– రేవంత్ రెడ్డి
పెద్దపల్లి జిల్లా : తెలంగాణ లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు నుంచి కాంగ్రెస్ తన ప్రచారాంలో వేగం పెంచింది. అధికారమే లక్ష్యంగా శనివారం రోజు రామగుండం కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరైన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడటానికి దోహదపడ్డ వారిని గుర్తుచేసుకున్నారు. జానారెడ్డి అధ్యక్షతన జేఏసీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. సింగరేణి బొగ్గు కార్మికుల కష్టం అనిర్వచనీయమైనదని కొనియాడారు.
తమ ఇంట్లో వండుకునేందుకు తిండి లేకపోయినా పస్తులుండి రాష్ట్రసాధనలో తమవంతు సహకారం అందించారని తెలిపారు.ఉద్యోగాలు పోతాయని బెదిరించినప్పటికీ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారని చెప్పారు. 60ఏళ్ల కళను సాకారం చేయడంలో కార్మికుల పాత్ర కీలకం అన్నారు. సింగరేణి కార్మికులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామన్నారు, సొంత ఇళ్ళు కట్టిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు.
నాలుగు లక్షల మందికి పైగా నివసించే సింగరేణి జనాభా ప్రస్తుతం రెండు లక్షలకు పడిపోయిందని,అన్నారు. మిగిలిన రెండు లక్షల మంది పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం వలసలు వెళ్లారన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగులు ఉండవని చెప్పిన కేసీఆర్ ఆ మాటలను మరిచిపోయారని మండిపడ్డారు.
ఈ మైనింగుల ద్వారా కాలుష్యం పెరిగి క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడి ప్రజలు చనిపోతున్నారు అందుకే తాము అధికారంలోకి వచ్చాక ఓపెన్ కాస్ట్ మైనింగ్స్‌ను రద్దు చేస్తామన్నారు. కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. అధికారంలోకి వచ్చాక ఫాం హౌజ్‌కే పరిమితమయ్యారన్నారు.
బొగ్గుమొదలు ఇసుక వరకూ అన్నీ దోపిడీ చేస్తున్నారని ప్రస్తుత ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డారు. ఈ దోపిడీలో కొంత వాటా కేసీఆర్ బిడ్డకు పోతుందని ఆరోపించారు. సింగరేణి కార్మికుల ఎన్నికలు వస్తే కోర్టుకు వెళ్లి వాయిదాలు వేయిస్తూ కాలయాపన చేశారన్నారు.
గతంలో సింగరేణికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ప్రస్తుతం రామగుండంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు మూతపడ్డాయని తాము అధికారంలోకి వస్తే తిరిగి తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. నిత్యవసర ధరలు తగ్గించాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలని రేవంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు..