-ధాన్యం కొనండి మహాప్రభో
-ప్రకృతి దోబూచులాట
-ప్రకటనలకే పరిమితంగా ప్రభుత్వం
-ఆరు లక్షల ఎకరాల్లో సార్వాసాగు
-అలంకారప్రాయంగా ఆర్బికేలు
-సంచులు… స్టాక్ నిల్
-లారీలు… ఖాళీ లేవు. రోడ్లు పక్కనే గుట్టలు గుట్టలుగా ధాన్యం
-దయనీయ స్థితిలో అన్నదాతలు
-రోజుల తరబడి రైతులు పడిగాపులు
-పట్టించుకునే నాధుడు కరువు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముడుపోక అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ధాన్యాన్ని కొనండి మహాప్రభో అంటూ గావు కేకలు పెడుతున్నారు .ఈ కేకలు ఎవరికి వినిపించడం లేదు. కాదు కాదు పట్టించుకోవడం లేదు .మరోపక్క తరుముకొస్తున్న తుఫానుతో పకృతి రైతులతో దోబూతులాడుతోంది. కాగా ప్రకటనలకే పరిమితం అవుతూ ప్రభుత్వం ప్రచారాలతో సరిపెట్టుకుంటుంది. అట్టహాసంగా ప్రారంభించిన ఆర్.బి.కె (రైతు భరోసా కేంద్రాలు) అలంకారప్రాయంగా మారాయి. ఈ కేంద్రాలు సంచులు స్టాకు లేవు … లారీలు ఖాళీ లేవు …అనే మాటల కు పరిమితమయ్యాయి .
దీంతో రోడ్ల ప్రక్కనే గుట్టలు గుట్టలుగా ధాన్యపు రాశుల నిల్వలు కానవస్తున్నాయి . రోజుల తరబడి రైతులు పడిగాపులు పడాల్సి వస్తుంది. పట్టించుకునే నాధుడు లేక దిక్కులు చూస్తున్న అన్నదాత ఉమ్మడి కృష్ణాజిల్లాలో మనకు కానవస్తున్నాడు. రైతు గోల ఎవరికి పట్టడం లేదు. రైతు కష్టంపై జాలి లేదు. రైతు నష్టం పై అంచనా లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక సతమతమవుతున్న రైతుల దయనీయ స్థితి గ్రామాల్లో కానవస్తుంది .
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏటా దాదాపు 2 .50 లక్షల హెక్టార్లలో రైతులు ఖరీఫ్ సీజన్లో సార్వ పంటగా వరి పంటను సాగు చేస్తారు .అంటే దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో వరి పంట ఈ కాలంలో సాగు అవుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు కష్టనష్టాలకు తట్టుకొని రైతులు ఈ సాగు చేస్తున్నారు.ఈ ఏడాది అత్యధికంగా 1061 తెలుపు రకం ధాన్యం తో పాటు 13 18 11 21 తదితర ఎరుపు రకం వరి పంటను రైతులు సాగు చేశారు .ఎండకు ఎండి వానకు తడిసి పంటను సాగు చేశారు. సకాలంలో వర్షాలు కురిసినా కురవక పోయినా అధిక వర్షాలతో ముంపుకు గురైనా సాగునీరు ఇబ్బందులు ఎదురైనా పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడైనా నోరెత్తకుండా రైతాంగం భరించారు .
అంత కష్టపడి పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేకపోవడమే వాటన్నింటికీ మించిన భారంగా రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన కనీస మద్దతు ధర కొంతమేర ఊరట గానే ఉంది. కాని అది అన్నదాతలకు అందని ద్రాక్షగా మారింది .కొనుగోళ్లు సన్న గిల్లడంతో అమ్మకాలు మందగించి రైతులు రోడ్లపాలవుతున్నారు . ధాన్యపు రాశుల వద్ద రేయనక పగలనకా గడుపుతున్నారు.
సందట్లో సడే మీ అంటూ దళారులు దండుకుంటున్నారు .సచ్చినోడి పెళ్ళికి వచ్చినదే కట్నం ఉన్నట్టుగా రైతులు అనేక చోట్ల తమ ధాన్యాన్ని తెగ నమ్ముకుంటున్నారు. కనీస మద్దతు ధర ప్రకారం 1061 తెలుపు రకం ధాన్యానికి 77 కిలోల బస్తా కు గాను 1640 రూపాయలు వచ్చే అవకాశం ఉండగా ఆర్పీకే ల ద్వారా కొనుగోళ్లు అరకొరగా జరగడంతో ఈ ధాన్యం ను బస్తా 1250 నుంచి 1300 రూపాయలకే తెగ నమ్ముకోవాల్సి వస్తుంది .ఫలితంగా రైతు దాదాపు 400 రూపాయలు కోల్పోతూ ఒక్క ఎకరానికి 14 వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. అదే రకంగా ఎరుపు రంగు దాన్యం రైతులు సైతం ఇదేవిధంగా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది .సార్వాసాగు ఆరంభం నుంచి ఇప్పటివరకు పెట్టుబడి ఖర్చు ఎకరానికి 30 వేల రూపాయల వరకు ఉంటుందని రైతాంగం చెప్పుకొస్తున్నారు.
ఒక డీఏపీ కట్ట ధర 1350 నుంచి 1400 రూపాయలు పలుకుతుండగా ప్రస్తుతం కోత కోసే మిషన్కు గంటకు 3200 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ఇవి కాకుండా తదితరు ఎరువులు మందుల ధరలు అధిక మొత్తంలో ఖర్చు అవుతున్నట్టు పేర్కొంటున్నారు. ఆర్ బి కే ల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినా ఆచరణలో ఆ కార్యక్రమం పక్కాగా అమలు కావడం లేదు. ధాన్యం కొనుగోలు కోసం 5 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఇవ్వబడ్డాయి .ఇవన్నీ సక్రమంగా అమలు జరిగితే అన్నదాత కొంతైనా ఉద్దరించబడతాడు. కాని ఇందుకు సంబంధించి అనేక ఆంక్షలు ,నిర్లక్ష్యం, బాధ్యతలేని తనం రైతును నట్టేట ముంచుతుంది .ఎకరానికి 1061 తెలుపు రక్తం ధాన్యం 35 బస్తాల నుంచి 40 బస్తాల మేర దిగుబడులు వస్తున్నాయి.
అదే ఎరుపు రకం దాన్యం అయితే 40 నుంచి 50 బస్తాలమేర దిగుబడులు వస్తున్నాయి. ఈ దాన్యాన్ని సక్రమంగా సకాలంలో ఆర్.బి.కెలు కొనుగోలు చేసి మిల్లర్ల ద్వారా సక్రమంగా అమ్మకాలు చేపడితే రైతుకు ప్రభుత్వ కనీస మద్ద ధర లభిస్తుంది. అప్పుడు తెలుపు రంగు ధాన్యం పండించిన రైతు కు ఎకరానికి 57 వేల రూపాయల మద్దతు ధర సొమ్ములు లభిస్తాయి .అలాగే ఎరుపు రంగు దాన్యం పండించిన రైతులకు అయితే 60 వేలకు పైబడి చేతికి వెళ్తాయి .
కానీ రైతులకు ఎదురవుతున్న ఆటంకాలు , సవాళ్లు ఈ కనీస మద్దతు ధరను మింగేస్తున్నాయి . దీంతో ఆరు లక్షల ఎకరాల్లో కనీసం మూడు లక్షల ఎకరాల పంట దళారుల పాలవుతోంది .ఫలితంగా రైతాంగం దాదాపు 420 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.అలాగే తేమ శాతం అధికంగా ఉందంటూ సంచులు స్టాకు లేవంటూ లారీలు కొరతంటూ రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు .
ఇదిలావుండగా మరోపక్క వాతావరణం రైతులతో దోబూచులాడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫానుతో భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేయడంతో రైతుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. చేతికి వచ్చిన పంట నోటికి అందదనే భయంతో తమ ధాన్యాన్ని కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావనే బెంగ రైతు ల ముఖాల్లో కానవస్తుంది.
రైతాంగ సమస్యలపై ప్రభుత్వాలకు అధికారులకు పార్టీలకు స్పష్టమైన అవగాహన లేకపోవడం ఇందుకు కారణమనే విమర్శ బహిరంగంగా వినిపిస్తుంది. కనీసం రైతు స్థితి గతులను బాగోగులను కష్ట నష్టాలను సమాజానికి తెలియచెప్పే సాధనాలు కళ్ళు తెరవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు సాగు చేయడం కన్నా చేతులు కట్టుకుని కూర్చోవడం మేలనే పరిస్థితికి నెట్టబడతారనడంలో అతిశయోక్తి లేదు .ఈ పరిస్థితులను సినిమాలుగా తీసి కోట్లు సంపాదించు కోగలరేమోగాని నిజ జీవితంలో రైతులను ఆదుకునే “మహర్షి “మాత్రం కానరావడం లేదు.
( వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుని, ఆంధ్రులు కోరి కష్టాల గోతిలో దిగేరు.. మళ్లీ అదే పార్టీ ఎన్నికల్లో వస్తే, నాశనమైన ఆంధ్ర అధపాతాలానికే.. అందుకే ఉచిత తాయిలాలతో వారు ఓటు బ్యాంకు తయారు చేసుకున్నారు)
– వీర్ల కృష్ణ
భారతీయ జనతా పార్టీ ఓబిసి జోనల్ ఇంచార్జ్,
(అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం జిల్లాలు)