– అభివృద్ధి కార్యక్రమానికి ఫండ్స్ రిలీజ్ చేయొద్దని ఏ ముఖ్యమంత్రి చెప్పడు
-చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని అనుకోలేదని జగన్ గుండెపై చేయివేసి చెప్పగలరా?
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అబద్ధం పాతివేయబడుతుందనేది చంద్రబాబు విషయంలో నిజమైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాయలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వటం హర్షదాయకం. కోర్టు బెయిల్ ఇస్తూ చేసిన కామెంట్స్ చూసి సీఐడీ ఛీఫ్ సంజయ్ సిగ్గుతో తలదించుకోవాలి. ఫండ్స్ రిలీజ్ చేయమనటం నేరం చేసినట్లు కాదు అని కోర్టు చెప్పింది. ఎక్కడైనా సీఎం ఫండ్స్ ఇవ్వొద్దని చెబుతారా? అని కోర్టే ప్రశ్నించింది. జగన్ మోహన్ రెడ్డి చెప్పమన్నారని సీఐడీ ఛీఫ్ చెబితే కోర్టు అంగీకరించదు. కోర్టు దర్యాప్తు అధికారిని ఆ చెంప, ఈ చెంప వాయించింది. పేరుకే దర్యాప్తు అధికారి ధనుంజయరెడ్డి.. కానీ అంతా చేసింది సీఐడీ ఛీప్ సంజయే. సీఐడీ ఛీఫ్ ఎందుకింతలా తప్పు చేయాల్సి వచ్చింది? ఎందుకు సీఐడీ ఛీఫ్ సంజయ్.. జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేస్తున్నాడు.
సబ్ కాంట్రాక్టర్స్, వేరేవారు చేసింది చంద్రబాబుకు ఆపాదించడానికి వీలులేదని క్లియర్ గా జడ్జిమెంట్ లో చెప్పడం జరిగింది. వీటికి జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారు? సబ్ కాంట్రాక్టర్ల్స్ డీవియేట్ చేశారనడానికి చంద్రబాబుకు ఏం సంబంధం ఉంది? కోర్టు బెయిల్ ఇస్తూ చేసిన కామెంట్స్ అధికార యంత్రాంగం కూడా డీవియేట్ అయిందని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లుగా సాక్షాలు లేవని తేల్చి చెప్పింది. వీటన్నింటిని బట్టి చూస్తుంటే దర్యాప్తు అధికారులు దిక్కుమాలిన దర్యాప్తు చేశారనిపిస్తోంది. ఈ కార్పొరేషన్ కు ఎలా నష్టం జరిగిందని చూపించడంలో సాక్షాలు లేవని కోర్టు ఇచ్చిన రిపోర్టులో ఉంది. ఎందుకు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో అవరికీ అర్థం కావడంలేదు.
చంద్రబాబుకు బెయిల్ ఎందుకు ఇవ్వాలో కూడా రిపోర్టులో వివరించారు. వీటన్నింటికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? ఇది తప్పుడు కేసు అని క్లియర్ గా అర్థమౌతోంది. హైకోర్టు చేసిన కామెంట్ విని వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. హైకోర్టు చేసిన కామెంట్ తో వైసీపీ పార్టీ, నాయకులు సిగ్గుతో తల దించుకుంటున్నారు.
చంద్రబాబునాయుడుపై మోపబడిన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ ఇస్తూ చేసిన కామెంట్ స్కిల్ కేసులో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. చంద్రబాబు చేసిన తప్పేమీ లేదని, ప్రైమా-పేసీ కేసే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రాజకీయ కక్ష, ఈర్ష్య, ధ్వేషంతో 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో బాబును రిమాండ్ ఖైదీగా ఉంచి, జగన్ తన కక్ష తీర్చుకున్నాడు.
జగన్ కు నైతిక విలువలు ఉంటే 53 రోజులు అనవసరంగా జైల్లో ఉంచి, ఆయన విలువైన కాలాన్ని వృధా చేసినందుకు క్షమాపణ చెప్పాలి. ఈ కేసులో వాదించిన లూధ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ బృందం అభినందనీయులు. యువనాయకుడు లోకేష్ ‘పాదయాత్ర’, మేడం భువనేశ్వరి గారి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాలు మళ్లీ కొనసాగుతాయి. అధికార పార్టీ చంద్రబాబును జైల్లో ఉంచి ఎన్నికలకు వెళ్లాలనే దురుద్ధేశం తప్ప మరొకటి కాదు. చంద్రబాబు అరెస్టు చేస్తే ఖండించి మద్దతిచ్చినవారందరికీ తెలుగుదేశం పార్టీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతోంది. చంద్రబాబు జాతీయ సంపద అని మన్మోహన్ సింగ్ గారే అన్నారు.
అంతటి సంపదను జగన్ విచ్ఛిన్నం చేయాలని చూశారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ 29వ తేది నుంచి పూర్తిగా ప్రజా సేవకు పునరంకితం కావాలని ప్రజల ఆకాంక్ష. రాబోయే రోజుల్లో ఈ రాక్షస పరిపాలన అంతం కావాలి, చంద్రబాబు పాలన రావాలి. ఎప్పుడెప్పుడు ఈ పాలన అంతరిస్తుందా అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మళ్లీ రామరాజ్యం, ప్రజా రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పు చేసినా, అవినీతి చేసినా, అవినీతికి పాల్పడినా జైల్లో ఉంచితే ఓకే, మరి ఏ నేరం చేయని చంద్రబాబును అనవసరంగా 53 రోజులు జైల్లో ఉంచారు. అధికారం చేతిలో ఉందని ఇష్టమొచ్చినట్లు ఆడుతున్నారు.
సంజయ్ లాంటి సీఐడీ ఛీఫ్ లు మీ చేతిలో ఉన్నారని ఆడిందే ఆట అయిపోయింది. వైసీపీ పాలనలో దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టడం ఆనవాయితీ అయింది. బెయిల్ రావడంలో ఆలస్యమైనా సత్యం, న్యాయం గెలిచాయి. చంద్రబాబును జైల్లో ఉంచి ఎన్నికలకు వెళ్ళాలని కుట్ర పన్నలేదని వైసీపీ గుండె మీద చేయి వేసుకొని చెప్పగలరా? మరలా మా నాయకుడు ప్రజా సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. బెయిల్ ఆర్గుమెంట్ ఒక జడ్జిమెంట్ లా ఉంది. ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబుకు మద్దతు పలకాల్సిన అవసరం వచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.