డి హైడ్రేషన్ తో బాధపడుతున్న చంద్రబాబునాయుడిని తక్షణమే రాజమండ్రిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలి
చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రాన్ని కుదిపేసే సమస్య అవుతుంది… శాంతి భద్రతలకు కూడా విఘాతం ఏర్పడే ప్రమాదం
గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి… చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ కు నేను కూడా లేఖ రాస్తాను
కోడి కత్తి కేసులో బాధితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కి తానె క్కడ నిందితుడినవుతానోననే భయం పట్టుకుంది
ఋషికొండపై భవనాలను మూడు నెలల తర్వాత మానసిక చికిత్సాలయంగా మారుస్తాం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
తెదేపా అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఇబ్బందులకు గురి చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. చంద్రబాబు నాయుడు జైలులో తీవ్ర డి హైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారని, ఆయన్ని తక్షణమే మెరుగైన చికిత్స కోసం రాజమండ్రిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు కోరారు.
చంద్రబాబు నాయుడు డిహైడ్రేషన్ తో బాధపడుతున్నట్టుగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా ధ్రువీకరించారు . డి హైడ్రేషన్ వల్ల సాధారణ వ్యక్తులకే చర్మ సమస్యలు తలెత్తి అవకాశం ఉండగా, చర్మ సమస్యలతో ఇబ్బంది పడే వారు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్ వల్ల చర్మ సమస్యలు తీవ్ర జటిలమై ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న వైయస్ భాస్కర్ రెడ్డి జైలులో ఉంటూ రెండు కేజీల బరువు పెరిగినప్పటికీ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. జైలులో 32 రోజుల వ్యవధిలోనే ఐదు కేజీల బరువు తగ్గిన చంద్రబాబు నాయుడు కి మాత్రం బెయిల్ మంజూరు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.
32 రోజుల వ్యవధిలో ఐదు కేజీల బరువు తగ్గడం సాధారణ విషయమేమీ కాదని, ఇంత వేగంగా బరువు తగ్గడం అనేది కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు అసాధారణంగా బరువు తగ్గిపోవడాన్ని జైలు అధికారులు బయటకు పొక్కనివ్వడం లేదు. జైల్లో వాటర్ ట్యాంక్ అనేది శుభ్రం చేయరు. అదే అపరిశుభ్రమైన నీరును అందిస్తూ, దోమలతో నిండిన జైలులో… దోమ తెర ఇచ్చామని కుంటి సాకులు చెబుతున్నారు. అక్టోబర్ మాసం అయినప్పటికీ రాజమండ్రిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో పాటు , వాతావరణం లో వ్యూమినిటీ తగ్గడం వల్ల తీవ్ర ఉక్కపోత ఉంటోంది.
చంద్రబాబు నాయుడుకు పెద్ద బ్లాక్ ఇచ్చామని చెబుతున్న జైలు అధికారులు ఏసి సౌకర్యాన్ని కల్పిస్తే వారి సొమ్మేమి పోయింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. తక్షణమే రాజమండ్రిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలి. మాజీ ఎంపీ సబ్బం హరి మృతి పై విశాఖ వాసులకు ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. కరోనాను అధికమించి ఆయన బ్రతుకుతాడని భావించిన తరుణంలో తుది శ్వాస వదిలారు.
చంద్రబాబు నాయుడుకు ఇంజక్షన్లు ఇస్తే ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా వ్యవహరించడం ఈ పాలకులకు మంచిది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనుమానిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ఏదైనాప్రమాదం జరిగితే, అది మా పార్టీ మీదకే వస్తుంది. చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి కాదు… అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. జైల్లో ఉంటూ బరువు పెరిగిన వెంకట్ రెడ్డి మనువడైన భాస్కర్ రెడ్డి కి ఒక న్యాయం… చంద్రబాబు నాయుడుకు అన్యాయం సమంజసం కాదు.
వెంకట్ రెడ్డి మొదటి భార్య మనవడి పై, రెండవ భార్య ముని మనవడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి దృష్టిలో ప్రజలంతా సమానమే. తక్షణమే నారా భువనేశ్వరి, నారా లోకేష్ లు కోరుకుంటున్నట్లుగా, పార్టీలకతీతంగా నాయకులు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లుగా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిని నివేదించేందుకు తెదేపా నేత బుద్ధా వెంకన్న ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రాన్ని కుదిపేసే సమస్య అవుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యే ప్రమాదం ఉంది. వెంటనే రాష్ట్ర గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. రాతి బొమ్మలాంటి నిర్ధాయుడైన జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నాన్ని విరమించుకొని బుద్ధ వెంకన్న, తక్షణమే గవర్నర్ కలిసి చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలను వివరించాలి.
