట్లున్న బీజేపీ, తమకు కీలక నియోజకవర్గాలు కావాలని పట్టుపడితే అప్పుడు పరిస్థితి ఏమిటి? వైసీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో, బీజేపీ పోటీ చేస్తామంటే నష్టం ఎవరికి? పోటీ చేసేందుకు గట్టిగా అరడజను మంది కూడా లేని బీజేపీ, డజనుకు పైగా సీట్లు అడిగితే అది వైసీపీకి లాభం కాదా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అయితే మరికొందరు సీనియర్లు మాత్రం.. నష్టమైనప్పటికీ, బీజేపీతో పొత్తు అనివార్యమని బాబు వద్ద స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం.. కేంద్రం చేతిలో ఉంటుందన్న విషయాన్ని విస్మరించకూడదని, కొందరు సీనియర్లు బాబుకు గుర్తు చేశారు. ఏపి నుంచి వెళ్లే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలన్నా… వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులను బదిలీ చేయాలన్నా.. కేంద్రంలో ఉన్న బీజేపీ సహకారం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఇక పార్టీకి వివిధ వర్గాలు, సంస్థలు విరాళాలు పంపించే క్రమంలో అవి ఆగిపోకూడదనుకుంటే, కేంద్రంలోని బీజేపీ సహకారం అనివార్యమంటున్నారు. గత ఎన్నికల ఫలితాల చేదు అనుభవాలను పరిశీలిస్తే, బీజేపీతో పొత్తు అనివార్యమని బాబు వద్ద స్పష్టం చేశారు. బీజేపీకి రాష్ట్రంలో ఏమాత్రం బలం లేకపోయినప్పటికీ, పార్టీ అధికారంలోకి రావాలంటే బీజేపీతో పొత్తు అనివార్యమేనని విశ్లేషించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు తీసుకునే నిర్ణయంపై, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గత నాలుగున్నరేళ్లలో మోదీ సర్కారు.. ఎన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, టీడీపీ వాటిని ఖండించలేదు. పైగా పార్లమెంటులో వైసీపీకి పోటీగా కేంద్రబిల్లులను ఆమోదించింది. గత కొంతకాలం క్రితం వరకూ.. బీజేపీ అసలు తనను పట్టించుకోకపోయినా, ఆ పార్టీ స్నేహం కోసం వెంపర్లాడింది.
తాజాగా చంద్రబాబు అరెస్టుకు బీజేపీనే కారణమని, స్వయంగా వైసీపీ ఎంపీనే స్పష్టం చేసిన తర్వాత కూడా.. ఇంకా బీజేపీని పట్టుకుని వేళ్లాడటం తెలివైన పని కాదన్నది, మెజారిటీ తమ్ముళ్ల వాదన. దీనిపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
పైగా టీడీపీని బలవంతంగా దారిలోకి తీసుకువచ్చేందుకే బీజేపీ నాయకత్వం, జగన్ ద్వారా బాబును అరెస్టు చేసిందన్న ప్రచారాన్ని బాబు ఏవిధంగా చూస్తారన్నది మరో ప్రశ్న. ‘‘ఎలాగూ జైలుకు పంపించినందున, ఇక అంతకుమించి ఇంకేం చేస్తారన్న’’ వ్యాఖ్యలు, ‘మన దగ్గర తప్పులు లేనప్పుడు బీజేపీకి భయపడటం ఎందుకు? అన్న ప్రశ్నలు, పార్టీ వర్గాల్లో పై నుంచి కిందివరకూ ఒకేలా వినిపిస్తుండటమే విశేషం.