– వైసీపీ సోషల్‌మీడియాకు జీతాల్లేవని ఆవేదన
– జగనన్నకు శ్రీరెడ్డి కన్నీటి వేడుకోలు
– సొమ్ముల్లేవంటూ శ్రీరెడ్డి వేదన
– ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని రోదన
– సీఎంఓ పట్టించుకోవాలని అభ్యర్ధన
– తనకు గుర్తింపు లేదని రోదన
– వైరల్ అవుతున్న శ్రీరెడ్డి వీడియో
– వైసీపీ నాయకత్వ నిర్లక్ష ్యంపై సైనికుల ఫైర్
బాసటగా నిలిచిన మహాసేన రాజేష్
జగనన్న పల్లకీమోసిన తననే జైల్లో పెట్టారన్న ఆవేదన
శ్రీరెడ్డికి మహిళా అధ్యక్ష పదవి ఎందుకివ్వలేదన్న ప్రశ్న
( మార్తి సుబ్రహ్మణ్యం)
సహజంగా నిర్మాతలు తమకు పారితోషికం ఎగ్గొట్టారని ఫిర్యాదు చేసే సినిమా నటులను చూశాం. తమకు సదరు నిర్మాత డబ్బులివ్వలేదు కాబట్టి, ఆ సినిమా విడుదల నిలిపివేయాలని ఫిలిం చాంబరుకు ఫిర్యాదు చేసే సందర్భాలు చూశాం. కానీ ఒక రాజకీయ పార్టీని ప్రమోట్ చేసే సోషల్‌మీడియాకు.. సదరు పార్టీ నిర్వహకులు డబ్బులు ఎగ్గొడుతున్నారంటూ, వీడియోకెక్కిన వైనం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఇంతకూ ఆ సోషల్‌మీడియా ఉద్యమకారిణి ఎవరంటే శ్రీరెడ్డి. పనిచేయించుకుని డబ్బులివ్వని ఆ రాజకీయ పార్టీ పేరు జగనన్న వైఎస్సార్‌సీపీ.
సోషల్‌మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి శ్రీరెడ్డి పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ రంగంలో మహిళలపై వేధింపులు.. తనకు సభ్యత్వం ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేస్తూ, హైదరాబాద్ ఫిలిం చాంబర్ ఆఫీసు వద్ద బట్టలిప్పి అఖిలాండకోటి ఆంధ్రులకు ఉచిత ప్రదర్శన ఇచ్చిన శ్రీరెడ్డి గురించి కొత్తగా పరిచయం కూడా అవసరం లేదు. ఏదో పాపం సోషల్‌మీడియాలో బూతు పురాణం విప్పి, పొట్టపోసుకుంటున్న శ్రీరెడ్డికి ఇప్పుడు సినిమా కష్టాలొచ్చిపడ్డాయట.
పవన్‌కల్యాణ్-టీడీపీపై నోటియుద్ధం చేస్తూ, జగనన్నను ఆకాశానికెత్తే వైసీపీ సోషల్‌మీడియా సేనాని అయిన శ్రీరెడ్డి ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉందట. చివరాఖర కు ఇంటి కిరాయి కట్టలేక, ఇంట్లో ఆడపిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నానంటూ విప్పి చెప్పిన సినిమా కష్టాలు, జగనన్న అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయట. జగనన్న కోసం రెక్కలు ముక్కలు చేసుకుని, ఒళ్లు హూనం చేసుకుని మరీ చేస్తున్న శ్రమదానాన్ని వైసీపీ సోషల్‌మీడియా వింగ్ పట్టించుకోవడం లేదన్నది శ్రీరెడ్డి ప్రధాన వాదన. వేదన!
