Suryaa.co.in

Telangana

మోదీ సభతో బీఆర్‌ఎస్‌లో వణుకు

– బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్

ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు ప్రజాగర్జన సభ దిగ్విజయం కావడంతో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వణికిపోతున్నారని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. రూ. 13,500 కోట్లతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తే బీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా నష్టపోతామనే దురుద్దేశంతో జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు.

తమది కుటుంబ పార్టీయేనని చెప్పుకుంటున్న కేటీఆర్.. తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్రంలోని నిరుద్యోగులు, పేద ప్రజలు, మహిళలు తమ కుటుంబ సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు , రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ , తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కె.లక్ష్మణ్ ఏమన్నారంటే.. పాలమూరు ప్రజాగర్జన సభకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్దఎత్తున తరలివచ్చి దిగ్విజయం చేశారు. ప్రపంచం జీ 20 సమావేశాలు, చంద్రయాన్-3 విజయం, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలిపేలా మహిళలు, యువకులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు.

నరేంద్ర మోదీ సభ విజయవంతం కావడంతో కేటీఆర్ మొదలు హరీశ్ రావు, కవిత వరకు… కల్వకుంట్ల కుటుంబం మొత్తం బిత్తరపోతున్నారు.తమ కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వణికిపోతున్నారు. ప్రధానిపై కనీసం గౌరవం లేకుండా సోయితప్పి మతిభ్రమించినట్లు కేటీఆర్ ప్రేలాపనలు చేస్తున్నడు.

కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిలో కూరుకుపోయి తెలంగాణ సంపదను దోచుకుంటూ, నియంతృత్వ పోకడతో ప్రజలను పీడిస్తూ ప్రజాస్వామిక హక్కులు పూర్తిగా కాలరాస్తున్నరు.కల్వకుంట్ల కుటుంబం పాలనను అంతమొందించాలని పిలుపునిస్తే.. నిస్సిగ్గుగా బరాబర్ తమది కుటుంబ పార్టీయేనంటూ జబ్బలు చరుస్తున్నారు.

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దగా చేసిన్రు. మరి దళితులు మీ కుటుంబ సభ్యులు కాదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కాకుండా… సామాన్యులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యక్తులెవ్వరు ఎందుకు లేరు? కేసీఆర్ ఫ్యామిలీ సభ్యుల్లో ఐదుగురు కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్నరు. మరి తెలంగాణ ఉద్యమకారులకు చోలేది? వాళ్లు మీ కుటుంబ సభ్యులు కాదా?

కొలువుల కోసం కొట్లాడిన యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆరుగాలం కష్టించే రైతులు కనీస మద్దతు ధర అడిగితే బేడీలు వేసి అవమానించారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్.. పోడు భూములకు పట్టాలిస్తనన్నడు. బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తానని విస్మరించారు. అటవీ అధికారులతో అటవీ బిడ్డలపై కేసులు పెట్టి జైలుకు పంపారు.విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే న్యాయం చేద్దామనే ఆలోచన చేయట్లేదు.

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డునపడ్డారు. మరి నిరుద్యోగ యువత మీ కుటుంబ సభ్యులు కాదా?తమ అసమర్థత, వైఫల్యాలు, అక్రమాలతో నిరుద్యోగులకు అన్యాయం చేసిన టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యులపై కనీసం చర్యలు తీసుకోదు.తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని రూ. 6 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్లకు ఆదాయాన్ని పెంచుకున్నరు.

ఒక చేత్తో పెన్షన్లు ఇస్తూ.. మరో చేత్తో పదివేల రూపాయలు పేదల నుంచి లాక్కుంటున్నారు. దళిత బంధు, గిరిజన బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, గృహలక్ష్మీ పథకాలను పూర్తిగా విస్మరించి.. కమీషన్లు, మామూళ్లకు అలవాటుపడ్డరు. మీ తప్పులను నిలదీస్తే ఎందుకంత అక్కసు?

తెలంగాణకు వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని వస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హాజరుకావడం లేదు. కేసీఆర్ తీరును చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.నరేంద్ర మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో రూ. 9 లక్షల కోట్లతో తెలంగాణలో అభివృద్ధి పనులు చేపట్టింది.నిన్న రూ. 13,500 కోట్లతో ప్రధాని మోదీ గారు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

పసుపు రైతుల పంటలకు విలువ చేకూర్చేలా, నూతన వంగడాలు ప్రవేశపెట్టేలా, మార్కెటింగ్ సదుపాయం కల్పించే విధంగా పసుపు బోర్డు ప్రకటిస్తే.. బీఆర్ఎస్ నాయకులు జీర్ణించులేకపోతున్నారు.రైతులు బాగుపడుతే.. రాజకీయంగా నష్టపోతామనే ఓర్వలేని మనస్తత్వంతో, దుర్భుద్ధితో బీఆర్ఎస్ నాయకులు కూనిరాగం తీస్తున్నరు.ఆసియా ఖండంలో అత్యంత భక్తితో కొలిచే సమ్మక్క-సారక్క పేరుతో ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్శిటీని ప్రకటిస్తే బీఆర్ఎస్ నాయకులు ఈర్శ్వ పడుతున్నారు.

9 ఏళ్లుగా ట్రైబల్ యూనివర్శిటీకి భూమి కేటాయించలేదు. కేంద్రం ట్రైబల్ యూనివర్శిటీని ప్రకటిస్తే ఓర్వలేకపోతున్నారు. ప్రధాని మోదీ గారి పాలమూరు ప్రజా గర్జన సభతో కేసీఆర్ పీఠం కదిలిపోతోంది. బీఆర్ఎస్ పునాదులు కదిలిపోతున్నాయి. పాలమూరు ప్రజా గర్జన ట్రైలర్ మాత్రమే. మున్ముందు సినిమా చూపిస్తాం. రాబోయే రోజులు బీఆర్ఎస్ ఖేల్ ఖతమవుతది.

కుటుంబ, అవినీతి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్.. మజ్లిస్ మేలు చేకూర్చేందుకే పనిచేస్తున్నాయి.బూటకపు మాటలతో ప్రజలను మభ్యపెట్టే రానున్న రోజుల్లో కల్వకుంట్ల ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయం.

బైబై కచరా బాబాయ్… బైబై కేసీఆర్ బాబాయ్..
మోదీ కే సాత్ అచ్చే దిన్.. కేసీఆర్ కే సాత్ ఖచ్చే దిన్
నమో బిజెపి.. నమ్మకు బీఆర్ఎస్ ను..
గడీల పాలనకు చరమగీతం.. బిజెపి కి ఓటేస్తే అభివృద్ధి సాధ్యం.

రాబోయే రోజుల్లో తెలంగాణలో విస్తృతంగా పర్యటించి, రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. మహాత్మాగాంధీ గారి, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం. అక్టోబరు 3న జరగనున్న ఇందూరు జన గర్జన సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE