– ఆర్టీసీ కార్మికుల న్యాయపోరాటానికి బిజెపి సంపూర్ణ మద్దతు
– కాంగ్రెస్ సర్కార్ అహంకారం నశించాలి
– అధికారం కోసం హామీలు.. గద్దెనెక్కాక మోసాలా?
– ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం వద్దు
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఎన్నికల మేనిఫెస్టోలో ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం’ అని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారం లోకి వచ్చాక ఆ మాటలు ఎందుకు మర్చిపోయారు?
మొన్నటి దాకా గుర్తింపు సంఘాల ఎన్నికల గురించి ఊసే లేదు. ఇవాళ సమ్మె చేస్తామంటే.. చర్చల పేరుతో పిలిచి మళ్ళీ నాలుగు వారాల గడువు కావాలని అడగడం ఎంతవరకు ధర్మం? ఇది కాలయాపన చేయడం కాదా? మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సమస్యను పరిష్కరించాల్సింది పోయి, సమ్మె పరిష్కారం కాదని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది.
అహంకారంతో మాట్లాడటం మానేసి, కార్మికుల కష్టాలు, సమస్యలు విని పరిష్కరించండి. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికే కమిటీల ఎత్తుగడలు వేస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కంటే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికే రేవంత్ ప్రభుత్వం ఎక్కువ ఆసక్తి చూపుతోంది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అలాగే ట్రేడ్ యూనియన్లపై పెట్టిన ఆంక్షలను తొలగించి వెంటనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు చేస్తున్న డిమాండ్లలో తప్పేముంది?
ఉచిత బస్సు పథకానికి సంబంధించి వందల కోట్ల బకాయిలను విడుదల చేయకుండా సంస్థను దివాలా తీయించే కుట్ర సర్కార్ చేస్తోంది. అద్దె బస్సుల డ్రైవర్లను, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పట్టించుకోకపోవడం అన్యాయం. ఆర్టీసీని కాపాడుకోవాలన్న కార్మికుల ఆవేదనను బిజెపి గౌరవిస్తోంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తులు చేయడం కాదు, చేతల్లో పరిష్కారం చూపాలి. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో సామాన్యులు, ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో జనం దిక్కుతోచని స్థితిలో ఉంటే.. అటు ప్రైవేటు వాహనాలు, ఆటోలు చార్జీల మోత మోగిస్తున్నాయి.
కరీంనగర్లో జరిగిన బస్సు ప్రమాదం వంటి ఘటనలు మనసును కలిచివేస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రజల ప్రాణాలతో, ప్రయాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మొండివైఖరి వీడాలి. కమిటీల పేరుతో కాలయాపన ఆపి, తక్షణమే ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి, 32 డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ఉచిత బస్సు పథకం కింద నెలకు రూ.400 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి.
సంస్థ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థకు అప్పగించాలి. లేనిపక్షంలో, కార్మికులతో కలిసి బిజెపి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తుంది. కార్మికులను భయపెట్టాలని చూస్తే ఊరుకోం. ఆర్టీసీని కాపాడే వరకు, కార్మికులకు న్యాయం జరిగే వరకు బిజెపి అండగా నిలుస్తూ పోరాడుతుంది.