-జగన్ దోపిడీలపై త్వరలోనే సోషల్ మీడియా వేదికగా కరపత్రం రిలీజ్ చేస్తా
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి, అమ్మ ఒడి, చేయూత ద్వారా మహిళలకు ఇచ్చిన దానికంటే, మద్యం ద్వారా దోచుకున్నదే ఎక్కువని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అమ్మ ఒడి ద్వారా బడీడు పిల్లల తల్లులకు ఏటా 13000, చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు పైబడిన 26 లక్షల మంది మహిళలకు 15వేల రూపాయలను జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి అందజేస్తున్నారు.
అమ్మఒడి లబ్ధిదారులకు, చేయూత పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం లేదు. చేయూత ద్వారా లబ్ధి పొందిన మహిళలకు అమ్మ ఒడి పథకానికి అర్హులయ్యే ఛాన్స్ లేదు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన క్వార్టర్ మద్యం సీసా 60 రూపాయలకు లభించేది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత క్వార్టర్ మద్యం సీసాను 200 రూపాయలకు విక్రయిస్తున్నారు.
అమ్మ ఒడి, చేయూత లబ్ధిదారులైన మహిళల భర్తలు రోజుకు ఒక క్వాటర్ చొప్పున మద్యం సేవిస్తూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిరోజు అదనంగా నూట నలభై రూపాయలను చెల్లిస్తున్నారని ఆయన చెప్పారు. ఒక్కొక్కరూ రెండు క్వార్టర్ల మద్యం తాగే అలవాటు ఉన్నవారు ఉన్నప్పటికీ, సగటున ఒక్కొక్కరూ ఒక క్వార్టర్ కు చెల్లిస్తున్న అదనపు సొమ్మునే లెక్కిస్తే సంవత్సరానికి 140 రూపాయల చొప్పున ( 140 x 360 ) 50, 400 రూపాయలను అమ్మ ఒడి, చేయూత లబ్ధిదారులైన మహిళలు వారి భర్తల మద్యం అలవాటు ద్వారా జగన్మోహన్ రెడ్డి చేతిలో దోపిడీకి గురవుతున్నారు .
అమ్మఒడి లబ్ధిదారులకు ఏడాదికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 13 వేల రూపాయలను ఇస్తుండగా, మద్యం ద్వారా వారి భర్తలు ఏడాదికి అదనంగా చెల్లిస్తున్న 50,400 నుంచి 13వేల రూపాయలను తీసివేస్తే (50, 400 – 13,000 = 37,400) 37,400 రూపాయలను తిరిగి వారే జగన్మోహన్ రెడ్డికి చెల్లిస్తున్నారన్నారు. చేయూత పథకం ద్వారా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి 15000 రూపాయలను ఇస్తుండగా, వారి భర్తలు రోజుకు క్వార్టర్ చొప్పున మద్యం సేవించడం ద్వారా అదనంగా చెల్లిస్తున్న 50 వేల నాలుగు వందల రూపాయలలో నుంచి 15 వేలు తీసివేస్తే (15000 – 50,400=35,400) 35,400 రూపాయల దోపిడీకి గురవుతున్నారని అన్నారు .
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అమ్మ ఒడి లబ్ధిదారుల నుంచి అదనంగా 1,87,500 రూపాయలను, చేయూత మహిళల నుంచి లక్షా 77 వేల రూపాయలను వసూలు దోచుకున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చే దానికంటే, మహిళలు వారి భర్తలకు ఉన్న మద్యం అలవాటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి చెల్లించిందే ఎక్కువ. సగటున ఒక్కొక్క మహిళా 1,82,000 రూపాయలను అదనంగా ఐదేళ్లలో చెల్లించగా, నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను కాబట్టి ఆ మొత్తాన్ని తగ్గించి 1,80,000 రూపాయలుగా లెక్కించాను.
ఇది కేవలం మద్యం ద్వారా మహిళల నుంచి జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సొమ్ము మాత్రమే. ఇతరాత్రా దోచుకున్న దోపిడీలను గురించి లెక్కలతో సహా వివరించి సోషల్ మీడియాలో కరపత్రం రిలీజ్ చేస్తాను. ఒక్కొక్క మహిళ నుంచి సగటున లక్షా యనబై వేల రూపాయలు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల్లో మీ ఓట్లను కొనుగోలు చేయడానికి 2000 నుంచి 3000 రూపాయలు తిరిగి మీకు ఇస్తే, అది చిరు అపరాధ రుసుముగా భావించి స్వీకరించండి. అంతేకానీ చట్టాన్ని అతిక్రమించి డబ్బులు ఇచ్చిన వారికి ఓట్లు వేయవద్దు.
