-జగనన్న సురక్ష పథకం ప్రచారార్భాటమే
– తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి
నాలుగేళ్ల పాలనలో వైద్య రంగాన్ని భ్రష్టుపట్టించిన జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష పథకం పేరుతో ప్రచారార్భాటం చేయడం సిగ్గుచేటు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వరం బిళ్లలకు దిక్కులేదుకానీ ముఖ్యమంత్రి ప్రజలందరికీ ఆరోగ్య సురక్ష కల్పిస్తాడా?
జ్వరాలు, డెంగ్యూ, మలేరియాతో ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోకుండా కక్షలు, కార్పణ్యాలతో ప్రత్యర్థులను అన్యాయంగా జైలు పాల్జేస్తున్న జగన్ రెడ్డి ఇంటింటికీ డాక్టర్ ను పంపి ఆరోగ్య భాగ్యం కల్పిస్తాననడం మోసం కాక మరేమిటి? నాడు నేడు కింద ఆరోగ్య విప్లవం తీసుకొస్తానని నాలుగేళ్లుగా పాడిన పాటే పాడుతున్న ముఖ్యమంత్రి ఆచరణలో చేసిందేముంది?
నానాటికీ రాష్ట్రంలో వైద్య సేవలు దిగజారిపోతున్నాయి. పేదలకు వైద్యం భారమైపోతోంది. రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎక్కడా అమలు కావడంలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవు. ప్రాథమిక , సామాజిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పనిచేయక గ్రామీణులకు కనీస వైద్యం అందడంలేదు.
అంబులెన్స్ ల అధ్వాన నిర్వహణలతో పేదలు బలైపోతున్నాయి. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ రెడ్డి రోజుకో డ్రామాలాడుతున్నాడు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో కొన్నాళ్లు హడావుడి చేశారు. ఇప్పుడేమో జగనన్న సురక్ష అంటున్నారు. ఏం చేశారని ప్రజల వద్దకు వెళ్తారు జగన్ రెడ్డీ? అవినీతితో కుళ్లిపోయి, రాజకీయ కక్షతో రగిలిపోతున్న ముఖ్యమంత్రి , వైసీపీ నేతలకే జగనన్న సురక్ష పథకం చాలా అవసరం. ఈ పథకం కింద వారికే ముందుగా వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేయాలి.