Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నాయుడుకు పూర్తిస్థాయి బెయిల్ తో న్యాయానికి పట్టాభిషేకం

29వ తేదీ నుంచి ఎటువంటి షరతులు లేకుండా ఆయన అన్ని రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు
అన్ని రంగాలలో ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడుగు పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే
చట్టాన్ని తుంగలో తొక్కి ఒకరిద్దరి లబ్దికోసం అడ్వాన్సులు ఇస్తామంటే ప్రజలు సహించరు
ప్రకృతి వైపరీత్యాలను వ్యక్తులపై తోసేసే అలవాటు ఇప్పుడు బూమ్ రాంగ్ అయింది
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో పూర్తిస్థాయి బెయిలు లభించిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు తెలిపారు. చంద్రబాబు నాయుడుకు పూర్తిస్థాయి బెయిల్ లభించడంతో న్యాయానికి పట్టాభిషేకం జరిగింది. బ్లూ టీం న్యాయవాదులపై ఎల్లో టీం న్యాయవాదులు నెగ్గినట్లుగా న్యాయమూర్తి ప్రకటించారు.

39 పేజీలతో కూడిన బెయిల్ తీర్పు పాఠం లో, చంద్రబాబు నాయుడుకి ఎటువంటి షరతులను విధించలేదు. ఈనెల 28వ తేదీ వరకు మద్యంతర బెయిల్ షరతులు వర్తిస్తాయి. 29వ తేదీ నుండి ఆయన అన్ని రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేందుకు కోర్టు సమ్మతించింది. తన ఆరోగ్య నివేదికలను కూడా రాజమండ్రి జైలు అధికారికి సమర్పించాల్సిన అవసరం లేదని, నేరుగా న్యాయస్థానానికే అందవజేయవచ్చునని తేల్చి చెప్పడం జరిగిందని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.

గత ప్రభుత్వ హయాంలో నెంబర్ వన్ స్థానంలో డిస్కం లు ఉండగా… ఇప్పుడు 40వ స్థానానికి పడిపోయాయి
ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అధోగతి పాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. హాలీవుడ్ లో ఉత్తమ చిత్రాలకు అవార్డు ఇచ్చినట్లుగానే, చెత్త చిత్రాలకు కూడా అవార్డులు ఇస్తారన్న ఆయన, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి కూడా అటువంటి అవార్డు ప్రధానం చేయాలన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో డిస్కంలో 5వ స్థానం నుంచి నెంబర్ వన్ స్థానానికి చేరుకోగా , ప్రస్తుతం 20 వ స్థానం నుంచి 40వ స్థానానికి పడిపోయాయన్నారు. దీనికి బాధ్యులు ఎవరంటే 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

కరువు మండలాలను తక్కువగా చూపించి రైతులను ముంచేసిన జగన్
రాష్ట్రంలో 400 మండలాలలో కరువు పరిస్థితులు ఉండగా, కేవలం 103 మండలాలలోని మాత్రమే కరువు పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రానికి ముఖ్యమంత్రి నివేదించడం పట్ల బీజేపీ నాయకులు సత్య కుమార్ కూడా తప్పు పట్టారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులను యధావిధిగా కేంద్రానికి నివేదించి ఉంటే, రైతులకు లబ్ధి చేకూరేదన్నారు. కరువు అనేది ఎవరి చేతుల్లో ఉండదు. కానీ రాష్ట్రంలో నీటి నిర్వహణ ప్రణాళిక సక్రమంగా చేయకుండా, కరువు క్షామ పరిస్థితిలు తలెత్తడానికి పాలకులే కారణమయ్యారు.

అవసరమైనప్పుడు నీటిని నిల్వ చేయకుండా వృధా చేశారు. వర్షాభావ పరిస్థితులు తలెత్తినప్పటికీ, రాష్ట్రంలో కరువు పరిస్థితులకు ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డి కారణమని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను కేంద్రానికి నివేదిస్తే, కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించిన తనిఖీలను నిర్వహించి అవసరమైన సహాయం, బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. తనకు తాను మహానుభావుడిగా చిత్రీకరించుకుంటూ… గతంలో ఉన్నవాళ్లు కరువుకు బ్రాండ్ అంబాసిడర్ లు అన్న అపప్రదను వారిపై మోపుతూవచ్చారు. ఎప్పుడైనా కరువు పరిస్థితులు తలెత్తితే ప్రకృతి వైపరీత్యాన్ని వ్యక్తులపై తోసేసే అలవాటు ఉన్నవారికి, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు బూమ్ రాంగ్ అయ్యాయన్నారు .

కరువుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని ప్రజలు మాట్లాడుకోవద్దనే దురాలోచనతో ఉన్న కరువును కూడా చూపెట్టకపోవడం వల్ల, రైతులు ఎంతో నష్టపోవలసిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న నీటివనరులను సజావుగా వినియోగించుకోరు, సొంత కంపెనీలయిన భారతి సిమెంట్స్, ప్రతిభ ఫర్టిలైజర్స్ కు మాత్రం టంచన్ గా నీటి కేటాయింపులు చేశారు. ప్రజల అవసరాలను గాలికి వదిలేసి రైతు కోసం జగన్ – జగన్ కోసం రైతులని తింగరి స్లోగన్లతో గందరగోళానికి గురి చేస్తూ, రైతులను ముంచే పరిస్థితిని తీసుకొచ్చారు.

ఇప్పటికైనా ప్రకృతి వైపరీత్యము అని చెప్పి రాష్ట్రంలోని 400 మండలాలలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేవని ఒకవైపు ముఖ్యమంత్రులు చెబుతుంటే, మాకెందుకు వచ్చిన తలనొప్పి అని అంటారన్నారు. అయినా, మా ప్రయత్నం మేము చేస్తామని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

రెండు అక్షరాల గుత్తేదారులకు బ్యాంకు గ్యారంటీ ఇస్తారట…
రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేసిన గుత్తేదారులు ధర్నా నిర్వహించి, గవర్నర్ కు వినతి పత్రం అందజేయడానికి సిద్ధమైనట్లు తెలిసిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. బడా కాంట్రాక్టర్లకు, పేరు చివర రెండు అక్షరాలు ఉన్న గుత్తేదారులకు మాత్రం బ్యాంకు గ్యారంటీని అక్టోబర్ నాటికి ముఖ్యమంత్రి ఇవ్వనున్నారని తెలిసింది. ఏప్రిల్ నాటికి ఈ ప్రభుత్వం పని ఖతం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుత్తేదారులకు గ్యారెంటీ ఇవ్వాలి అంటే అసెంబ్లీలో బిల్లు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే గ్యారెంటీ ఇవ్వడానికి లేదు.

బ్యాంకు వారు కూడా ఎలా గ్యారెంటీ ఇస్తున్నారో తెలియదు. బడా గుత్తేదారులు బ్యాంకు అధికారులను మేనేజ్ చేసుకుంటారని పత్రికల్లో చూసాం. వాళ్లు మేనేజ్ చేసిన బ్యాంకర్ రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందట. రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉన్నప్పటికీ, అంతిమ లబ్ధిదారులు మాత్రం బడా కాంట్రాక్టర్లేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాబోయే రోజుల్లో చేస్తారో చెయ్యరో తెలియని పనికి ఈరోజు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండి డబ్బులు ఇవ్వడం ఏమిటి?. కట్టిన ప్రాజెక్టులు ఉంటాయో లేదో తెలియడం లేదు . ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది.

భార్యల పుస్తెలు తాకట్టుపెట్టి మరి కాంట్రాక్టర్లు పనులు చేశారు. బిల్లులు అందకా ఇప్పటికే 38 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎన్నికల ఫండింగ్ కోసమే అధికార వైకాపా, ఒక సామాజిక వర్గానికి చెందిన బడాకంట్రాక్టర్లకు బ్యాంకు గ్యారంటీలు ఇస్తున్నట్టు ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. చట్టాన్ని తుంగలో తొక్కి ఒకరిద్దరి లబ్దికోసం అడ్వాన్సులు ఇస్తే రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తూ సహించరు. అందరికీ సమన్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. ఒకవైపు పోలవరం ప్రాజెక్టుతో తమకు సంబంధం లేదని ఇప్పటికే రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వమే పోలవరం పనులను చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో కేంద్రాన్ని అడగమని చెప్పిన అంబటి రాంబాబు, ఎక్కువ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ, అప్పుడప్పుడు తన శాఖ గురించి మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రమే నిర్మించేటప్పుడు, కాంట్రాక్ట్లను కూడా కేంద్రానికి బదిలీ చేయాలి. అంతేకానీ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది.

అయినా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఎంత బ్యాంకు గ్యారంటీ ఇస్తున్నారు. ఆ కంపెనీ నిర్మించిన డయా ఫ్రమ్ వాల్ లో ఎన్నో లోపాలున్నాయి. కాంట్రాక్టర్ లందరికీ సమన్యాయం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని, అంతేకానీ ఒకరిద్దరికీ న్యాయం చేసే విధంగా వ్యవహరించడం సబబు కాదని రఘురామకృష్ణం రాజు అన్నారు. మంగళవారం అరువు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని వెంపర్లాడుతోంది. ఇటీవల మంగళవారం అనే ఒక సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో మంగళవారం హత్యలు జరుగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అప్పులు చేస్తుంది. సినిమాలో జరిగే హత్యలకు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధం లేకపోయినప్పటికీ, ప్రభుత్వం చేస్తున్న అరువుతో ప్రజల భవిష్యత్తు అప్పులతో ఊబిలోకి నెట్టి వేయబడుతుందన్నారు..

ఋషికొండపై విలాసవంతమైన భవన నిర్మాణానికి 443 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చింపు
ఋషికొండ పై ముఖ్యమంత్రి నివాస, క్యాంపు కార్యాలయ సముదాయ నిర్మాణానికి 443 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. జీవోలన్నింటిని బహిర్గతం చేయాలని ఇటీవల న్యాయస్థానం ఆదేశించింది. దీనితో ఋషికొండ పై ముఖ్యమంత్రి నివాస, కార్యాలయ సముదాయ నిర్మాణం కోసం ఇచ్చిన జీవోలు వెలుగులోకి వచ్చాయి. 100 కోట్ల రూపాయలు దాటితే న్యాయ సమీక్ష అవసరమని భావించి, నాలుగు ముక్కలుగా టూరిజం ప్రాజెక్టు పేరిట ఋషికొండపై విలాసవంతమైన భవన సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కాంట్రాక్టర్లకు అరువు పెట్టకుండా, అప్పుడే బిల్లులన్నీ చెల్లించారు.

ఒక వ్యక్తి తన విలాసం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి, పర్యావరణ చట్టాన్ని పూర్తిగా తుంగలోతోక్కి కట్టకూడని ప్రాంతంలో భవన నిర్మాణాన్ని చేపట్టడం దారుణం. టూరిజం భవనం అని చెప్పి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. కోర్టుకు పచ్చి అబద్దాలను చెప్పి బ్లాకులు, బ్లాకులుగా ముఖ్యమంత్రికి అవసరమైన విధంగా భవన సముదాయాన్ని నిర్మించారు. చట్టాలను నిర్లజ్జగా ఉల్లంఘించి ఒక వ్యక్తి కోసం 433 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం నిర్మించడం ఎంతవరకు సమంజసమని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

క్రికెట్ లోనూ రాజకీయాలు జోప్పిస్తారా?
క్రికెట్లోనూ వైకాపా సానుభూతిపరులు రాజకీయాలను జోప్పించడం అసహ్యంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డికి బ్లూ రంగు జెర్సీ వేసి, తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎల్లో రంగు జెర్సీ ని వేసి జగన్ ట్రెండ్స్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు హడావిడి చేశారు. ఇండియా గెలుస్తుందని అందరూ భావించారు. అయితే ఒత్తిడిని తట్టుకోవడం మన ఆటగాళ్లకు కష్టమయ్యింది.

దేశ ప్రధాని తో పాటు, ఇతర సెలబ్రిటీల ముందు ఒత్తిడిని తట్టుకొని విజయం సాధించడంలో విఫలమయ్యారు. అయినా క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే. క్రీడల్లో కూడా రాజకీయాన్ని జోప్పించడం కేవలం వైకాపా సానుభూతిపరులకే చెల్లింది . చివరకు విజయం పసుపు రంగు కే దక్కిందని మూసుకొని కూర్చుంటారా?.. ఆబ్బెబ్బే తూచ్, అది క్రికెట్… ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యూహాలు వేరే ఉన్నాయని అంటారా అంటూ అపహాస్యం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్క్రీన్ లకు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏమిటని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. క్రికెట్ మ్యాచ్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి క్రికెట్ బ్యాట్ పట్టిన చిత్రాలను ప్రదర్శించడం ఎందుకని నిలదీశారు.

బీచ్ శాండ్ మినరల్ కోసం 8% చాలని టెండర్ పిలవడం విడ్డూరం
దారుణమైన అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని హోల్ సేల్ గా అమ్మేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 8 శాతం వాటా చాలనిబీచ్ అండ్ మినరల్ తవ్వకాల కోసం టెండర్లు పిలవడం దారుణమని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు . బీచ్ శాండ్ మినరల్స్ ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే తవ్వకాలను చేపట్టాలి. ఒకవేళ ప్రైవేటు సంస్థకు తవ్వకాలను కట్టబెడితే, రాష్ట్ర ప్రభుత్వం వద్ద 74% వాటా పెట్టుకుని కేవలం 26% వాటాను మాత్రమే ప్రైవేటు రంగ సంస్థకు కట్టబెట్టాలి. కానీ, కేవలం ఎనిమిది శాతం వాటాను మాత్రమే చాలనుకొని టెండర్లు పిలవడం ఆశ్చర్యంగా ఉంది. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం.

ఇలా ఎలా చేయగలుగుతున్నారో అంతు చిక్కడం లేదు. డాక్యుమెంట్ రూపంలో పెట్టడానికి ఎలా ధైర్యం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి అంత అవసరం ఏమొచ్చింది. ఇప్పటికే పొర్టులను అమ్మేశారు.. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న విస్తారమైన వనరు సముద్రతీరం. అమరావతిలో వేసిన రోడ్లను తవ్వి అమ్ముకుంటున్న వారిని ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తున్నారు. సహజ సంపద కరువు, అరువు లో ఉన్న రాష్ట్రానికి లాభం చేకూరేలా ఉండాలి. కానీ గజదొంగలు ఇంటిని దోచుకున్నట్లుగా, ఇక మా పని అయిపోయిందని రాష్ట్రాన్ని దోచుకోవడం దారుణం. గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తే, రాష్ట్ర ఆదాయానికి నష్టం వచ్చిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టిన విషయాలు తెలిసింది.

రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడకుండా సహజ వనరులు ఒకరిద్దరికి దోచిపెడితే, రానున్న ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా?, అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో 90 ఎం.ఎల్ మద్యం సీసాలు దొరకడం లేదు. ఎవరైనా 180 ఏం ఎల్ సీసాలను మాత్రమే కొనుక్కోవలసిన పరిస్థితి నెలకొంది. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 90 ఎం.ఎల్ నాణ్యమైన మద్యం సీసాలు దొరుకుతున్నాయి. ప్రజలను ఆర్థికంగా ఆరోగ్యంగా దోచేయడానికే వారికి 90 ఎం.ఎల్ మద్యం సీసాలను అందుబాటులో లేకుండా చేశారన్నారు.

LEAVE A RESPONSE