ఎన్నికల్లో మీకు రెండు మూడు వేల రూపాయలు ఇచ్చి, ఐదేళ్లపాటు మీకు కన్నాలను వేసేందుకు రెడీ అయ్యారు. మీ దగ్గర కొట్టేసిన డబ్బులలో నుంచి రెండు నుంచి మూడు వేల రూపాయలు చెల్లించి ఓట్లు కొనుగోలు చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థి, వాలంటీర్ వస్తే… తీసుకొని, డబ్బులు చెల్లించని వారికి మాత్రమే ఓట్లు వేయండి. మద్యం లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దోపిడీ గురించి నేను చెప్పిన లెక్కలు తప్పు అయితే, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలలో ఎవరు ముందుకొచ్చిన వారితో బహిరంగ చర్చకు సిద్ధమని రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు.
మద్యంపై విపరీతంగా అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విపరీతమైన అప్పులను చేసిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా మద్య నిషేధం అమలు చేయలేని పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి కల్పించారు.
మద్యం అనేది సామాజిక రుగ్మతగా మారింది. రాబోయే ప్రభుత్వం నాసిరకమైన మద్యం స్థానంలో, నాణ్యమైన మద్యాన్ని, రీజనబుల్ రేట్లకు అందించేందుకు చర్యలను తీసుకుంటుంది . దీని ద్వారా మహిళల మాంగల్యాలను కాపాడడంతోపాటు, మద్యం ప్రియుల ఆరోగ్యాలు దెబ్బతినకుండా ఉంటుంది. మహిళలు మీ భర్తల ఆరోగ్యాన్ని, మాంగల్యాన్ని కాపాడుకోవడానికి చెత్త మద్యాన్ని విక్రయిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపాలని రఘురామకృష్ణం రాజు కోరారు.
మద్యం దోపిడీపై బస్సు యాత్ర చేస్తున్న ప్రయాణికులను ప్రశ్నించండి. వైకాపాకు ఓటు వేయడం అంటే 1,80,000 దోపిడీకి తిరిగి లైసెన్స్ ఇవ్వడమే అవుతుంది. ఈ దోపిడిని ఆపుతామని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా అంటూరఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. మద్యం లో హానికారకమైన రసాయనాలను కలుపుతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఓటర్ల జాబితాలో పురుషుల ఓట్ల సంఖ్య తగ్గిందని అంటున్నారు. నాసిరకమైన మద్యం సేవించి 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులు కూడా అధికంగా మృతి చెందారు. ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలించండి . వైకాపా ప్రభుత్వం దొంగ ఓట్ల నమోదును పెద్ద ఎత్తున చేపట్టింది. దొంగ ఓట్ల నమోదును అడ్డుకునేందుకు ఏలూరు సాంబశివరావు, పయ్యావుల కేశవ్ వంటి వారు విప్లవాత్మకంగా పోరాడుతున్నారు. వారి స్ఫూర్తితో అందరూ దొంగ ఓట్ల నమోదును ఎక్కడికక్కడ అడ్డుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.
ఎంపీని, సాక్షులను చంపే ప్రయత్నం చేస్తారా?… వచ్చేది మా ప్రభుత్వమే
ఎంపీ ని లాకప్ లోనే హత్య చేయాలని చూశారు. సాక్షులను కూడా చంపే ప్రయత్నాన్ని చేస్తున్నారు. సిఐడి పోలీసులు విచారిస్తున్న కేసులో, ఆ శాఖతో సంబంధం లేని డీజీ ర్యాంక్ అధికారి ఒకరు వారిని బెదిరించాడట. గతంలో నన్ను కూడా లాకప్ లో హింసించి చంపే ప్రయత్నం చేశాడు. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో పెండింగులో ఉంది. మనుషులను చంపేయడం ఏమిటి?
ముఖ్యమంత్రి బూట్లు నాకడానికి కొంతమంది పోలీసులు రెడీ గా అయ్యారు . ముఖ్యమంత్రి ఏమి చెప్పినా చేయడానికి సిద్ధమవుతున్నారు. నన్ను లాకప్ లో చిత్రహింసలు పెట్టి చంపేయాలని ప్రయత్నించిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ తెలియనట్టు నటిస్తున్నారు. నాకు ఆ విషయం తెలిసినప్పటికీ, తెలియనట్టుగానే నేను వ్యవహరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండే ఒక పోలీసు అధికారి దీనంతటికీ కారణం.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన ఏ ఒక్క పోలీసు అధికారిని వదిలిపెట్టం. న్యాయస్థానాల ద్వారానే శిక్షిస్తాం. బిపిన్ జైన్ కుమార్ అనే వైకాపా స్థానిక సంస్థల ప్రతినిధి, తాను వైద్యుడిని కాకపోయినా మెడలో స్టెతస్కోప్ వేసుకొని రోగులను పరీక్షించడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు.