Suryaa.co.in

Features

పీటర్ పాదుకలు

ఇది కధ కాదు. బ్రిటిష్ కాలంలో మధురై డిస్ట్రిక్ట్ కి పీటర్ అనే వ్యక్తి కలెక్టర్ గా ఉండేవారు. ఆయన ఆఫీస్ కి ఇంటికి మధ్యలోనే మీనాక్షి అమ్మవారి టెంపుల్. పీటర్ ప్రతిదినం తన కార్యాలయానికి అమ్మవారి దేవాలయం ముందరనుండి తన గుర్రంమీద వెళ్లేవారు. అలా వెడుతున్న సమయంలో పీటర్ తన కాళ్లకున్న చెప్పులు తీసి గుర్రం దిగి నడచి వెళ్లేవారు భక్తిగా.

ఒకసారి రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలితో వర్షం కురుస్తోంది. పీటర్ తన ఇంట్లో పడుకుని ఉండగా పెద్ద శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేవగానే, ఎదురుగా ఒక స్త్రీ వంటినిండా బంగారు ఆభరణాలతో నిలుచుని ఉంది. పీటర్, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుండగానే ఆ స్త్రీ బయటకు వెళ్ళిపోతూ, రా రా అని పీటర్ ను బయటకు పిలిచి, కనీసం కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా ఆ జోరు వర్షంలోనే వడి వడిగా నడుస్తూ కొంతదూరంలో అదృశ్యమవడం, ఇంటి నుంచి బయటకు వచ్చిన పీటర్ గమనించి వెనుతిరిగిన మరుక్షణంలోనే, అతని నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

నిర్ఘాంత పోయిన పీటర్ కొద్దిసేపటికి తేరుకుని, ఆ అర్ధరాత్రి వచ్చి తనను బయటకు పిలిచి ఈ ఘోరాపద నుండి కాపాడినది, సాక్షాత్తు ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని గ్రహించి చేతులెత్తి నమస్కరించిన కలెక్టర్ పీటర్ ఆ మరునాడు భక్తితో ఆలయానికి వెళ్లి అర్చకులను సంప్రదించి, రాత్రి జరిగిన ఆ ఉదంతాన్ని వారికి తెలియ చేస్తూ, అయ్యా రాత్రి నాకు దర్శనమిచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్లకు పాదరక్షలు లేవని గమనించాను. నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు బహుమతిగా ఇవ్వదలిచాను. మీరు అంగీకరించి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వగలరు అని వారి అంగీకారంతో 412 రూబీస్, 72 ఎమిరాల్డ్స్, 80 డైమండ్స్ తోవజ్ర వైడూర్య సహితమైన అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను ఆ మధుర మీనాక్షి తల్లికి సమర్పించారు కలెక్టర్ పీటర్.

“పీటర్ పాదుకలుగా” పిలువబడే ఆ పాదుకలను ఇప్పటికీ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా జరిగే “చిత్ర ఫెస్టివల్” సందర్భాన అమ్మవారి ఉత్సవ మూర్తి పాదాలకు అలంకరించి, ఊరేగింపు నిర్వహిస్తారు. ఆనాడు సత్య తార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం, అన్య మతస్థుడైనా, భగవంతునిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిపోయింది.

– భాషాభారతి

LEAVE A RESPONSE