జగనన్న ఇమేజ్ హిమాలయమంత ఎత్తుకు ఎదిగేందుకు, ప్రధాన కారణం వైసీపీ సోషల్‌మీడియా సైనికులన్నది బహిరంగ రహస్యం. టీడీపీ నేతలు వారికి పెట్టిన ముద్దుపేరు పేటీఎం బ్యాచ్. అంటే టీడీపీకి వ్యతిరేకంగా పెట్టే పోస్టుకు 5-10 రూపాయల కూలీ తీసుకునే పనిచేసే శ్రామికులన్నది, టీడీపీ సోషల్‌మీడియా సేనాని చింతకాయల విజయ్ వేసిన ముద్ర. అందుకే ప్రతిసారీ వైసీపీ సోషల్‌మీడియాను పేటీఎం బ్యాచ్ అని లోకేష్ సహా టీడీపీ నేతలు ఒంటికాలిపై లేస్తుంటారు. ఆమాటతో చిరాకుపడిన శ్రీరెడ్డి.. మీరు కూడా చేస్తుంది అదేకదా అని ఎదురుదాడికి దిగిందనుకోండి. అది వేరే విషయం.
పోనీ పాపం సదరు వైసీపీ సోషల్‌మీడియా సైనికులకు..వ్రతం చెడ్డా సుఖం దక్కుతుందా అంటే, అదీ లేదన్నది ఇప్పుడు శ్రీరెడ్డి అనే కరుడుకట్టిన జగనన్న అభిమాని విప్పి చెప్పిన రహస్యం. జగనన్న కోసం అహరహం కష్టపడి, రాత్రింబవళ్లు కంటిమీద కునుకులేకుండా ఒళ్లు హూనం చేసుకుంటున్నా కూడా.. తమకు ఫలితం దక్కడం లేదన్నది శ్రీరెడ్డి లాంటి జగనన్న వీరాభిమాని, వీడియోముందుకొచ్చి విప్పి చెప్పిన రహస్యం. దానితో.. వైసీపీ సోషల్‌మీడియా సైనికులకు.. టీడీపీ భాషలో చెప్పాలంటే పేటీఎం బ్యాచ్‌కు.. బద్నామ్ తప్ప, సొమ్ముల సుఖం దక్కలేదన్నది శ్రీరెడ్డి అనుభవపూర్వక వాస్తవం.
ఆమేరకు శ్రీరెడ్డి తాజాగా విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో శ్రీరెడ్డి కన్నీరు కార్చకపోయినా, దాదాపు అంతపనిచేసింది. ‘జగనన్నా.. మీకోసం కష్టపడుతున్న మాలాంటి వాళ్ల సోషల్‌మీడియా పేజీలను ప్రత్యర్ధి పార్టీలు కంప్లైంట్‌కొట్టి తీపిచ్చేస్తున్నారన్నా. ఏడాదికి ఐదారు నెలలు ఆదాయం పోతుందన్నా. దానివల్ల ఆ వీడియోలు మానిటైజ్ కావడం లేదన్నా. దానితో మేం కొన్ని లక్షలు నష్టపోతున్నామన్నా. మాకొచ్చే ఆదాయం పోతుందన్నా. ఇట్లా గత ఐదేళ్ల నుంచి కొన్ని లక్షలు నష్టపోతున్నామన్నా. మాకొచ్చే ఆదాయం నిలిచిపోయినందున చాలా ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటున్నాం.
ఇంట్లో ఉన్న ఆడపిల్లలను పోషించలేకపోతున్నామన్నా. ఫీజులు కట్టలేకపోతున్నామన్నా. మా స్టాఫ్‌కు జీతాలివ్వకపోతున్నాం. కాబట్టి సీఎంఓ వాళ్లు జోక్యం చేసుకుని మమ్మల్ని ఆర్ధిక సమస్యలనుంచి గట్టెంకించండి జగనన్నా. ఇంటి అద్దెలు కట్టక, తినీతినక చాలా ఇబ్బందులు పడుతున్నా. ఏదో ఒకటి చేయండన్నా’’ అంటూ శ్రీరెడ్డి చేతులు జోడించి వేడుకోవడం, జగనన్న అభిమానుల గుండెను పిండేసినంత పనయింది.
పైగా వైసీపీ సోషల్‌మీడియా సైనికులూ జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ శ్రీరెడ్డి కొత్త రహస్యం బయటపెట్టడం, అధికార పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. నిజానికి వైసీపీ సోషల్‌మీడియాను, సజ్జల భార్గవ్‌రెడ్డి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరెడ్డి తాజా ఆవేదన లాంటి ఆరోపణ ప్రకారం.. వైసీపీ మీడియా-సోషల్‌మీడియా సైనికులకు జీతాలివ్వడం లేదన్న విషయం బయట ప్రపంచానికి తెలిసినట్లయింది.
శ్రీరెడ్డి వైసీపీ పక్షాన సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆమెకు కోపం వస్తే తన- మన- పర- బేధాలు చూడదు. మంత్రి రజనీకి జగనన్న ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం తనకు నచ్చలేదని ఓ వీడియాలో స్పష్టం చేసింది. ఆమెకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం తనకు నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పింది. ఇంకోసారి వైసీపీ పాలన కంటే, చంద్రబాబు పాలన బాగుందంటూ తన గ్రామంలోని ఓ దేవాలయ దుస్థితిని వెల్లడించింది.
కొన్నేళ్లుగా పార్టీకి కష్టపడి పనిచేస్తున్నా తనకెలాంటి గుర్తింపు లేదని వాపోయింది. సోషల్‌మీడియాలో పనిచేసే వాళ్లకు కొద్దిమందికే జీతాలిస్తున్నారని, కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య.. వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్తలను వాడుకుని వదిలేస్తోందన్న సంకేలాలు వెళ్లేందుకు కారణమయింది. మిమ్మల్ని తిట్టిన వాళ్లకి పదవులిచ్చి మమ్మల్ని పట్టించుకోవడం లేదు జగనన్నా.. అని వాపోయింది.
అయితే తాజాగా శ్రీరెడ్డి సినిమా కష్టాలపై వైసీపీ మాజీ వీరాభిమాని మహాసేన రాజేష్ విషాద-విశాల హృదయంతో స్పందించారు.‘‘ అమ్మా శ్రీరెడ్డి.. ఇవన్నీ జగన్‌కు తెలియవనుకుంటున్నావు. కానీ ఇవన్నీ జగన్‌కు తెలిసే జరుగుతాయి. ఎన్నికల ముందు నేను కూడా నీకంటే ఎక్కువే బట్టలు చింపేసుకుని జగన్ కోసం కష్టపడ్డా. ఐదుపైసలు తీసుకోకుండా పనిచేసిన నేను నిజాలు చెబితే నన్ను జైల్లో పెట్టించారు. ఇక నువ్వెంతమ్మా? అసలు నీకు మహిళా అధ్యక్ష పదవి ఎందుకివ్వలేదో నాకు అర్ధం కావడం లేదు. రోజా, రజనీ కంటే నీకేం తక్కువ. అయినా పిల్ల సజ్జలకు కోట్లాది రూపాయల ఫండ్ ఇస్తున్నారట. అవన్నీ ఏం చేస్తున్నారో ఎటు పోతున్నాయో తెలియదు. అసలు జగన్ గెలుపులో పిల్ల సజ్జల రోల్ ఏంటి? ఎన్నికల ముందు ఏం కష్టపడ్డాడని పిల్ల సజ్జలకు ఆ పోస్టు ఇచ్చారు’’ అని శ్రీరెడ్డికి తన మాటల ఓదార్పు యాత్ర ద్వారా సంఘీభావం ప్రకటించారు.
అటు సొంత పార్టీ పట్టించుకోక.. ఇటు జగనన్న దృష్టికి తన సినిమా కష్టాలు తీసుకువెళ్లలేక పాపం శ్రీరెడ్డి అవస్థలు పడుతోందట. ఒళ్లు హూనం చేసుకుంటూ ఈ సోషల్‌మీడియాను నమ్ముకునేకంటే.. అదే కష్టం సినిమాల్లో ఇంకో రెండు షిఫ్టుల ఎగస్ట్రాతో రెక్కలు ముక్కలు చేసుకుంటే, నాలుగు రాళ్లు-ఎనిమిది ఇటికెలు వెనుకోసుకునేదానివి కదమ్మా.. అంటూ నెటిజన్లు శ్రీరెడ్డిపై టన్నుల కొద్దీ సానుభూతి కురిపిస్తున్నారు… పాపం శ్రీరెడ్డి!