ఆరోగ్య సమస్యలు తెలిసిన వ్యక్తిగా గవర్నర్ స్పందించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలపై నేను కూడా గవర్నర్ కు లేఖ రాస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ సమస్య చేయి దాటకముందే, గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
కుచ్చుకోని కోడి కత్తి కేసులో లోతైన దర్యాప్తుకు హైకోర్టును ఆశ్రయించిన జగన్మోహన్ రెడ్డి
కోడి కత్తి కేసులో విచారణ జరిపిన ఎన్ఐఏ, ఇందులో కుట్రకోణం లేదని తేల్చి చెప్పింది. చేయని నేరానికి కోడి కత్తి శ్రీను నాలుగున్నర ఏళ్లుగా జైలులో మగ్గిపోతున్నారు. హత్యయత్నం నేరం కింద శిక్ష వేసిన, ఆ శిక్ష కూడా ఈపాటికి పూర్తయి ఉండేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఒక కేసులో ఇంతటి దారుణం భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు చోటు చేసుకోలేదు. ముఖ్యమంత్రిని సాక్షిగా కోర్టుకు పిలిస్తే, ప్రజాసేవలో బిజీగా ఉన్నానని చెప్పి రాననడం బాధ్యతారాహిత్యామే.
కోడి కత్తి కేసులో శ్రీనుకు బెయిల్ లభించకపోగా, హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న అనంతబాబు, వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డిలకు మాత్రం బెయిల్ లభించింది. స్వేచ్ఛగా వారు బయట తిరుగుతున్నారు. కోడి కత్తి కేసును రాబోయే ఎన్నికల వరకు వాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. కోడి కత్తితో తనని హత్య చేయాలని చూశారని ప్రజలకు మళ్ళీ చెప్పి సానుభూతి పొందాలని భావిస్తున్నారు. ఇదంతా ఉత్తుత్తిదేనని, మా పార్టీ నాయకులు ఆడిన డ్రామా అని ప్రజలకు తెలిస్తే, పునాదులు కదిలిపోతాయని భయపడుతున్నారు. అందుకే ఈ కేసులో లోతైన విచారణ జరపాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
జగన్మోహన్ రెడ్డి పిటిషన్ కు రిజిస్ట్రీ తామేదో కఠినంగా ఉన్నామని భావన కల్పించేందుకు నెంబర్ ఇవ్వలేదు. హైకోర్టు న్యాయమూర్తి జోక్యంతో ఈనెల 17వ తేదీన ఈ కేసు వినడానికి అంగీకరించారు. ఇన్వెస్టిగేషన్లో లోతైన ఇన్వెస్టిగేషన్ అంటూ ఏమీ ఉండదు. ఈ కేసులో బాధితుడి వేషంలో న్యాయం అడుగుతున్న వ్యక్తికి తానే నిందితుడవుతాననే భయం పట్టుకుంది. ఈ కేసులో బాధితుడు హోదానే ఆయన కోరుకుంటున్నారు. నిందితుడని అనిపించుకోవాలనుకోవడం లేదు. బాధితుడైన, నిందితుడు ఇప్పుడు న్యాయస్థానాన్ని ఒక కోరిక కోరారు.
నాకున్న న్యాయ పరిజ్ఞానం మేరకు… విచారణ లోతుగా చేయలేదని, కోడి కత్తి గీసుకున్నట్లుగానే లైట్ గా చేశారని ఏ న్యాయస్థానము పేర్కొనదు. కోడి కత్తి బాగా గుచ్చుకుందని చెప్పిన వైద్యులకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవులు కట్టబెట్టారు. ఎన్ ఐ ఏ లోతుగా విచారణ చేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల తరఫున ఈ కేసులో ఇంప్లిడ్ అయి, విచారణ బాధ్యతలను సిఐడి అధికారి రఘు రామి రెడ్డికి అప్పగిస్తే ఆయన లోతుగా విచారిస్తారేమోనని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. అందరిపై పోలీసుల ద్వారా కేసులు పెట్టి ఆనందించే జగన్మోహన్ రెడ్డి, కోడి కత్తి కేసులో శ్రీను పై కేసు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.
