Suryaa.co.in

Andhra Pradesh

దొంగ ఓట్ల పైనే ఆధారపడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

జగనే ఎందుకు కావాలని ప్రశ్నించిన వ్యక్తిని వైకాపా నేతలు చితకబాది జైల్లో పెట్టిన వైనం
పోరాట యోధుడు పద్మ విభూషణ్ రామోజీరావు
ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ మధ్యలో జగనన్న గల్లీ క్రికెట్ జ్ఞాపకాలు అవసరమా?
పాడిందే పాట… అన్నట్టు గా అడిషనల్ అడ్వకేట్ జనరల్ వ్యవహారం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

దొంగ ఓట్లపైనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధారపడి ఉందని, ప్రజలు తమకు ఓట్లు వేస్తారనే నమ్మకం మా పార్టీ నాయకత్వానికి లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు . బస్సు యాత్ర కాస్తా, తుస్సు యాత్ర గా మారిందని అర్థమయింది. సాక్షి దినపత్రిక చదివిన వారికి మాత్రం, బస్సు యాత్రకు విపరీతంగా జనం వస్తున్నట్లుగా గ్రాఫిక్స్ ఫోటోల ద్వారా భ్రమ కల్పిస్తున్నారన్నారు.బస్సు యాత్రలో ఖాళీగా కూర్చుని దర్శనమిస్తున్నాయి. జనం ఎక్కడ కూడా కనిపించడం లేదన్నారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… దొంగ ఓట్ల నమోదుపై రాజీ పడేదే లేదన్నట్లుగా వైకాపా నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయంపై సిటిజన్స్ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు న్యాయస్థానంలో కేసు వేశారు. అయినా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలోను ఒక్కొక్కరి పేరిట రెండు నుంచి నాలుగు వరకు దొంగ ఓట్లను నమోదు చేశారు. ఇలా నమోదు చేసినవే ప్రతి నియోజకవర్గంలోనూ 50 వేల పైచిలుకు ఓట్లు ఉంటాయని తేలింది. ఒక్కొక్కరి పేరిట కొన్నిచోట్ల 10 దొంగ ఓట్లు కూడా ఉన్నాయంటున్నారు. కొద్ది పేరు మార్పు ద్వారా ఇలా దొంగ ఓట్లను నమోదు చేశారన్నారు.

దొంగ ఓట్ల ద్వారానే , రానున్న ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇలా దొంగ ఓట్లన్నీ వైకాపా కార్యకర్తలు, నాయకుల పేర్లే ఉండడం గమనార్హం. ఒకే డోర్ నెంబర్ పై వేలకు, వేల ఓట్లు ఉండడంపై ఇప్పటికే వ్యక్తిగతంగా నేను, ప్రతిపక్ష పార్టీలుగా తెలుగుదేశం, జనసేన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కు మూడేళ్లుగా ఓటు హక్కు కల్పించడం లేదు. ఇదే విషయమై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఖచ్చితమైన హెచ్చరికను చేస్తుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నదా? లేదా అని సరిచూసుకోవాలి. ఓటు హక్కును సరి చూసుకోవడం ద్వారా మన రాష్ట్రాన్ని మనమే పరిరక్షించుకోవాలి.

అలాగే, పోలింగ్ రోజు మన ఓటు వాలంటీరో, వైకాపా పెయిడ్ కార్యకర్త దొంగ ఓటు వేయకుండా జాగ్రత్తపడాలి. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యక్తిగతంగా నేను, నాతోపాటు ఇతర పక్షాల నాయకులు వినతి పత్రాలను అందజేయడం జరుగుతుంది. ఓటరు జాబితాలో మీ ఓటును మీరు సరి చూసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇదే విషయాన్ని బిజెపి, టిడిపి, జనసేన పార్టీలను కార్యకర్తలు నాయకులు అవసరమైతే కొద్ది రోజులపాటు ప్రతి గ్రామంలో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. అక్కడకు వచ్చి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సరి చూసుకునేలా ప్రజలను జాగృతపరచాలి . ఓటర్ జాబితాలో పేరు లేని వారి పేరిట దరఖాస్తు ఫారం నింపి, వారి ఓటు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

ఫ్లెక్సీ చింపినందుకు దళిత యువకుడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన పోలీసులు
బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఒక వ్యక్తి ఫొటో నచ్చక అతని ఫోటోను దళిత యువకుడు ఒకరు చింపివేస్తే, అతనిపై పోలీసులు చేసిన దురాగతంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆ దళిత యువకుడు చింపింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో కాదు. ఫ్లెక్సీలో చివరన ఉన్న ఒక వ్యక్తి ఫోటో మాత్రమే. దానికి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ పై చేయి వేస్తావా అంటూ సదరు దళిత యువకుడిని పోలీసులు వేధించారు.

పోలీసుల వేధింపులకు భరించలేక ఆ యువకుడు మనో వ్యధ తో ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో నా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వేలాదిగా ఏర్పాటు చేసిన నా ఫ్లెక్సీలను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారితోనే బలవంతంగా పోలీసులు తీసి వేయించారు. మరి నా ఫ్లెక్సీలను తీసి వేయించే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు.. జగనన్న ఫ్లెక్సీ పై వేలు పెట్టినందుకే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకునేలా పోలీసులు ప్రేరేపించారు. ఈ దురాగతాలను చూస్తూ జనాలు ఊరుకుంటారని అనుకుంటున్నారా?, ప్రస్తుతానికి ఊరుకున్నప్పటికీ, సరైన సమయంలో తగిన శాస్తి చేస్తారని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించి… వాటికి వడ్డీ కూడా చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సదుపాయాల అభివృద్ధి కోసం 500 నుంచి 550 కోట్ల రూపాయల మేరకు నిధులు కేటాయిస్తుంటే, గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సదుపాయాలను అభివృద్ధి చేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లిస్తోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ఇళ్లల్లో ఉన్న వారిని వాలంటీర్లు బలవంతంగా గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరానికి తరలిస్తున్నారు. ఆ ఆరోగ్య శిబిరాలలో వైద్యులు ఉంటే మందులు ఉండవు, మందులుంటే వైద్యులు ఉండరన్న చందంగా తయారయ్యాయి. ఆరోగ్య శిబిరాలలో వైద్యులు, మందులు కూడా లేకుండా ఏదో చేస్తున్నట్లుగా నటించడం చూస్తే ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించి వాడుకున్నందుకు, ఆ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలను వడ్డీ కూడా చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించడం కోసం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తే ఎంతో మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రజలను మమేకం చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేస్తే, వాటికి వారి పేర్లనే పెట్టాలి. జేబులో నుంచి రూపాయి కూడా తీయకుండా తాత, తండ్రి, లేదంటే తన పేరు ముఖ్యమంత్రి పెట్టుకోవడం హాస్యాస్పదం.

ప్రతి ఏటా ఇచ్చే 250 కోట్ల రూపాయల గ్రాంటుతో పలానా సెంటర్ ను అభివృద్ధి చేస్తామని చెప్పి, ఆ ఊర్లో వాళ్లు ముందుకు వచ్చి భాగస్వాములు అయితే వారి పేరిటే అభివృద్ధి చేస్తామని చెప్పి చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్జిఎస్ నిధులను కూడా దారి మళ్లించగా, నేను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాను. కేంద్ర ప్రభుత్వం డబ్బులు వెనక్కి ఇవ్వాలని కరాకండిగా తేల్చి చెప్పింది. అయితే ఎక్కడో నిధుల దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ ఎంక్వయిరీ చేస్తామని చెప్పి తప్పించుకున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం గట్టిగానే హెచ్చరించింది. ఇదే కాకుండా కాంట్రాక్టులకు వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా హింసిస్తున్నారు.

పేరు చివరన కేవలం రెండు అక్షరాలు ఉన్నవారికి, పులివెందుల వారికి మాత్రమే ఇటీవల 300 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించినట్లు తెలిసింది. ఇంకా రెండు లక్షల కోట్ల రూపాయల బిల్లులు వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సి ఎఫ్ ఎం ఎస్ వెబ్ సైట్ ను అప్డేట్ చేయలేకపోతున్నారు. ఇప్పటికే జగనన్న ప్రభుత్వానికి వివిధ పరికరాలను సరఫరా చేసిన 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవలసి వస్తుందోనని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

కాంట్రాక్టర్లకు న్యాయం చేయమని చెప్పిన న్యాయమూర్తిని, ఈ ప్రభుత్వ పెద్దలు తమ పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రంలో లేకుండా చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దారుణంగా ఉన్నాయి. అయినా జగనే ఎందుకు కావాలని చెప్పి వాలంటీర్లు మూడు రంగుల వైకాపా టోపీలను పెట్టుకొని, అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారు. గ్రామ సచివాలయాలను వైకాపా కార్యాలయాలుగా మార్చివేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసి, దొంగ బిల్లులను పెడతారేమోనని రఘురామ కృష్ణంరాజు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇవన్నీటిని ప్రశ్నించి జగనే మళ్లీ ఎందుకు కావాలని అడిగిన పాపానికి ఒక యువకుడిని వైకాపా నేతలు చితక బాది జైల్లో పెట్టారు.

ఇలా ప్రశ్నించడం ద్వారా పత్రికల్లో వస్తుందని, దీనితో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని తెలుస్తుందని అక్కసుతోనే ఆ యువకుడిని చితకబాది జైలులో పెట్టారు. జగనే ఎందుకు కావాలని ప్రశ్నించిన ఒకరిద్దరిని ఇలాగే బాధితే, ప్రశ్నించిన వారిని కొడతారనే భయం ఉంటుందని అనుకుంటున్నారు. పత్రికల్లో రాయడానికి కూడా ధైర్యం ఉండదని భావిస్తున్నారు. ధైర్యం అలాగే ఉంటుంది. ఆ ధైర్యం కాస్తా పగగా మారుతుంది. ఆ ప్రతీకారం పోలింగ్ రోజు ఓట్ల కోసం ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ఈ ప్రభుత్వ పెద్దలు చేసిన దురాగతాలను ప్రజలు మరిచిపోరని, తగిన శాస్తిని చేస్తారని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.

వన్డే క్రికెట్లో విరాట్ 50 సెంచరీలు చేస్తే… వాయిదాలతో జగనన్న సరికొత్త రికార్డు రాశారు
వన్డే క్రికెట్లో భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 50 సెంచరీలను సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులకు హాజరు కాకుండా 3041 సార్లు వాయిదాలను కోరి సరికొత్త రికార్డు నెలకొల్పారని నెటిజెన్లు సెటైర్లు వేస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ సందర్భంగా క్రికెట్ అభిమానులు మ్యాచ్లను తిలకించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున రాష్ట్రంలోని పలు నగరాలలో, పట్టణాలలో పెద్ద పెద్ద స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. అయితే క్రికెట్ మ్యాచ్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఆడిన గల్లీ క్రికెట్ , ముఖ్యమంత్రి అయ్యాక క్రికెట్ బ్యాటు పట్టిన ఫోటోలను, జగన్మోహన్ రెడ్డితో కలిసి శరత్ చంద్రారెడ్డి ఉన్న ఫోటోలను ప్రదర్శించడం పట్ల అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

క్రికెట్ మ్యాచ్ లను అభిమానులు తిలకించడం కోసం బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఖర్చు చేస్తుంటే, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ప్రదర్శించడం ఎందుకంటూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేశారు. అన్ని ఆస్తులపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రిస్తున్నారు. కుదిరితే తండ్రిది, కుదరకపోతే కుమారుడి పేరును సంక్షేమ పథకాలకు పెడుతున్నారు. ఇంకా క్రికెట్ మ్యాచ్ లు తిలకించే సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ప్రదర్శించి హింసించడం అవసరమా అంటూ నిలదీస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

స్కిల్ కేసులో 36 మందికి ఇప్పటికే బెయిల్ ఇచ్చారు…
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితులుగా పేర్కొన్న 36 మంది వ్యక్తులకు న్యాయస్థానం పూర్తిస్థాయి బెయిలు మంజూరు చేసిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. చివరి నిమిషంలో 37వ వ్యక్తిగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు చేర్చారు. హైకోర్టులో తీర్పు వెలువడిన రోజున 37వ వ్యక్తిగా చేర్చబడిన చంద్రబాబు నాయుడు కి కూడా పూర్తిస్థాయి బెయిల్ లభిస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి బెయిల్ పిటీషన్ పై వాదనల సందర్భంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి మ్యాటర్ ఏమీ లేక పాడిందే పాట… అన్నట్లుగా తన వాదనలు వినిపించారు. తొలుత మూడు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, ఆ తరువాత 300 కోట్ల రూపాయలని, ఇప్పుడేమో పార్టీ ఆఫీసుకు విరాళంగా డబ్బులు వెళ్లాయని అంటున్నారు. ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించడానికి మరికొంత సమయం కావాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తిని కోరడంతో, ఈరోజుకు కేసు వాయిదా పడింది. చంద్రబాబు నాయుడు పై చేసిన నిరాధారమైన ఆరోపణలు దూది పింజల్లా ఎగిరిపోతాయి. చంద్రబాబు నాయుడు వైపు న్యాయం ఉంటే, జగన్మోహన్ రెడ్డి వైపు దరిద్రమైన అన్యాయం ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు.

నాకు నిరంతర స్ఫూర్తి ప్రదాత రామోజీరావు
ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు నాకు నిరంతర స్ఫూర్తి ప్రదాత అని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ ప్రభుత్వం ఆయన్ని పెడుతున్న ఇబ్బందులను చూసి, ఆయన ఇబ్బందుల ముందు నాకు వచ్చిన ఇబ్బందులు ఒక లెక్క అని అనిపిస్తుందన్నారు. రామోజీరావు గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని, ఈ కిరాతక అరాచక పాలనలో ఆయన చేస్తున్న పోరాటం అసామాన్యమైనదని పేర్కొన్నారు. రామోజీరావును ఎలాగైనా అరెస్టు చేసి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవాలని భావించారు. కానీ ఆయన కోరిక ఎట్టి పరిస్థితుల్లోనూ తీరేది కాదు.

మార్గదర్శి సంస్థపై అన్యాయంగా కేసులు మోపినప్పుడు, లక్షలాది చందాదారుల్లో నుంచి ఒక్కరి చేత కూడా తమకు అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసే సిఐడి అధికారులు చెప్పించలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కక్షతో వ్యవహరిస్తున్నప్పటికీ, తగ్గేదే లేదు అన్నట్లుగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అరాచకాలను ధైర్యంగా తూర్పారబడుతూ అలుపెరుగని పోరాటం చేస్తున్న పోరాట యోధుడు రామోజీరావు కొనియాడారు . రామోజీరావు 88వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రఘురామకృష్ణం రాజు ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE