Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌కు దమ్ముంటే రాజధాని మార్చామని కోర్టులో అఫిడవిట్ వేయాలి

– రాజధాని అంశం కోర్టులో ఉన్న విషయం మర్చిపోయారా?
– సీఎం, మంత్రులవన్నీ కోర్టు ఉల్లంఘనలే
– సీమపై ప్రేమ ఉంటే కర్నూలులో కృష్ణా యాజమాన్య బోర్డు ఎందుకు పెట్టలేదు?
– బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్

రాష్ట్రంలో ముఖ్యమంత్రి తో సహా ఏ మంత్రి అయినా దేశంలో ఎక్కడైనా నివసించే అవకాశం ఉంది. కానీ భాద్యత కలిగిన ప్రభుత్వంలో పాలన చేస్తున్న వారు, గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి పరిపాలన చేయాలి.

ప్రభుత్వంలోకి రాక ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా.. రాష్ట్ర రాజధాని అమరావతి లోనే తన నివాస గృహాన్ని నిర్మించారని బీరాలు పలికినవారు. నేడు మంత్రులయ్యాకా మూడు రాజధానులు అంటూ.. తమ పాలనా వైఫల్యాలను పక్కదోవ పట్టించే విధంగా కార్యాచరణ చేస్తూ, మూడు ప్రాంతాల ప్రజల మధ్య విభజన చిచ్చు పెడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోర్టు పరిధిలో ఉంది. రాజధాని తరిలిపోయిందని ఏ మంత్రి అయినా అంటే అది కోర్టు ఉల్లంఘనే అవుతుంది. అసత్య ప్రకటనలతో విశాఖపట్టణం లో రుషికొండ వద్ద నిబంధనలకు విరుద్ధంగా.. పర్యావరణ ఉల్లంఘనల కట్టడాలపైనా అనేక వ్యాజ్యాలు కోర్టులలో ఉన్నప్పుడు, రాజధాని తరలింపు అసాధ్యమని తెలిసినా కూడా, రాష్ట్రంలో మంత్రుల అవివేకమో లేక అమాయకమో తెలియదు గాని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దమ్ముంటే విశాఖపట్టణం కు రాజధాని తరలించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టులలో అఫిడవిట్ దాఖలు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వ పాలన భవనాలను విశాఖపట్టణం తరలిస్తున్నామని చెప్పడం కూడా కోర్టు ఉల్లంఘన అవుతుంది. కృష్ణా నది యాజమాన్య బోర్డును కృష్ణ నది పరివాహక ప్రాంతమైన కృష్ణ, గుంటూరు, కర్నూల్ జిల్లాలో కాకుండా.. విశాఖపట్టణంలో ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నప్పుడే రాష్ట్రంలో పాలకులకు, మతి భ్రమించిందని ప్రజలు భావించారు. నిజంగా ముఖ్యమంత్రికి రాయలసీమ పైన అభిమానమే ఉంటే, కృష్ణా నది యాజమాన్య బోర్డును కనీసం కర్నూల్ లో ఏర్పాటు చేసేవారు.

ఎవరైనా మంత్రులు తమ కుటుంబం, నివాసం కోసం విశాఖపట్టణంలో నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవడంలో ఎవరు అభ్యంతరం పెట్టరు, కానీ రాజధాని కాబట్టి అక్కడ నివాస వసతి ఏర్పాటు చేసుకుంటున్నాం అనడం, ప్రజలను మభ్య పెట్టడమే.

LEAVE A RESPONSE