అంగళ్లు కేసులో చంద్రబాబు నాయుడికి ముందస్తు బెయిల్
అంగళ్లు కేసులో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. కక్షతో నిండిన జగన్మోహన్ రెడ్డికి ఇది ఇష్టం ఉండదు కాబట్టి, చంద్రబాబు నాయుడుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించినట్లుగానే భావించవచ్చు. ఫైబర్ గ్రిడ్ కేసులో చాలా వివరాలు ఉన్నాయని సిఐడి అధికారులు పేర్కొంటే న్యాయమూర్తి ముందస్తు బెయిల్ తిరస్కరించారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఐటెం నెంబర్ 67 కింద వస్తే… స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుతో కలిసి వింటామని ధర్మాసనం వెల్లడించింది. ఈ రెండు కేసులు కలిసి వినడం మంచిదేనని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తీర్పు ఈరోజే వెలువడే అవకాశం ఉంది. రిమాండ్ రిపోర్టుపై చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తీర్పు సోమవారం నాడు వెలువడే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
ఋషికొండపై 33 ఏళ్ల పాటు మకాం వేసేలా జగన్ ప్లాన్
రుషికొండకు గుండు కొట్టి 430 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్యాలెస్ లో 33 ఏళ్లపాటు మకాం వేసేందుకు జగన్మోహన్ రెడ్డి సరి కొత్త ప్రణాళిక రచించారని ప్రముఖ దినపత్రిక వార్తా కథనాన్ని ప్రచురించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అయితే ఇదే విషయాన్ని తాను గత ఐదు, ఆరు నెలల క్రితమే రచ్చబండ కార్యక్రమంలో పేర్కొనడం జరిగిందన్నారు. టూరిజం పేరిట నిర్మిస్తున్న ఈ భవనాలను తన బినామీ ప్రైవేట్ సంస్థకు 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. రేపు ఎన్నికల్లో ఓడిపోయిన ఇబ్బంది లేకుండా ఉండడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు.
లీజు ఒప్పందానికి అంగీకరించిన అధికారులను, లీజు తీసుకున్న వారిని ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదు. వారిని కచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే జైలులో వేయిస్తాం. అటువంటి పిచ్చి పిచ్చి వేషాలను అధికారులు వేయవద్దని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. ఋషికొండపై నిర్మించిన భవనాలలో జగన్మోహన్ రెడ్డి మూడు నెలల పాటు కాపురం చేస్తే , చేసుకోనివ్వండి…ఆ తరువాత ఆ భవన సముదాయాన్ని మానసిక చికిత్సాలయంగా మారుస్తామని చెప్పారు.
ఋషికొండపై జరిగిన ప్రకృతి విధ్వంసాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తే కోర్టు తీర్పు వెల్లడించకుండా రిజర్వులో పెట్టడం వల్ల, ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోవాల్సిన పరిస్థితి నెలకొందని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
పరిటాల రవీంద్ర హత్య కేసు నిందితులను జైలులో జగన్మోహన్ రెడ్డి చంపించారని ఊరంతా అనుకుంటున్నారు
పరిటాల రవీంద్ర హత్య కేసు నిందితులను జైలులో చంపించింది జగన్మోహన్ రెడ్డేనని ఊరంతా అనుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . పరిటాల రవీంద్ర హత్య కేసులో నిందితుడైన మొద్దు శ్రీనును ఓం ప్రకాష్ చేత హత్య చేయించారని, ఆ తర్వాత ఓం ప్రకాష్ ను చంపించారని… దాల్మియా సిమెంట్ లో లెక్కలు తేల్చాలని లేఖలు రాసిన వ్యక్తిని మీ అజ్ఞాత ప్రేమికుడు ఎవరో చంపారని… ఇది మన ట్రాక్ రికార్డు అంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. జైలులో ప్రాణభయం ఉందా?… నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉందా అంటూ నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పై ఆయన నిప్పులు చెరిగారు.
ఆ కేసును రీ ఓపెన్ చేద్దాం అంటే చేద్దాం అంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంట్లో నుంచి క్యారేజ్ వస్తే… భోజనంలో తేడా వల్లే అనారోగ్యం పాలై ఉంటారని, జైలు అంటే జైలు లాగే ఉంటుందని, ఏసీ ఏర్పాటు చేయాలని కోరుతారా? అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు.
బ్రిటిష్ ప్రభుత్వ హయాంలోనూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గాంధీ నెహ్రూ లను జైలులో పెట్టినప్పటికీ , వారికి చక్కటి సౌకర్యాలనే కల్పించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వమంతా దరిద్రంగా, దారుణంగా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా వ్యవహరించలేదు. ఇటువంటి పనికిమాలిన నాయకుల నా మనం ఎన్నుకున్నదని ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముఖ్యమంత్రి ఏమి చదువుకున్నారో తెలియదు.
ఆ తెలియనితనంతో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడడం ఏమిటంటూ మండిపడ్డారు. అంతటితో సరిపెట్టక , కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం దురదృష్టకరం. తమ నాయకుడు ఎంత వరస్ట్ గా మాట్లాడారో, దానికి తగ్గట్టే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.
సీబీఐ విచారణకు ఇస్తే మంచిదే… కోర్టు ఆదేశించిన సీబీఐ విచారణ స్వీకరించదు
సిఐడి చేతకాని సంస్థ అని, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును సిబిఐకి అప్పగించాలని పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు నోటీసులు జారీ చేసి, నాలుగు వారాల తర్వాత విచారిస్తామని చెప్పింది. ఈ కేసు విచారణని సిబిఐ కి అప్పగిస్తే మంచిదే. రఫెల్ డీల్ వ్యవహారంలో త్రిసభ్య ధర్మాసనం లో సభ్యుడైన న్యాయమూర్తి జోసెఫ్, సంఘటన జరిగిన తరువాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారించాలని సిబిఐ కి మార్గదర్శకాలు జారీ చేయలేమని చెప్పారు.
సీబీఐ సిఐడి లాగా పనికిమాలిన సంస్థ కాదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అంగీకరిస్తే తప్ప సిబిఐ ఈ కేసు టేకప్ చేయదు. న్యాయస్థానం ఆదేశించిన గత కోర్టు తీర్పులను ప్రస్తావించి… కేసును స్వీకరించే అవకాశాలు లేవు. ఈ లోగానే అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
మంగళవారానికి కేసు వాయిదా… అదే రోజు తుది వాదనలు పూర్తి
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రిమాండ్ రిపోర్టు క్వాష్ చేయాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు తుది వాదనలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. శుక్రవారం మధ్యాహ్నం వాదనలు ప్రారంభమైన తర్వాత ప్రాసిక్యూషన్ తరపున ముకుల్ రోహత్గి గంటన్నరపైగా వాదనలు వినిపించారు. ఇంకా అదనపు సమయం కావాలని కోరడంతో, మంగళవారానికి కేసును వాయిదా వేస్తూ తుది వాదనలను అదే రోజు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనిరుద్ బోస్ సూచించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ముకుల్ రోహత్గి పొంతన లేని సమాధానాలు చెబుతూ, తాను చెప్పాలనుకున్న దాంట్లో సఫలీకృతులయ్యారు. ఫైబర్ గ్రిడ్ కేసు లో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సిద్ధార్థ లూత్రా స్పష్టంగా తన వాదనలను వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వారం రోజుల తర్వాత ఫైబర్ గ్రిడ్ కేసులో ఆయన పేరును చేర్చారు. రెండు కేసుల్లోనూ వారెంట్లు జారీ చేశారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తే తిరస్కరించింద ని, సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. సోమవారం నాడు చంద్రబాబు నాయుడును ఈ కేసులో కోర్టు ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారని, ఈ కేసులో ఆయన్ని జ్యుడీషియల్ కస్టడీకి ఇస్తే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన దానికి ప్రయోజనం ఉండదు.
దానితో న్యాయమూర్తులు ఇద్దరు చర్చించుకుని సోమవారం నాడు చంద్రబాబు నాయుడుని కోర్టుకు హాజరు కావాలని పిలవకుండా, అరెస్టు చేయకుండా చూస్తారా అంటూ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి ని ప్రశ్నించగా, ఆయన దానికి పొంతనలేని సమాధానం చెప్పారు. కోర్టులో ఉన్న మేటర్ తో మాకేమిటి సంబంధం అని ఆయన పేర్కొనడం తో, మళ్లీ న్యాయమూర్తులు ఇద్దరు చర్చించుకుంటుండగా కంగారు పడిన ముకుల్ రోహత్గి బుధవారం వరకు ఈ మేటర్ టేకప్ చేయవద్దని చెబుతామన్నారు. మంగళవారం ఈ మేటర్ వింటామని ధర్మాసనం వెల్లడించినట్లుగా రఘురామకృష్ణం రాజు తెలిపారు..